TTD: తిరుమలలో కొనసాగుతున్న మంత్రుల హవా

ABN , First Publish Date - 2022-08-19T01:37:29+05:30 IST

తిరుమల (Tirumala)లో సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేలా మంత్రులు నిత్యం హల్‌చల్‌ చేస్తున్నారు.

TTD: తిరుమలలో కొనసాగుతున్న మంత్రుల హవా

తిరుమల: తిరుమల (Tirumala)లో సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేలా మంత్రులు నిత్యం హల్‌చల్‌ చేస్తున్నారు. సోమవారం మంత్రి ఉష శ్రీ చరణ్‌ (Minister Usha Shri Charan) తనతో వచ్చిన 50 మందిని వీఐపీ బ్రేక్‌ దర్శనానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మంత్రి రోజా (Minister Roja) గురువారం 30మంది అనుచరులతో వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వెళ్లడమే కాకుండా దాదాపు గంటకు పైగా ఆలయంలో తిష్ట వేసి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించారు. 10 రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. దాదాపు రెండు కిలోమీటర్లు వ్యాపిస్తున్న క్యూలైన్‌లో సామాన్య భక్తులు (devotees) ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సర్వదర్శనానికి వచ్చే సామాన్య భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేలా టీటీడీ ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేరుగా కుటుంబ సభ్యులతో వచ్చే ప్రొటోకాల్‌ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కల్పిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇవేవీ పట్టనట్టు మంత్రులు మందీమార్బలంతో తిరుమల ఆలయంలో హల్‌చల్‌ చేస్తున్నారు.తమతో వచ్చినవారందరికీ వీఐపీ దర్శనాలు కేటాయించాల్సిందేనంటూ టీటీడీ (TTD)పై వత్తిడి తీసుకువస్తున్నారు. రోజా తమ నియోజకవర్గానికి చెందిన 30 మందికి ప్రొటోకాల్‌ వీఐపీ దర్శనాన్ని ఇవ్వాలని పట్టుబట్టినట్టు సమాచారం. మంత్రి కావడంతో టీటీడీ 10 ప్రొటోకాల్‌ వీఐపీ దర్శన, మరో 20 వీఐపీ దర్శన టికెట్లను కేటాయించక తప్పలేదు. ఇవన్నీ పక్కనపెడితే మంత్రి వీఐపీ బ్రేక్‌ మొదలు నుంచి తమ అనుచరులందరికీ దర్శనం పూర్తయ్యేవరకూ దాదాపు గంటకుపైగా ఆలయంలో తిష్ట వేశారు.

Updated Date - 2022-08-19T01:37:29+05:30 IST