డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం

ABN , First Publish Date - 2021-11-30T09:03:39+05:30 IST

తిరుమల శ్రీవారి అర్చకులు అనగానే వెంటనే మదిలో మెదిలే రూపం డాలర్‌ శేషాద్రి!. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి నాలుగున్నర దశాబ్దాలుగా శ్రీనివాసుడి సేవలో తరించిన పాల శేషాద్రి అలియాస్‌ డాలర్‌ శేషాద్రి(73) ఇకలేరు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై విశాఖలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం

  • గుండెపోటుతో కన్నుమూసిన తిరుమల తిరుపతి ప్రత్యేక అధికారి 
  • విశాఖలో జరిగే కార్తీక దీపోత్సవానికి హాజరు
  • సోమవారం తెల్లవారు జామున అస్వస్థత
  • ఆస్పత్రిలో చేర్పించిన సిబ్బంది.. అక్కడే తుదిశ్వాస
  • నిత్యసేవల నుంచి బ్రహ్మోత్సవాల వరకు 
  • 1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి జీవితం
  • ప్రముఖులు, సెలబ్రిటీలతో విశేష అనుబంధం
  • తిరుమలకు ఎవరొచ్చినా.. శేషాద్రి ఉండాల్సిందే
  • మరణవార్త విని ప్రముఖుల దిగ్ర్భాంతి


(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్‌): తిరుమల శ్రీవారి అర్చకులు అనగానే వెంటనే మదిలో మెదిలే రూపం డాలర్‌ శేషాద్రి!. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి నాలుగున్నర దశాబ్దాలుగా శ్రీనివాసుడి సేవలో తరించిన పాల శేషాద్రి అలియాస్‌ డాలర్‌ శేషాద్రి(73) ఇకలేరు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురై విశాఖలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శ్రీవారి సేవలో తరించడమే తన జన్మకు సార్థకత అని పదే పదే చెప్పిన ఆయన.. ఆ జగన్నాథుని సేవలోనే తన జీవితాన్ని ముగించారు. విశాఖపట్నంలో సోమవారం నిర్వహించే కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు.. టీటీడీ బృందంతో ఆదివారం ఆయన విశాఖకు వచ్చారు. ఎంవీపీ కాలనీలోని టీటీడీ కల్యాణ మండపంలో బస చేశారు. అదేరోజు సాయంత్రం సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బందితో కలివిడిగా మాట్లాడారు. వారితో కలిసి ఫొటోలు కూడా దిగారు. అనంతరం బస చేసిన చోటకు వెళ్లి టీటీడీ కళ్యాణమండపంలో జరిగిన శ్రీవారి ఏకాంతసేవలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే నిద్రించారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒంట్లో నలతగా ఉందని, గుండెపోటు సంకేతాలు కనిపిస్తున్నాయని సహచరులకు చెప్పా రు. దీంతో శేషాద్రిని హుటాహుటిన స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 5.30 గంటల సమయంలో శేషాద్రి తుదిశ్వాస విడిచా రు. ఎంబాల్మింగ్‌  ప్రక్రియ అనంతరం సోమవారం ఉదయం 10 గంటల సమయంలో భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో తిరుపతికి తరలించారు. 

 

ఇంతింతై.. అన్నట్టుగా!

1948, జూలై 15న జన్మించిన పాల శేషాద్రి 1978, జనవరి 6న టీటీడీలో గుమస్తాగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1979లో ఉత్తర పారుపత్తేదారుగా, తర్వాత జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌గా, సూపరింటెండెంట్‌, పారుపత్తేదారుగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2006, జూలై 31న రిటైరైనప్పటికీ ఆయన సేవలు అవసరమనే ఉద్దేశంతో టీటీడీ ఓఎస్డీగా నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీవారి సేవలో శేషాద్రి తరించారు. శ్రీవారికి నిత్యం జరిగే సుప్రభాతం, ఏకాంత సేవల నుంచి బ్రహ్మోత్సవాల్లో శేషాద్రి పాల్గొనేవారు. శ్రీవారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పూలతో అలంకరించడంలో ఆయనది అందెవేసిన చేయి.  


సన్నిధే సర్వస్వం!

శేషాద్రికి శ్రీవారి సన్నిధే సర్వసం. ఇంటికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. వయసు రీత్యా శేషాద్రికి అనేకమార్లు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో కూడారెండుమూడు రోజులకు మించి ఇంట్లో ఉన్న సందర్భాలు లేవు. అధికారులు ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతున్నా ‘నాకేం కాదు. అయినా, పోతే.. స్వామి సేవలోనే పోవాలి’ అనేవారు. 


ఆరోపణలు వచ్చినా.. 

డాలర్‌ శేషాద్రిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎక్కువే ఉన్నాయి. 2006లో బొక్కసం సెల్‌లో విధులు నిర్వహిస్తున్న శేషాద్రిపై శ్రీవారి పసిడి డాలర్ల మిస్సింగ్‌ అభియోగాలు వచ్చాయి. దాదాపు 300 డాలర్లు మాయమవడంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. శేషాద్రిని సస్పెండ్‌ చేసి, టీటీడీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ కేసులో శేషాద్రి ప్రమేయం లేదని హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో 2009లో ఆయన తిరిగి స్వామి సేవలో చేరారు. 


స్వామి దర్శనం.. శేషాద్రి పలకరింపు!

తిరుమలకు వచ్చే వీవీఐపీలు శ్రీవారిని దర్శించుకున్నప్పటికీ శేషాద్రిని పలకరించకుండా తిరిగి వెళ్లేవారు కారు. ప్రధాని, ముఖ్యమంత్రుల నుంచి రాష్ట్రపతి వరకు ఎవరొచ్చినా శేషాద్రి దగ్గరుండి స్వామి దర్శనం చేయించడం, ప్రసాదాలు అందించడంలో ముందుండేవారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషలపై పట్టుండడంతో ఆలయ విశేషాలను, చరిత్రను వివరిస్తూ వీవీఐపీలకు శేషాద్రి దగ్గరయ్యారు. మాజీ గవర్నర్‌ నరసింహన్‌, నేటి సుప్రీం కోర్టు సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ వరకు చాలా మంది ప్రముఖులు ఆలయం వెనకున్న శేషాద్రి ఇంటికి వెళ్లి మరీ పలకరించిన సందర్భాలున్నాయి. అలాగే, ఆయనకు ఫొటో కలెక్షన్‌ అంటే చాలా ఇష్టం.  


శేషాద్రి ‘మామ’

శేషాద్రి పూర్వీకులది తమిళనాడులోని కంచి. తర్వాత కాలంలో వీరు తిరుపతికి వచ్చి స్థిరపడ్డారు. రాజగోపాల్‌ తాతాచార్యులు, భూమాదేవి దంపతులకు 1948, జూలై 15న తిరుపతిలో శేషాద్రి జన్మించారు. శేషాద్రికి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. శేషాద్రి సతీమణి పేరు చంద్ర. శేషాద్రి అక్క, బావల వద్దే ఆమె ఉన్నారు. తిరుపతి ఎస్వీ హైస్కూల్‌లో 12వ తరగతి చదివిన శేషాద్రి తరువాత బీఎస్సీ, ఎమ్మెస్సీ ఎస్వీ యూనివర్సిటీలోనే పూర్తి చేశారు. తిరుమల అంతర్గత రాజకీయాలు రోడ్డున పడకుండా ‘శేషాద్రి మామ’గా కాపాడుకుంటూ వచ్చారు. బ్రాహ్మణ, బ్రాహ్మణేతర అనే భేదం లేని వ్యక్తిత్వం ఆయన్ను అందరికీ దగ్గర చేసింది.   


కంటతడి పెట్టిన ధర్మారెడ్డి

శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రి శ్రీవారిసేవలో ఉండగానే తుదిశ్వాస విడవాలని కోరుకునేవారని అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. శేషాద్రి మరణవార్త విని ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు.  


తీరని లోటు: ఉపరాష్ట్రపతి, జస్టిస్‌ రమణ, బాబు

టీటీడీ ఓఎస్డీ శేషాద్రి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి హఠాన్మరణం చాలా బాధాకరన్నారు. శేషాద్రి మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. టీటీడీకి విశేషమైన సేవలందించారని తెలిపారు. 


 నాలుగున్నర దశాబ్దాల పాటు శ్రీవారిసేవలో తరించిన శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి మరణం విచారకరమని అర్చకులు రమణదీక్షితులు పేర్కొన్నారు. శేషాద్రిని తమ కుటుంబ సభ్యుడిగానే భావిం చి, మామ అని పిలిచేవారమని ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు అన్నారు. శేషాద్రి మృతి పట్ల కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, త్రిదండి చిన్నజీయర్‌స్వామి, శృంగేరి మఠం అధిపతులు సంతాపం తెలిపారు.


‘డాలర్‌’ పేరు ఎలా వచ్చిందంటే 

శేషాది అసలు పేరు పాల శేషాద్రి. అయితే.. ఆయన డాలర్‌ శేషాద్రిగానే సుపరిచుతులు. ఓ జ్యోతిషుడి సూచన మేరకు ఆయన మేషరాశి గుర్తుతో కూడిన పెద్ద బంగారు డాలర్‌ను ధరించసాగారు. అప్పటి నుంచే ‘డాలర్‌ శేషాద్రి’ అయ్యారు. ఆ తర్వాత... 2006లో శ్రీవారి డాలర్ల కుంభకోణం వెలుగు చూసింది. దీనిలో శేషాద్రి పాత్ర ఉందనే విమర్శలు వచ్చాయి.  ‘డాలర్‌ శేషాద్రి’ పేరు స్థిరపడటానికి ఇది మరో కారణం.



నేడు తిరుపతిలో అంత్యక్రియలు

హాజరుకానున్న సుప్రీం సీజే జస్టిస్‌ రమణ

డాలర్‌ శేషాద్రి భౌతిక కాయానికి మంగళవారం తిరుపతిలోని గోవింద ధామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుప్రీం కోర్టు సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ శేషాద్రికి నివాళులర్పించేందుకు తిరుపతికి రానున్నారు.


చివరిగా శ్రీవారి సేవ...

ఆదివారం రాత్రి విశాఖలో నిర్వహించిన  శ్రీవారి పవళింపు సేవలో పాల్గొన్న డాలర్‌ శేషాద్రి

Updated Date - 2021-11-30T09:03:39+05:30 IST