Tirumala: ఇప్పుడంటే హ్యాపీగా దర్శించుకుంటున్నారు గానీ.. క్రీ.శ. 1801కి ముందు కొండపైకి వెళ్లి రావాలంటే..

ABN , First Publish Date - 2022-09-29T17:40:15+05:30 IST

ఏడుకొండలపై పచ్చని చెట్ల మధ్య చల్లగాలిలో హాయిగా ఆనందనిలయంలో శ్రీనివాసుడు కొలువై వున్నాడు. కానీ ఆయన భక్తులు ఏడుకొండలూ ఎక్కి దర్శనం చేసుకునే..

Tirumala: ఇప్పుడంటే హ్యాపీగా దర్శించుకుంటున్నారు గానీ.. క్రీ.శ. 1801కి ముందు కొండపైకి వెళ్లి రావాలంటే..

ఏడుకొండలపై పచ్చని చెట్ల మధ్య చల్లగాలిలో హాయిగా ఆనందనిలయంలో శ్రీనివాసుడు కొలువై వున్నాడు. కానీ ఆయన భక్తులు ఏడుకొండలూ ఎక్కి దర్శనం చేసుకునే వెసులుబాటు తొలినాళ్లలో ఉండేది కాదు. ఆనాడు తిరుపతి పెద్ద అటవీ ప్రాంతం, వన్య మృగాలకు నిలయం. అందువలన కొండకు వెళ్లాలంటే ప్రజలు సాహసం చేయవలసి వచ్చేది. బాకాలు ఊదుతూ, డప్పులు చప్పుడు చేసుకుంటూ పెద్ద గుంపులుగా వెళ్లేవారు. ఇప్పటికీ కొందరు మైసూరు ప్రాంత భక్తులు పొడవైన బాకాలు ఊదుతూ తిరుమలకు వచ్చే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇంత శ్రమపడలేని వారు శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరుని దర్శించుకుని, కల్యాణి తీరంలో తలనీలాలు సమర్పించుకుని ఇళ్లకు వెళ్లేవారు. కరకంబాడి మార్గంలో వచ్చే వారు కపిల తీర్ధంలో తలనీలాలు అర్పించేవారు. కల్యాణి తీరంలో తలనీలాలు తీసే ప్రదేశానికి కల్యాణకట్ట అనే పేరు వచ్చింది. రవాణా వసతులు పెరిగిన తరువాత శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల చేరిన తరువాత దారి వెంబడి మంగలి బావి అనే ప్రాంతంలో కల్యాణకట్ట వెలిసింది. ఆ తరువాత క్రమంగా శ్రీవారి ఆలయ సమీపాన, పుష్కరిణి ఒడ్డున తలనీలాలు సమర్పించే ఏర్పాటు జరిగింది. తరువాతి కాలంలో టీటీడీయే అధునాతన వసతులతో కల్యాణకట్ట నిర్మించింది.



క్రీ.శ. 1801కి ముందు కొండపైకి వెళ్లి రావాలంటే ప్రతి యాత్రికుడూ 24 దుగ్గాండ్లు (12 అణాలు- 75 పైసలు) రుసుము చెల్లించవలసి ఉండేది. పూజారులకు, జంగం, బైరాగి, దాసరి వంటి బీదవారికి మినహాయింపు ఉండేది. కానీ 1801లో బ్రిటీషు వారు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఈ వెసులుబాటు కూడా పోయింది. అందరూ రుసుము చెల్లించి కొండపైకి వెళ్లవలసి వచ్చేది. ఇందుకోసం రాస్తాకావలి వారు ఉండేవారు.

Updated Date - 2022-09-29T17:40:15+05:30 IST