నేడే తిరుపతమ్మ కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2021-02-26T07:15:27+05:30 IST

మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం రాత్రి పెనుగంచిప్రోలులో జరిగే తిరుపతమ్మ, గోపయ్యస్వాముల కల్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం రాత్రి 9.02 గంటలకు తిరుపతమ్మ, గోపయ్య స్వాముల కల్యాణోత్సవం జరగనుంది.

నేడే తిరుపతమ్మ కల్యాణోత్సవం

పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 25: మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం రాత్రి పెనుగంచిప్రోలులో జరిగే తిరుపతమ్మ, గోపయ్యస్వాముల కల్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం రాత్రి 9.02 గంటలకు తిరుపతమ్మ, గోపయ్య స్వాముల కల్యాణోత్సవం జరగనుంది. గతేడాది కల్యాణం నిర్వహించిన వేదిక వద్దనే భారీ సెట్టింగులతో శోభాయమానంగా ఈ ఏడాదీ వేదికను సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అమ్మవారి కల్యాణాన్ని భక్తులు తిలకించేలా ఆలయ డీఈఈ రమ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో 10 ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను ఏర్పాటు చేశారు. ఆలయానికి ఉత్తరం వైపున ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారికి ఇరుముడులు సమర్పించేందుకు వచ్చే భక్తులకు మునేటి అవతలి వైపునున్న అమ్మవారి మామిడి తోటలో సుమారు 30 వేల మందికి అన్నదాన కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో శానిటేషన్‌ పనులను సర్పంచ్‌ వేల్పుల పద్మకుమారి, వైసీపీ నాయకుడు వేల్పుల రవికుమార్‌, కాకాని హరి పరిశీలించారు. తహసీల్దార్‌ షాకిరున్నిసాబేగం తిరునాళ్ల ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. ఈవో మూర్తి మాట్లాడుతూ అమ్మవారి కల్యాణ మహోత్సవం ప్రశాంతంగా ముగిసేందుకు అధికారులు, భక్తులు సహకరించాలని కోరారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.  పోలీసులకు సీఐ చంద్రశేఖర్‌ గురువారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద పలు సూచనలు చేశారు. గురువారం ఉదయం నుంచి ఇరుముడులు సమర్పించేందుకు దీక్షా స్వాములు వస్తున్నారు. మునేటిలో నీరు తక్కువగా ఉండటంతో ఆలయం ఆధ్వర్యంలో ప్రత్యేక జల్లు స్నానాలను ఏర్పాటు చేశారు. సాయంత్రానికి ఆలయ పరిసరాలలో తిరునాళ్ల శోభ నెలకొంది. తిరునాళ్ల ఏర్పాట్లను ఈవో మూర్తితో కలిసి వేల్పుల రవికుమార్‌, వూట్ల నాగేశ్వరరావు పరిశీలించారు.  


Updated Date - 2021-02-26T07:15:27+05:30 IST