ప్రశాంత ‘పురి’లో ‘సీమ’ మూక!

ABN , First Publish Date - 2021-04-17T05:22:28+05:30 IST

పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారుల ప్రకటనలను పరిహసిస్తూ పొరుగు జిల్లాలకు చెందిన అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో జిల్లాలో తిష్ఠ వేశారు.

ప్రశాంత ‘పురి’లో ‘సీమ’ మూక!
వెంకటగిరిలో కడప వ్యక్తులను ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల

ఒక్కో నియోజకవర్గంలో 200 నుంచి 300 మంది

వెంకటగిరి, నాయుడుపేటలో సమావేశాలు

అడ్డుకున్న టీడీపీ నాయకులు


నెల్లూరు, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారుల ప్రకటనలను పరిహసిస్తూ పొరుగు జిల్లాలకు చెందిన అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో జిల్లాలో తిష్ఠ వేశారు. పోలింగ్‌కు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉందనగా అజ్ఞాతం నుంచి వెలుగులోకి వచ్చి జనాల మధ్య తిరుగుతున్నారు. పోలింగ్‌ బూత్‌లు వెతుక్కొంటూ పోలింగ్‌ సమయంలో చేయాల్సిన పనుల గురించి సమావేశాలు పెట్టుకొని చర్చించుకొంటున్నారు.  ఇంకొన్నిచోట్ల పక్క జిల్లాల ఎమ్మెల్యేలు వారి మనుషులను రంగంలోకి దించి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 200 నుంచి 300 మంది వరకు రాయలసీమ జిల్లాకు చెందిన అధికార పార్టీ అనుచరులు బస చేసినట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 


 వెలుగుచూసిన ఘటనలు

వెంకటగిరి లో కడప జిల్లాకు చెందిన సుమారు 300 మంది ఒకచోట సమావేశమై చర్చించుకొంటుండగా సమాచారం తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వెళ్లి వారిని చెదరగొట్టారు. వీరంతా శ్రీకాళహస్తిలోని ఓ అతిథిగృహంలో బస ఏర్పాటు చేసుకొని వెంకటగిరి నియోజకవర్గంలో డబ్బులు పంచడం, ఓట్లు వేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు ప్రచారం. ఇక నాయుడుపేట బైపాస్‌ రోడ్డులోని ఒక హోటల్‌లో పక్క జిల్లాకు చెందిన మనుషులు పెద్ద సంఖ్యలో బస చేశారు. అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే వీరితోపాటు ఉంటూ వారి ద్వారా డబ్బులు పంపిణీ చేయిస్తున్నట్లు స్థానికులు మీడియాకు ఫిర్యాదు చేశారు. ఈ ఎమ్మెల్యే కారుకు నెంబర్‌ ప్లేట్లు తొలగించి తిరుగుతున్నారని,  తన అనుచరులతో నాయుడుపేటలో హల్‌చల్‌ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. మనుబోలు ప్రాంతంలో కర్నూలు, బాలాయపల్లిలో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తులు తిరుగాడుతున్నారు. బాలా జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాయలసీమ జిల్లాలకు చెందిన అధికార పార్టీ కార్యకర్తలు, కిరాయి మనుషులతోపాటు జిల్లా పరిధిలో ఎన్నికలు జరగని ఆరు నియోకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అధికార పార్టీ కార్యకర్తలు ఎన్నికలు జరుగుతున్న నాలుగు నియోజకవర్గాల్లో తిష్ఠ వేసినట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రశాంత నెల్లూరు జిల్లాలో ఈ ఉప ఎన్నికలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయేమోననే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు స్పందించి వెంటనే పక్క జిల్లాల వారిని పంపాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-04-17T05:22:28+05:30 IST