అశ్వవాహనంపై కల్కి కటాక్షం

ABN , First Publish Date - 2020-10-24T11:55:42+05:30 IST

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మలయప్పస్వామి కల్కి అవతారమెత్తి అశ్వవాహనంలో దర్శనమిచ్చారు.

అశ్వవాహనంపై కల్కి కటాక్షం

తిరుమల,అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మలయప్పస్వామి కల్కి అవతారమెత్తి అశ్వవాహనంలో దర్శనమిచ్చారు. రంగనాయక మండపంలో అలంకార భట్టాచార్యులు, అర్చకులు ఉత్సవమూర్తికి అలంకారం చేశారు.అనంతరం కల్యాణోత్సవమండపానికి ఊరేగింపుగా వెళ్లి కాంతులీనుతున్న అశ్వంపై స్వామివారు ఆశీనులయ్యారు. రాత్రి 7గంటలకు ప్రారంభమైన అశ్వవాహన సేవలో జీయర్‌స్వాములు, అర్చకులు దివ్యప్రబంధం, వేదపారాయణం, శాత్తుమొర నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు.అశ్వవాహనసేవతో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోని వాహనసేవలన్నీ పూర్తయ్యాయి. కాగా, శుక్రవారం ఉదయం 8 గంటలకు స్వర్ణ రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహనసేవను నిర్వహించారు.  స్వర్ణరథాన్ని మాడవీధుల్లో ఊరేగించలేని క్రమంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని రథం తరహాలో తయారుచేసిన సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.


శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, జీయర్‌స్వాములు, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఆలయంలోని అయిన మహల్లో స్నపన తిరుమంజనం, మినీ పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచ్చిపై ఉత్సవమూర్తులు దర్శనమిస్తారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్తవనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు విజయదశమి పార్వేట ఉత్సవం శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో నిర్వహిస్తారు.

Updated Date - 2020-10-24T11:55:42+05:30 IST