వైభవంగా రాములవారి తీర్థ మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-01-18T05:56:13+05:30 IST

పట్టణంలో రాములవారి తీర్థ మహోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. సంతబయలులో పెదరామస్వామి తీర్థంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అదరహో అనిపించింది.

వైభవంగా రాములవారి తీర్థ మహోత్సవాలు
పెదరామస్వామి తీర్థానికి హాజరైన జనాలు

పురవీధుల్లో మేళతాళాలతో ఘటాల ఊరేగింపు

అదరహో అనిపించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారుల కోలాటాలు


అనకాపల్లి టౌన్‌, జనవరి 17: పట్టణంలో రాములవారి తీర్థ మహోత్సవాలు సోమవారం వైభవంగా జరిగాయి. సంతబయలులో పెదరామస్వామి తీర్థంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అదరహో అనిపించింది. కళాకారులు ఒకరిని మించి ఒకరు తమ ప్రతిభను చాటిచెప్పారు. అలాగే చిన్నారులు చేసిన కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తీర్థానికి వచ్చిన వారు పిల్లలను రంగులరాట్నాలు ఎక్కించి సరదాగా గడిపారు. అలాగే కర్జూరం, పంచదార చిలకలను కొనుగోలు చేశారు. సంతబయలు పెదరామస్వామి ఆలయంలో వైసీపీ నాయకుడు దాడి రత్నాకర్‌ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు మళ్ల రాజా, బొడ్డేడ శంకరరావు, కోరిబిల్లి పరమేష్‌, కాండ్రేగుల కృష్ణఅప్పారావు, మళ్ల శ్రీను, వామాల కాశీ, కొణతాల సత్యనారాయణ పాల్గొన్నారు. దిబ్బవీధి రామాలయం వద్ద జరిగిన తీర్థంలో భక్తులు భజనలు చేశారు. మళ్లవీధి రామాలయం వద్ద సీతారాముల లక్ష్మణలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన కళాఖండాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా మంచు శివలింగం అందరినీ ఆకట్టుకుంది. దేవస్థానం పెద్దలు సరిసా నూకరాజు, మళ్ల సత్యనారాయణ, కొణతాల సూరిఅప్పారావు, కాండ్రేగుల నాయుడు పాల్గొన్నారు. తీర్థాలు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. 


తుమ్మపాల: మండలంలోని మార్టూరు, మామిడిపాలెం, చేనుల అగ్రహారం గ్రామాల్లో సోమవారం సీతారాముల తీర్థాలు కన్నులపండువగా జరిగాయి. ఉదయం నుంచి రామాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో మేళతాళాలతో ఘటాలను ఊరేగించారు. సాయంత్రం తీర్థం సందర్భంగా ఆలయాల వద్ద  తినుబండారాలు, పిల్లల ఆట వస్తువులు, గృహోపకరణాల అమ్మకాలు జోరుగా సాగాయి. తీర్థాల నిర్వాహకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తీర్థాల్లో పాల్గొని ఆనందోత్సవాల మధ్య గడిపారు. మార్టూరు గ్రామంలో గుర్రపు పందాలను నిర్వహించి విజేతలకు సర్పంచ్‌ కరణం రెవెన్యూనాయుడు, ఎంపీటీసీ మిద్దె రాజా చంద్రరావు బహుమతులను అందజేశారు. 

Updated Date - 2022-01-18T05:56:13+05:30 IST