సుందరకాండ పారాయణంతో మార్మోగిన తిరుమల

ABN , First Publish Date - 2021-04-11T07:04:56+05:30 IST

సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై టీటీడీ నిర్వహిస్తున్న మహామంత్ర పారాయణం శనివారంతో ఏడాది పూర్తి చేసుకుంది.

సుందరకాండ పారాయణంతో మార్మోగిన తిరుమల
సుందరకాండ పారాయణంలో పాల్గొన్న అధికారులు, భక్తులు

ఏడాది పూర్తిచేసుకున్న మహామంత్ర పారాయణం


తిరుమల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై టీటీడీ నిర్వహిస్తున్న మహామంత్ర పారాయణం శనివారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ధర్మగిరి వేదపాఠశాల ప్రిన్సిపాల్‌ కేఎస్‌ఎస్‌ అవధాని మాట్లాడుతూ.. కొవిడ్‌ను అరికట్టాలని, లోక కల్యాణార్థం టీటీడీ నిర్వహిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా మంత్ర పారాయణం విజయవంతంగా జరుగుతోందన్నారు. అలాగే సుందరకాండ పారాయణం మొదలుపెట్టి కూడా 304 రోజులైందన్నారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని సుందరకాండ పారాయణం ద్వారా బుద్ధి, బలం, ధైర్యం కల్గి సకల జీవులు ఆయురారోగ్యాలతో ఉంటాయన్నారు. గొప్ప ఉద్దేశంతో ఏడాదిపాటు చేపట్టిన మహామంత్ర పారాయణం కచ్చితంగా సత్ఫలితాలు ఇస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయన్నారు. కాగా.. సుందరకాండ 12వ విడత అఖండ పారాయణం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు జరిగింది. సుందరకాండలోని 49 నుంచి 59వ సర్గ వరకు ఉన్న 155 శ్లోకాలను అఖండంగా పారాయణం చేయడంతో తిరుమల గిరులు మార్మోగాయి. సంస్కృత వర్సిటీ అధ్యాపకుడు ఆచార్య బాల సుబ్రహ్మణ్యం.. ‘ఏమయ్య రఘు రామయ్య’ కీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారుడు మధుసూదనరావు బృందం.. ‘పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు’ అనే సంకీర్తనతో ముగించారు. ధర్మగిరి వేదపాఠశాల, ఎస్వీ వేద వర్సిటీ అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేదాఽధ్యయన సంస్థకు చెందిన వేదపారాయణదారులు, సంస్కృత వర్సిటీకి చెందిన శాస్ర్తీయ పండితులు, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కలిసి దాదాపు 200 మంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T07:04:56+05:30 IST