అత్తారింటికి వెళ్లేముందు కొత్త కోడలు తప్పకుండా తెలుసుకోవలసిన 4 విషయాలు!

ABN , First Publish Date - 2021-12-27T15:46:54+05:30 IST

పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది.

అత్తారింటికి వెళ్లేముందు కొత్త కోడలు తప్పకుండా తెలుసుకోవలసిన 4 విషయాలు!

పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది. జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక సంబంధం ఏర్పడుతుంది. దీంతోపాటు అత్తమామల ఇంట్లో ఆమెకు కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంబంధాలను అత్తవారింటిలో అడుగుపెట్టే కొత్త కోడలు చక్కగా నిలబెట్టుకోవాలి. ఇందుకోసం ఆమె ముందుగానే మానసికంగా సిద్ధమై, అనుబంధాల విషయంలో బలమైన పునాది వేసుకోవాలి.  అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆచారసంప్రదాయాలను తెలుసుకోండి

అత్తారింట్లోకి అడుగు పెట్టేముందు కొత్త కోడలు అక్కడి ఆచారసంప్రదాయాలను ముందుగా తెలుసుకోవాలి. కొత్త తరానికి, పాత తరానికి కనెక్ట్ అయ్యేందుకు ఆచారాలు దోహదపడతాయి. అత్తగారితో, మామగారితో, ఇతర పెద్దలతో బలమైన సంబంధం ఏర్పడాలంటే ఆ కుటుంబపు సంప్రదాయం, ఆచార వ్యవహారాలను నవవధువు తెలుసుకోవాలి. ఇంటికి సంబంధించిన బాధ్యతలు నిర్వహించేందుకు ముందుకు రావాలి. వాటిని హృదయపూర్వకంగా చేయాలి. నూతన వధువు ఇలా నడుచుకుంటే అత్తవారింటిలోని పెద్దల ఆప్యాయత, ఆశీస్సులు సులభంగా అందుకుంటారు. 

2. అత్తవారింటిలోని వారి ఆసక్తులు తెలుసుకోండి

వివాహం తర్వాత అత్తవారింటిలో అడుగుపెట్టే నవ వధువు.. అత్తామామలతో పాటు మరిది, ఆడపడుచులు, బావగారు మొదలైవారి ప్రేమను అందుకుంటారు. ఇటువంటి సందర్భంలో కొత్తకోడలు.. అత్తవారింటిలోని వారి ఆసక్తులు, అభిరుచులు తెలుసుకోవాలి. తద్వారా వారికి ఇష్టమైన పనులు చేస్తూ, వారి ఆదరణను అందుకోవాలి. ఇటువంటి ప్రవర్తన కొత్త కోడలు సులభంగా అత్తవారింటిలోని వారితో కలిసిపోయేందుకు దారితీస్తుంది. ఫలితంగా అత్తవారింటిలో ఆనందాలు వెల్లివిరుస్తాయి.


3. అత్తవారింటిలోని చిన్న పిల్లలతో కనెక్ట్ అవ్వండి

అత్తవారి ఇంటిలోని పెద్దలతో కలసిపోయనట్లే కొత్త కోడలు ఆ ఇంటిలోని చిన్నపిల్లలతోనూ మంచి అనుబంధం ఏర్పరుచుకోవాలి. చిన్నపిల్లల మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. చిన్నపిల్లల అలికిడి ఆ ఇంటిని ఆనందంలో ముంచెత్తుతుంది. అత్తవారింటిలోకి అడుగుపెట్టిన కొత్త కోడలు అక్కడున్న చిన్నారులతో సులభంగా కలసిపోగలుగుతుంది. తద్వారా ఆమెకు ఆ ఇంటిలోని పెద్దవారితోనూ గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. పిల్లల ఇష్టాలను తెలుసుకుని వారితో వీలైనంత సమయం గడపడం ద్వారా అందరూ కొత్తకోడలుపై మరింత ప్రేమను కురిపిస్తారు. 

4 సంబంధాలను బలోపేతం చేయండి

అత్తారింటిలో అడుగు పెట్టిన వధువు అక్కడున్నవారందరికీ పరిచయం అవుతుంది. వరుని బంధువులంతా ఆమెకు పరిచయం అవుతారు. ఇటువంటి సమయంలో కొత్తకోడలు తన బంధువులను కూడా అత్తారింటిలోని అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేయాలి. ఫలితంగా ఇరు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఈ సంబంధాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలి. అందుకోసం వీలైనప్పుడు చిన్నపాటి పార్టీలను ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వలన వివాదాలకు తావులేని కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతాయి.

Updated Date - 2021-12-27T15:46:54+05:30 IST