Abn logo
Apr 17 2021 @ 08:02AM

తిరుపతి, సాగర్ ఎన్నికల పోలింగ్ అప్డేట్స్...

తిరుపతి/నల్గొండ : తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ పోలింగ్‌ జరిగింది. 6 నుంచి 7 వరకు కరోనా బాధితులకు ఓటు వేసేందుకు అనుమతించారు. తిరుపతిలో సాయంత్రం 5 వరకు 55 శాతం పోలింగ్ నమోదు కాగా.. నాగార్జున సాగర్‌లో సాయంత్రం 6 గంటల వరకూ 84. 32 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 


కాగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 17,11,195 మంది కాగా.. వీరిలో మహిళలు 8,38,540 మంది. సీఎం జగన్మోహన్‌రెడ్డికి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు డాక్టర్‌ గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా.. టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతా మోహన్‌, సీపీఎం తరఫున నెల్లూరు యాదగిరి సహా మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 

గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు చేదు అనుభవం (6:00 PM)

నెల్లూరు: గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. బురదగాలి కొత్తపాళెంలో వరప్రసాద్‌ను ఓటర్లు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేతో వెళ్లిన వైసీపీ నాయకుడికి దేహశుద్ధి చేశారు. ఎమ్మెల్యే గో బ్యాక్.. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రెండేళ్లుగా తమ సమస్యలు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సంఘం అధికారులతో టీడీపీ ఎంపీల సమావేశం (16:20 PM)

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో టీడీపీ ఎంపీల సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గల్లా జయదేవ్, కనకమేడల మాట్లాడారు. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్‌లో జరిగిన ఘటనల వీడియోలను ఎంపీలు అందించారు. నకిలీ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌ల దగ్గర తిరగడం.. బస్సుల్లో నకిలీ ఓటర్లను తరలించడంపై ఫిర్యాదు చేశారు. 


తిరుపతి ఉపఎన్నికను తక్షణమే నిలిపివేయాలి: శైలజానాథ్‌ (16:00 PM)

అమరావతి: తిరుపతి ఉపఎన్నికను తక్షణమే నిలిపివేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికార యంత్రాంగం వైసీపీకి మద్దతుగా పనిచేస్తోందన్నారు. వైసీపీ ప్రభత్వం ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైసీపీకి ఓటేయాలంటూ వలంటీర్లు ప్రలోభపెడుతున్నారని శైలజానాథ్‌ అన్నారు. వైసీపీ నేతలు ఎన్నికలో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని  శైలజానాథ్‌ ధ్వజమెత్తారు.  


చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి: అప్పిరెడ్డి (3:00 PM)

అమరావతి: తిరుపతి ఉపఎన్నికలో ఓటర్లను పక్కదారి పట్టించేలా తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం టీడీపీ నేతలపై ఏపీ సీఈవో విజయానంద్‌కు అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తిరుపతి టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వెంకన్న స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తుంటే.. వారిని టీడీపీ నేతలు దొంగ ఓటర్లుగా చిత్రీకరిస్తున్నారని అప్పిరెడ్డి దుయ్యబట్టారు.


ప్రశాంతంగా తిరుపతి ఉపఎన్నిక పోలింగ్: డీజీపీ (2:00 PM)

తిరుపతి: తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ..  తిరుపతి ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు 69 ప్లటూన్ల కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. సరిహద్దుల్లో బయట వ్యక్తులు, వాహనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే సుమారు 250పైగా వాహనాలను తిప్పి పంపామన్నారు. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారనే సమాచారంతో... అనుమానితులపై నిరంతర నిఘాను ఏర్పాటు చేశామని  డీజీపీ సవాంగ్ తెలిపారు. 33,966 మందిని బైండోవర్ చేశామన్నారు. 76 లక్షల నగదు, 6884 లీటర్ల మద్యం సీజ్, 94 వాహనాలు జప్తు  చేసినట్లు డీజీపీ సవాంగ్‌ పేర్కొన్నారు.


తిరుపతిలో రీపోలింగ్ పెట్టాలి.. (1:56 PM)

తిరుపతి ఉప ఎన్నికలో ఇవాళ ఉదయం నుంచి జరిగిన పరిణామాలపై బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుపతిలో రీపోలింగ్ పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వైసీపీ ఓటమి భయంతోనే దొంగ ఓట్లు వేయిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల తీరు సరిగా లేదని రత్నప్రభ మండిపడ్డారు. మరో బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ.. తిరుపతి ఉప ఎన్నికలను తాత్కాలికంగా ఆపివేయాలని.. అక్కడ దొంగ ఓట్ల జాతర జరుగుతోందని ఆరోపించారు. పెద్ద సంఖ్యలో దొంగ ఓటర్లను నేరుగా బీజేపీ కార్యకర్తలు పోలీసులకు పట్టించినా.. స్థానిక పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా రాజన్న రాజ్యం? అని వైసీపీ సర్కార్‌పై నాగోతు కన్నెర్రజేశారు.


ఉపఎన్నిక పోలింగ్‌ను రద్దు చేయాలి.. (1:46 PM)

పార్లమెంట్ ఉప ఎన్నికలో భాగంగా.. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలోని పోలింగ్‌ను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర బలగాల సాయంతో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఉన్న ఆధారాలను పరిశీలించి మిగిలిన నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్నారు. ‘దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు ఫిర్యాదు చేసిన వారిని అరెస్టు చేయటం దుర్మార్గం. నేరాలు చేయటాన్ని అలవాటుగా మార్చుతున్నారు. పోలీసు వ్యవస్థ ఎందుకింత నిర్వీర్యమైంది..?. దేశంలో ఎన్నికల కమిషన్‌పై ఓ నమ్మకం ఉంది. అలాంటి ఈసీ పైనే ప్రజల విశ్వాసం కోల్పోయేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఈ చర్యల్ని ఈసీ ఎలా సమర్థించుకుంటుంది..?. జరిగిన పరిణామాలపై సమాధానం చెప్పకుంటే అరాచక శక్తుల దయాదాక్షిణ్యాలతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వేచ్ఛాయుత పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలేమయ్యాయి..?’ అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.


బందిపోట్లను తలపించే విధంగా.. (1:39 PM)

తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్ర చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ తప్పుడు విధానాలపై అన్ని విపక్ష పార్టీలు వరుస ఫిర్యాదులు చేశాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఉదయం నుంచి వేలాది ప్రైవేటు వాహనాల్లో బయట వ్యక్తుల్ని దించారని ఆయన ఆరోపించారు. ఉపఎన్నిక దృష్ట్యా కనీక తనిఖీలు కూడా నిర్వహించలేదన్నారు. అసలు చెక్ పోస్టులను ఎందుకు తీసేశారు..? అని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.


కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రశ్నల వర్షం..

దొంగ ఓటర్లను, వాహనాలను తెలుగుదేశంపార్టీ శ్రేణులు పట్టుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తండ్రి పేరు చెప్పలేని వాళ్లు దొంగ ఓటర్లు కాక మరేంటి..?. మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో వేలాది మందిని పెడితే పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు..?. దొంగ ఓటర్లను పట్టుకుని పోలీసు స్టేషన్‌లో అప్పగిస్తే ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నేతల్ని అక్రమంగా అరెస్టు చేశారు. బందిపోట్లను తలపించే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఎన్నికలు ఓ ఫార్సుగా మారిపోవాలా అని ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తిరుపతిలో విలేఖరుల సమావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి ఓటు ఎక్కడుంది. మంత్రులు బరితెగించి తిరుపతి పార్లమెంట్‌లో ఉంటే అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లు పోలీసుల తీరుంది. వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తుంటే, వైసీపీ ఖూనీ చేసే యత్నాన్ని నేను ఖండిస్తున్నా. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని అక్రమాలకు సమాధానం చెప్పాలి. పంపిన ప్రత్యేక బలగాలు, అధికారులు ఏమయ్యారో ఈసీ తెలపాలి అని ఇటు వైసీపీపై.. అటు కేంద్ర ఎన్నికల సంఘంపై బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


ఏబీఎన్ ఎఫెక్ట్.. ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు.. (1:29 PM)

తిరుపతి ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేస్తున్నారని, ఓ మంత్రి ఏకంగా.. వాహనాల్లో ఇతర జిల్లాల నుంచి జనాలను తరలిస్తున్నట్లు ఇవాళ ఉదయం నుంచి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో వార్తలు ప్రసారం చేసిన విషయం విదితమే. ఈ వార్తలపై ఉదయం నుంచి స్పందించని ఎన్నికల కమిషన్.. ఏబీఎన్ వరుస కథనాలతో ఎట్టకేలకు మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయనంద్ స్పందించి ఓ ప్రకటనను విడుదల చేశారు.


తిరుపతి ఉప ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోనివ్వద్దని.. పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల అధికారులను విజయానంద్ ఆదేశించారు. మరోవైపు.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పటిష్ట బందోబస్తు నడుమ ఉప ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. నకిలీ ఓట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను విజయానంద్ ఆదేశించారు. 


పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం.. నిలిపివేత (1:11 PM)

నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం పేరం కొండ పోలింగ్ కేంద్రంలో కరోనా కలకలం సృష్టించింది. పోలింగ్ అధికారికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ప్రస్తుతం ఆ పోలింగ్ అధికారిని ప్రత్యేక గదిలో ఉంచారు. ఈ విషయం పోలింగ్ కేంద్రం బయట బారులు తీరిన జనాలకు తెలియడంతో లోనికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన శానిటైజేషన్ సిబ్బంది గ్రామంలో శానిటేషన్ చేస్తున్నారు.


తిరుపతి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.. (12:53 PM)

తిరుపతి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం నుంచి అటు నెల్లూరు.. ఇటు తిరుపతిలో జరిగిన పరిణామాలపై భాను మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. అధికార పార్టీ 2 లక్షలకు పైగా దొంగ ఓట్లు వేయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు అధికార వైసీపీకి తొత్తులుగా మారారన్నారు. బీజేపీ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని భానుప్రకాష్‌రెడ్డి వెల్లడించారు.


తక్షణమే ఎన్నిక ఆపేయాలి... (12:33 PM)

తిరుపతి ఉప ఎన్నికను తక్షణమే నిలిపేయాలని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికల్లో  ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లు వేసి విజయం సాధించాలని అధికార పార్టీ చూస్తోంది. ఎన్నికల అధికారులు, పోలీసులు యంత్రాంగం మొత్తం ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దత్తుగా పని చేస్తోంది. వాలంటీర్లు బరితెగించి మరీ డైరెక్ట్‌గా ఓట్లు వేయమని ప్రజలను ప్రలోభపెడుతున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. పోలింగ్ బూత్‌లను వైసీపీ నేతలు కబ్జా చేసి మరీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారు అని శైలజానాథ్ సంచలన ఆరోపణలు చేశారు. కాగా.. దొంగ ఓట్లు అనేవి అపోహ మాత్రమేనని ఎన్నికల అధికారి చక్రధర్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.


వైసీపీ దౌర్జన్యకాండపై పనబాక ఆగ్రహం.. (12:19 PM)

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం నుంచి బూత్‌లవద్ద వైసీపీ నేతలు దౌర్జన్యకాండ కొనసాగుతోందని టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌ల వద్దకు భారీగా స్ధానికేతరులను తరలించి దొంగ ఓట్లకు పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు. కొన్నిచోట్ల తమ పార్టీకి చెందిన  ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి దౌర్జన్యంగా బయటికి పంపారని పనబాక వెల్లడించారు. ఎన్నికల్లో వైసీపి దౌర్జన్యకాండపై ఎన్మికల కమీష‌న్‌, పోలీసులకు ఫిర్యాదు చేశామని పనబాక లక్ష్మి మీడియాకు వెల్లడించారు.


కావాలనే తప్పుడు ప్రచారం.. (12:15 PM)

తిరుపతి, నెల్లూరులోని పలు ఓటింగ్ కేంద్రాల్లో దొంగ ఓట్లు వేస్తున్నట్లు.. అధికార పార్టీకి చెందిన నేతలు దగ్గరుండి ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో, పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి నుంచి పనుల కోసం బయట ప్రాంతాలకి వెళ్లినవారు.. పోలింగ్‌కు వచ్చి వారి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారని తెలిపారు. వారు ఇలా ఓటేయడానికి వస్తే కావాలనే ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.


వాలంటీర్లపై ఓటర్లు అసహనం.. ! (12:08 PM)

నెల్లూరు జిల్లా గూడూరు  పట్టణం చవటపాళెం, గిరిజన కాలనీ, ఎరుకల కాలనీ, బేల్దారి కాలనీ, అడివయ్య కాలనీలల్లో సగం మందికి ఓటరు స్లిప్పులు అందలేదు. ఆ స్లిప్స్ అన్నీ వాలంటీర్ల ఇళ్ళల్లో ఉన్నట్లు తెలియవచ్చింది. విషయం తెలుసుకున్న ఓటర్లు.. వాలంటీర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచీ నెల్లూరు జిల్లా వాలంటీర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. కొందరు వాలంటీర్లు దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓట్లేయిస్తుండగా.. మరికొందరు ఓటర్ల స్పిప్స్ తీసేసుకుని ఇళ్లలో దాచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వాలంటీర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో చిత్తూరు జిల్లాలో వరుస ఫిర్యాదులతో పది మందిని తొలగించినట్లు ఎన్నికల అధికారి చక్రధర్ బాబు వెల్లడించారు. అయితే నెల్లూరు జిల్లాలో ఇలా రెచ్చిపోతున్నా ఎలాంటి తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను.. (12:00 PM)

దొంగ ఓట్ల ఆరోపణలు, వాహనాల్లో దొంగ ఓటర్లను తరలిస్తున్నారనే ప్రతిపక్షాల సంచలన ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో ప్లాన్‌ ప్రకారమే ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం.. చాలా ప్రైవేటు బస్సులు వస్తుంటాయి. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అడ్డుకుంటున్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోంది. ప్రజల్లో బలంలేక టీడీపీ నాటకాలు ఆడుతోంది. చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు అని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.


దొంగ ఓట్లు అనేవి అపోహ అంతే.. (11:42 AM)

తిరుపతి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు వచ్చారని.. దౌర్జన్యానికి దిగి మరీ వైసీపీ నేతలు ఓట్లేయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఎన్నికల అధికారి చక్రధర్ బాబు ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. దొంగ ఓట్లు అనేవి అపోహ. గుర్తింపుకార్డు, ఓటర్ స్లిప్ ఉన్నవారికే ఓటు వేసే హక్కు ఉంటుంది. 48 గంటల ముందు నుంచి పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు పహారా నిర్వహిస్తున్నారు. అలా బయట వ్యక్తులు వచ్చే అవకాశం లేదు. వాలంటీర్ల మీద ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవం. చిత్తూరు జిల్లాలో పది మందిని తొలగించాం అని చక్రధర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో బయట వ్యక్తులు ఎవరూ లేరని.. ఇక్కడ ఓటు హక్కు ఉన్న వారిని నిశితంగా పరిశీలించి మరీ పోలింగ్ కేంద్రంలోకి సిబ్బంది పంపుతున్నారని తెలిపారు.


అపరిచితులు హల్‌‌చల్ (11:39 AM)

తిరుపతి ఉపఎన్నికలో అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌‌‌ వద్ద వందల సంఖ్యలో స్ధానికేతర యువకులు సంచరిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు గుర్తించాయి. కడప జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వైసిపి నేతల ఆధ్వర్యంలో ప్రైవేటు బస్సుల ద్వారా యువకులను తరలించినట్లు తెలియవచ్చింది. తరలించిన వారి నుంచి భారీగా దొంగ ఓట్లను వైసీపీ వేయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఉదయం ఈ దొంగ ఓట్ల వ్యవహారం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకూ అధికార పార్టీ నేతలు కానీ, పోలీసులు కానీ, పోలింగ్ అధికారులు కానీ స్పందించకపోవడం గమనార్హం.


దొంగ ఓటర్లను పట్టుకున్న రత్నప్రభ.. (11:09 AM)

నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ఓటర్లు ప్రయత్నించారని ఇవాళ ఉదయం నుంచే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం విదితమే. విషయం తెలుసుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె.. పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. తిరుపతి లోకసభ ఎన్నికల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లను యథేచ్ఛగా వేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని రత్నప్రభ వెల్లడించారు. కాగా.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు ఉన్నారని ఉదయం నుంచీ వార్తలొస్తున్నాయి. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వైసీపీలోని రెండు వర్గాల మధ్య తోపులాట.. (11:01 AM)

నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలోని 241 పోలింగ్ బూత్‌ వద్ద ఏజెంట్ల విషయంలో వైసీపీలోని రెండు వర్గాలు మధ్య తోపులాట జరిగింది. తమ వాళ్లే ఏజెంట్‌లుగా కూర్చోవాలని ఓ వర్గం వారు.. అలా కాదు తమ వాళ్లే ఏజెంట్లుగా కూర్చోవాలని మరో వర్గం వారు పోటీ పడగా అది కాస్త తోపులాట దాకా వెళ్లింది. చివరికి మధ్యాహ్నం రిలీవ్ వరకూ ఓ వర్గం వారు.. ఆ తర్వాత మరో వర్గానికి చెందిన వారు ఏజెంట్లుగా కూర్చోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది.


ఎన్నికల సరళిని పరిశీలించిన త్రివిక్రమ్ (10:45 AM)

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని ఎస్టీ ఫ్రాన్సిస్ స్కూల్ నందు తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్ సరళిని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరిగేలా చూడాలని పోలింగ్ అధికారులు, పోలీసులకు వర్మ సూచించారు.


ఓటేసిన టీడీపీ అభ్యర్థి.. (10:35 AM)

నెల్లూరు జిల్లా వెంకన్న పాలెంలోని పోలింగ్ కేంద్రంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లతో కలిసి క్యూలో నిల్చుని పనబాక ఓటేశారు. 


పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతల హడావుడి (10:30 AM)

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతల హడావుడి చేశారు. పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లి ఓటర్లను వైసీపీ  నేతలు ప్రలోభపెడుతున్నారు. అయితే.. వైసీపీ నేతలు కొందరు ఇలా చేస్తున్నారని టీడీపీ ఏజెంట్లు, పార్టీ శ్రేణులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇదే జిల్లాలో వాలంటీర్లు కూడా దగ్గరుండి మరీ పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నప్పటికీ పోలీసులు.. కనీసం పోలింగ్ అధికారులు పట్టించుకోలేదు.


7.80 శాతం పోలింగ్ నమోదు.. (10:00 AM)

తిరుపతి లోక్‌సభ స్థానంలో ఉదయం 9 గంటల వరకు 7.80 పోలింగ్ శాతం నమోదయ్యిందని పోలింగ్ ఆఫీసర్లు అధికారికంగా వెల్లడించారు. కాగా.. ఇవాళ ఉదయం నుంచి నెల్లూరు సెగ్మెంట్‌లోని పలు నియోజకవర్గాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు.. ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు ఉన్నట్లు తేలింది. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారులు కానీ.. పోలీసులు స్పందించలేదు.


ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. (9:30 AM)

తిరుపతి ఉప ఎన్నికలో ఆయా నియోజకవర్గాల పరిధిలోని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేశారు. సత్యవేడులో ఎమ్మెల్యే ఆదిమూలం ఓటేశారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అగ్రహారం పుత్తూరులో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, నెల్లూరు జిల్లా కాదలూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఓటేసిన వైసీపీ అభ్యర్థి.. (9:15 AM)

వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తిలోని మన్న సముద్రంలో ఓటర్లతో పాటు క్యూ లైన్‌లో నిల్చుని గురుమూర్తి ఓటేశారు. 


వాలంటీర్లు ఓవరాక్షన్..! (9:00 AM)

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇవాళ పోలింగ్ ప్రారంభమైనప్పట్నుంచి ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. జిల్లాలో వాలంటీర్లు పలువురు ఓవరాక్షన్ చేస్తున్నారు.! ఓటర్లని నేరుగా బూత్‌ల వద్దకి తీసుకొవచ్చి ఓటేయిస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున అధికార పార్టీ నేతలు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓట్లు బాగా వేయిస్తే అవార్డులు.. రివార్డులు ఇప్పిస్తామని, తగ్గితే ఉద్యోగాలే ఉండవంటూ కొందరు వాలంటీర్లను అధికార పార్టీ నేతలు బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేమీలేక ఉద్యోగాలు కాపాడుకోవడానికి వాలంటీర్లు ఇలా దగ్గరుండి మరీ ఓటర్లను బూత్‌లకు తీసుకెళ్లి ఓట్లు వేయిస్తున్నారట. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు (8:54 AM)

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్‌లో జరుగుతున్న అక్రమాలు, వైసీపీ దౌర్జన్యాలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్‌తో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, లారీల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలను తీసుకొచ్చారని కేంద్ర ఎన్నికల అధికారులతోకు బాబు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైసీపీ వారిని టీడీపీ శ్రేణులు పట్టుకున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చంద్రబాబు కోరారు. 


మంత్రి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు (8:51 AM)

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో దొంగ ఓటర్లు ఉన్నట్లు తేలింది. వందలాది వాహనాల్లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లు వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారులు కానీ.. పోలీసులు స్పందించలేదు. అయితే ఈ విషయాన్ని అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై ఇంతవరకూ మంత్రి పెద్దిరెడ్డి కానీ, వైసీపీ నేతలు కానీ రియాక్ట్ అవ్వకపోవడం గమనార్హం.


వైసీపీ దౌర్జన్యం (8:47 AM)

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్వగ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. శ్రీకాళహస్తి మండలం అమ్మపాళెం పోలింగ్‌ బూత్‌లో టీడీపీ, బీజేపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి రాకుండా వైసీపీ నేతలు, పలువురు కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పోలింగ్ అధికారులు, పోలీసులు అస్సలు పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. తొట్టంబేడు మండలం గుండెలుగుంటలోనూ టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అధికార పార్టీ ఇంత దౌర్జన్యం చేస్తున్నా నిలువరించాల్సిన అధికారులు, పోలీసులు వారికే వత్తాసు పలకడమేంటి..? అని స్థానిక టీడీపీ నేతలు, ఏజెంట్లు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పోలింగ్ కేంద్రంలో విషాదం.. (8:42 AM)

నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలంలోని అర‌వ‌పాళెం పోలింగ్ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న ఏపీవో ఏంబేటి ర‌వి మృతి చెందారు. చాతిలో నొప్పి రావడంతో పోలింగ్ కేంద్రంలోనే కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన తోటి అధికారులు ఆస్పత్రి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. సూళ్లూరుపేట మండంలోని నూకలపాలెంలో ఉపాధ్యాయుడిగా రవి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఖాళీగా దర్శనమిస్తున్న పోలింగ్ బూత్ (8:19 AM)

నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళెంలో పోలింగ్‌ను స్థానికులు బహిష్కరించగా.. తాజాగా శ్రీకాళహస్తిలోని ఊరందురులోనూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఓటర్లు రాకపోవడంతో పోలింగ్ బూత్ మొత్తం ఖాళీగా దర్శనమిస్తోంది. అయితే ఓటింగ్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నారన్న విషయం మాత్రం తెలియరాలేదు.


పోలింగ్ బహిష్కరణ  (8:13 AM)

నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళెంలో పోలింగ్‌ను స్థానికులు బహిష్కరించారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టలేదని అందుకే తాము ఎన్నికలను దూరంగా ఉంటున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే.. ఓటర్లు రాకపోవడంతో పోలింగ్ కేంద్రం బోసిపోయింది.


40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం.. (8:10 AM)

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట 241 పోలింగ్ కేంద్రంలో 40 నిమిషాల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మాక్ పోలింగ్ అనంతరం ఈవీఎంలు సీల్ వేయడంలో జాప్యం జరిగింది. దీంతో 40 నిమిషాల తర్వాత పోలింగ్ ప్రారంభమైంది. అప్పటికే ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. క్యూలైన్లలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.


బారులు తీరిన ఓటర్లు.. మొరాయించిన ఈవీఎంలు (8:03 AM) 

నెల్లూరు జిల్లా గూడూరు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన  పోలింగ్ స్టేషన్‌లో బూత్ నెంబర్ 47, 48 కేంద్రాలకు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. అయితే.. ఈవీఎంలు మొరాయించాయి. సుమారు అరగంటకు పైగా క్యూలోనే నిల్చుని ఉన్నారు. మరోవైపు బూత్‌ పోలింగ్ అధికారులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సరిచేస్తున్నారు.

--------------------------------------------------------------------

సాగర్‌లో పోలింగ్ పరిస్థితిని చూస్తే...

ఈ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 ఓటర్లు ఉండగా, 8151 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి. అయితే ఏకంగా 41 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో మూడు బ్యాలెట్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ సమయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పొడిగించారు. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున జానారెడ్డి, టీఆర్‌ఎస్‌ తరఫున నోముల భగత్‌, బీజేపీ తరఫున రవినాయక్‌ బరిలోకి దిగారు. సిటింగ్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ సర్వ శక్తులూ ఒడ్డగా.. తాను గెలిచి, పార్టీకి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి జానారెడ్డి తన అనుభవాన్ని అంతా రంగరించారు. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే.. దుబ్బాక ఓటమి భారం నుంచి కాస్త బయట పడవచ్చని, బీజేపీది అక్కడ అడ్డిమార్‌ గుడ్డి దెబ్బ అని ప్రచారం చేయవచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

కుటుంబ సమేతంగా ఓటేసిన జానారెడ్డి.. (11:52 AM)

నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 99వ పోలింగ్ బూత్‌లో కుటుంబ సమేతంగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి క్యూలో నిల్చుని జానా ఓటేశారు.


9.8% ఓటింగ్ శాతం నమోదు.. (9:35 AM)

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో 9 గంటల వరకు 9.8% పోలింగ్ నమోదయ్యిందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే పోలీసుల భారీ బందోబస్తు నడుమ ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.


ఇబ్రహీంపేటలో ఓటేసిన భగత్.. (9:00 AM)

ఇబ్రహీంపేటలోని పోలింగ్ బూత్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఓటేశారు. క్యూలైన్‌లో నిల్చుని భగత్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు.. సాగర్‌లోని పలు కేంద్రాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. భారీ బందోబస్తు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే సాగుతోంది.


మొరాయించిన ఈవీఎంలు.. (8:15AM)

నల్గొండ జిల్లా త్రిపురారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని బూత్ నెంబర్ 265లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. పోలింగ్ కేంద్రంకు వచ్చిన ఓటర్లంతా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. రంగంలోకి దిగిన పోలింగ్ అధికారులు ఈవీఎంలను పరిశీలిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement