అమరావతి: తిరుపతి సభకు రాలేమని అమరావతి జేఏసీ కన్వీనర్‌కు సీపీఎం కారదర్శి మధు లేఖ రాశారు. తిరుపతిలో జరగనున్న సభకు తమ పార్టీని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా ఉన్న బీజేపీతో వేదిక పంచుకోవడానికి తాము సిద్ధంగాలేమని, అందువల్ల ఈ సభకు రాలేకపోతున్నందుకు విచారిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. రాజధానిని ముక్కలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నష్టదాయకమన్నారు. అమరావతి రైతు కూలీలకు, ప్రజలకు ఇచ్చిన చట్టబద్దమైన హామీలను నీరుగార్చిందని విమర్శించారు. పరిపాలన, శాసన రాజధాని అమరావతిలోనే కొనసాగాలని సీపీఐ(యం) నిశ్చితాభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు.
రైతు ఉద్యమానికి గతంలో మద్దతు తెలిపామని, భవిష్యత్తులోనూ తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్ణయానికి తమకు సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. పలుసార్లు పార్లమెంటులో అమరావతిని గుర్తించడానికి నిరాకరించిందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించలేదని, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పలు విషయాలలో బీజేపీ దగా చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని అమరావతి ఉద్యమ సభలకు, కార్యక్రమాలకు పిలవాలనే జేఏసీ వైఖరి దురదృష్టకరమని తెలిపారు. బీజేపీతో కలిసి వేదిక పంచుకోలేమని తెలియజేస్తున్నామని మధు లేఖలో పేర్కొన్నారు.