ఖరీఫ్‌కు సకాలంలో నీరు

ABN , First Publish Date - 2022-05-19T06:34:50+05:30 IST

జిల్లాలో సాగునీటి జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని, ఖరీఫ్‌కు సకాలంలో నీటిని విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు.

ఖరీఫ్‌కు సకాలంలో నీరు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బూడి ముత్యాలనాయుడు.

జలాశయాల నుంచి నీటి విడుదల తేదీలను ముందుగానే ప్రకటించాలి

జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి ముత్యాలనాయుడు

జూలై 15 నుంచి తాండవ, పెద్దేరు; 20 నుంచి రైవాడ, కోనాం కాలువలకు నీరు విడుదల

జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి వెల్లడి


అనకాపల్లి, మే 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగునీటి జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని, ఖరీఫ్‌కు సకాలంలో నీటిని విడుదల చేయాలని  పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం, తదితర జలాశయాల నుంచి ఆయకట్టుకు నీటి విడుదల తేదీలను ఖరారు చేసుకుని, రైతులకు ముందుగానే తెలియపరచాలని సూచించారు. వ్యవసాయ, నీటి పారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సాగునీటి విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ విషయంలో గతంలో ఎదురైన సమస్యలు, లోపాలను సరిదిద్దుకోవాలని స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖకు చెందిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. 

జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి మాట్లాడుతూ, జిల్లాలో వివిధ నీటి వనరుల కింద 2,05,993 ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. తాండవ, పెద్దేరు రిజర్వాయర్‌ల నుంచి జూలై 15న, రైవాడ, కోనాం జలాశయాల నుంచి జూలై 20న నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, వ్యవసాయ శాఖ జేడీ లీలావతి, నీటి పారుదల శాఖ డీఈ త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T06:34:50+05:30 IST