వైభవంగా తిరుపతమ్మ కల్యాణం

ABN , First Publish Date - 2021-02-27T06:11:41+05:30 IST

వైభవంగా తిరుపతమ్మ కల్యాణం

వైభవంగా తిరుపతమ్మ కల్యాణం

పెనుగంచిప్రోలు, ఫిబ్రవరి 26: తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల శుక్రవారం ఉదయం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో మూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ జ్యోతి స్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. మునేటిలో భక్తులు పుణ్య స్నానాలాచరించి పాలపొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 40 రోజుల పాటు దీక్ష చేసిన స్వాములు అమ్మవారికి ఇరుముడులు సమర్పించారు.గ్రామంలో పవిత్ర మునేటి తీరాన వేంచేసియున్న గోపయ్య సమేత తిరుపతమ్మ కల్యాణ మహోత్సవం మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం రాత్రి శోభాయమానంగా వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు. తిరపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం నుంచి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై ఉంచి, కార్యక్రమాన్ని ఈవో ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి ప్రారంభించారు. కాకాని వంశీకుల తరఫున గోపయ్య, అలేఖ్య దంపతులు, కొల్లా వంశీకుల తరఫున శ్రీనివాసరావు, శ్రీలక్ష్మీ దంపతులు పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు తీసుకొచ్చి పీఠలపై కూర్చున్నారు. ఆలయ ప్రధానార్చకుడు మర్రెబోయిన వెంకట రమణ ఆధ్వర్యంలో పురోహితుడు శివరాంబొట్ల ఆంజనేయ శర్మ అర్చక బృందం కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి కల్యాణ వేదికను సినిమా సెట్టింగుల మాదిరిగా ఆలయ డీఈఈ రమ ఇంజనీరింగ్‌ అధికారుల ఆధ్వర్యంలో శోభాయమానంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, విమలా భాను దంపతులు మఖ్య అతిథులుగా విచ్చేసి పట్టు వస్ర్తాలు సమర్పించారు. పీఠలపై తిరుపతమ్మ, గోపయ్య స్వాముల వంశీకులతో పాటు ప్రభుత్వ విప్‌ సామినేని దంపతులు, ఈవో, డీఎస్పీ నాగేశ్వరరెడ్డి దంపతులు కూర్చున్నారు. సర్పంచ్‌ వేల్పుల పద్మకుమారి, వేల్పుల రవికుమార్‌, వూట్ల నాగేశ్వరరావు, కాకాని శ్రీనివాసరావు, గూడపాటి శ్రీనివాసరావు, గింజుపల్లి నర్సయ్య, తన్నీరు నాగేశ్వరరావు, శాంభవీ పీఠాధిపతి శేషగిరిరావు శర్మ, శ్రీలక్ష్మి పాల్గొన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో ఎస్సై రామకృష్ణ బందోబస్తు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఈవోతో కలిసి సర్పంచ్‌ వేల్పుల పద్మకుమారి, సీఐ చంద్రశేఖర్‌ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా ఏనుగుమహల్‌కు చెందిన శాంభవీ పీఠాధిపతి శేషగిరిరావు శర్మ, శ్రీలక్ష్మీ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నందిగామ రూరల్‌ సీఐ సతీష్‌ అమ్మవారిని దర్శించుకుని రూ.11,116, అమ్మ, స్వామివారికి పట్టు వస్ర్తాలు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన వెల్లంకి సతీష్‌కుమార్‌, రాజేశ్వరి దంపతులు 50 గ్రాముల బంగారంతో తయారు చేసిన రెండు మంగళసూత్రాలు, నానుతాడును అమ్మవారికి విరాళంగా అందజేశారు. 


Updated Date - 2021-02-27T06:11:41+05:30 IST