పోలింగ్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-04-17T04:38:03+05:30 IST

తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి శనివారం జరగనున్న పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.

పోలింగ్‌కు సర్వం సిద్ధం
వెంకటాచలంలో ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది

 వెంకటాచలం, ఏప్రిల్‌ 16 : తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి శనివారం జరగనున్న పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గంలోని వెంకటాచలంలో 52,136, ముత్తుకూరులో 47,182, మనుబోలులో 32,349, తోటపల్లిగూడూరులో 43,130, పొదలకూరులో 60,209 మొత్తం 2,35,006 ఓటర్లు ఉండగా.. వారిలో 1,14,881 మంది పురుష ఓటర్లు, 1,20,093 మంది మహిళా ఓటర్లు, 32 మంది ట్రాన్స్‌జండర్లు ఉన్నారు. వీరిలో కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న పలువురు విధుల్లో ఉండటం వల్ల 27 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరి కోసంగా 339 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. అయితే గతంలో 282 పోలింగ్‌ కేంద్రాలుండగా కరోనా ఉధృతంగా ఉండటంతో ఆదనంగా 57 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 2,100 మంది పోలీసులను మోహరించారు. అదేవిధంగా పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించడానికి ఎన్నికల కమిషన్‌ 1,492 మంది సిబ్బందిని నియమించింది. కరోనా కారణంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. శుక్రవారం సిబ్బంది ఈవీఎంలను తీసుకుని బందోబస్తు నడుమ పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలివెళ్లారు. సమస్యాత్మకమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వేపల్లి నియోజక వర్గ ఎన్నికల బాధ్యతలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నెల్లూరు నగర  కమిషనర్‌ దినేష్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.  

ముత్తుకూరు : తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం మండలంలో 71 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 మంది రూట్‌ అధికారులు ఎన్నికల నిర్వహణను పరిశీలించనున్నారు. అన్ని కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా, ఫర్నిచర్‌, ఇతర వసతులను స్థానిక వీఆర్వోలు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచే పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది సందడి మొదలయ్యింది. పోలింగ్‌ అధికారులు తమ ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో కేంద్రాలకు చేరుకున్నారు. పొట్టెంపాడులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో అక్కడి పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ సెక్టార్‌ అధికారులను ఏర్పాటు చేసి, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తహసీల్దారు సోమ్లానాయక్‌ చర్యలు తీసుకున్నారు. 

మనుబోలు : నేడు జరగనున్న తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికకు ఏరాట్లు పూర్తయినట్లు శుక్రవారం ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాల వద్ద ఆయన మాట్లాడుతూ మండలంలోని 19 పంచాయతీల్లో 47 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంకు ఒక పీవో, ఒక ఏపీవో, ఇద్దరు ఓపీవోలను నియమించారన్నారు. అంటే 47 పోలింగ్‌ కేంద్రాల్లో 188మంది అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తారన్నారు. కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎండవేడిమి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అందుబాటులో మంచినీరు, వైద్యసిబ్బంది, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యాత్మక, అతి సమస్మాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు చేశామన్నారు. కరోనా నిబంధలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రాల వద్ద ఓటర్లు భౌతికదూరం పాటించేలా 6 అడుగులకో వృత్తం గీయించి పెట్టామన్నారు. అలాగే మాస్క్‌ లేనిదే ఓటరును అనుమతించమన్నారు. సాయంత్రం 7గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు.  పోలింగ్‌ కేంద్రాల వద్ద భధ్రత కోసం మండలానికి అదనపు బలగాలు ఏర్పాటు చేశారు. సీఎస్‌ఎఫ్‌ 40మంది, స్పెషల్‌ పార్టీ 10మంది, సివిల్‌ 40 మంది, ఏఆర్‌ 20 మంది, మహిళా పోలీసులు 40 మంది వరకు వచ్చారని ఎస్‌ఐ ముత్యాలరావు తెలిపారు.


పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చూడండి

పోలింగ్‌లో అల్లర్లు, వివాదాలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ సిబ్బందికి సూచించారు. మండలంలోని అతి సమస్మాత్మక గ్రామంగా గుర్తించిన లక్ష్మీనరసింహపురంలోని పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నపాటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. షాడో టీమ్‌లు, మొబైల్‌ టీమ్‌లు గ్రామాల్లో పోలింగ్‌ అయ్యేంత వరకు సంచరిస్తూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ. ఎం. శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ కే. ముత్యాలరావు పాల్గొన్నారు. 





Updated Date - 2021-04-17T04:38:03+05:30 IST