కంటైన్మెంట్‌ జోన్‌గా తిరుపతి

ABN , First Publish Date - 2021-04-21T06:34:05+05:30 IST

తిరుపతి మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌ అయ్యిందని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

కంటైన్మెంట్‌ జోన్‌గా తిరుపతి

మాల్స్‌, షాపుల వద్ద కొవిడ్‌ నిబంధనలు  అతిక్రమిస్తే జరిమానా: కలెక్టర్‌ 


తిరుపతి(రవాణా), ఏప్రిల్‌ 20: తిరుపతి మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌ అయ్యిందని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషతో కలిసి సమీక్షించారు. నగరంలో కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా మాల్స్‌, దుకాణాల వద్ద కొవిడ్‌ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ట్రేసింగ్‌, టెస్టింగ్‌ త్వరగా జరగాలన్నారు. ప్రతి అర్బన్‌ కేంద్రంలోనూ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలన్నారు. అదనపు సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని సూచించారు. డాక్టర్ల సలహామేరకే హోమ్‌ ఐసొలేషన్‌కు, ఆస్పత్రికి, కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు బాధితులు వెళ్లాలని చెప్పారు. హోమ్‌ ఐసొలేషన్‌లోని వారిని గమనిస్తూ ఉండాలని, వారింటికి స్టిక్కర్లు వేసి జాగ్రత్తలు తెలిపాలన్నారు. రోజూ ఫోన్‌ద్వారా ఆరోగ్య పరిస్థితి రికార్డు చేయాలన్నారు. పలు ప్రదేశాల్లో మార్కెట్లను ఏర్పాటు చేయాలన్నారు. గిరీష మాట్లాడుతూ.. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఇంటింటి సర్వే సెక్టోరల్‌ అధికారుల నేతృత్వంలో 102 సచివాలయాల ద్వారా చేపడుతున్నామని పేర్కొన్నారు. కొవిడ్‌ లక్షణాలున్నవారి శాంపిల్స్‌ను హెల్త్‌ సెక్రటరీలు సేకరించి ఎప్పటికప్పుడు స్విమ్స్‌, రుయాస్పత్రుల ల్యాబ్‌లకు పంపుతున్నట్లు వివరించారు. జేసీ వీరబ్రహ్మం, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుధారాణి, డీఎంహెచ్‌వో పెంచలయ్య, నగరపాలక సెక్టోరల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:34:05+05:30 IST