సకాలంలో నైరుతి

ABN , First Publish Date - 2021-05-07T09:29:52+05:30 IST

అన్నదాతలకు భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నిర్ణీత సమయంలో అటు దేశంలోకి, ఇటు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు గురువారం

సకాలంలో నైరుతి

జూన్‌ 9న రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

వచ్చేనెల 1న కేరళ తీరాన్ని తాకే అవకాశం

వానాకాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం: వాతావరణ శాఖ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నిర్ణీత సమయంలో అటు దేశంలోకి, ఇటు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు గురువారం ప్రకటించింది. జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోకి జూన్‌ 9న ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని, రాష్ట్రంలో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌లో నైరుతి ఆగమనం, వర్షపాతం నమోదుపై భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ గురువారం ముందస్తు అంచనాల నివేదికను వెల్లడించింది. ఆ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎం.రాజీవన్‌ ఈ మేరకు వివరాలు తెలిపారు.


ఈ నెల 15న రుతుపవనాలు, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని రాజీవన్‌ వెల్లడించారు. దీర్ఘకాలిక సగటు(ఎల్‌పీఏ)లో ఈ ఏడాది 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్‌ 16న భారత వాతావరణశాఖ తన ముందస్తు అంచనాల్లో పేర్కొనడం గమనార్హం. అయితే ఈ అంచనాల్లో 5శాతం అటుఇటుగా ఉంటుందని, దేశంలో రెండేళ్లు వరుసగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని అధికారులు వెల్లడించారు. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన నైరుతి రుతుపవనాల కదలికలపై.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు గురువారం విశ్లేషణ చేశారు. సాధారణంగా నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణలోకి ప్రవేశించటానికి 8 లేదా 9 రోజులు పడుతుంది. ఐఎండీ అంచనాలకు తగినట్లుగా నిర్ణీత సమయంలో ప్రవేశిస్తే రైతులకు మేలు జరుగుతుంది.


విత్తనాలు సకాలంలో వేసుకోవటానికి వీలు కలుగుతుంది. గత ఏడాది వానాకాలం సీజన్‌లో నిర్ణీత సమయంలో (జూన్‌ 11న) రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించాయి. వానాకాలం సీజన్‌ మొత్తం వర్షాలు దంచికొట్టాయి. 33 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టి కుండపోతగా కురిసిన వానలు... పాత లెక్కలను తుడిచేశాయి. సాధారణంగా జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వానాకాలం ఉంటుంది. కానీ, నైరుతి రుతుపవనాలు ఆ నాలుగు నెలల్లో తిరుగుముఖం పట్టలేదు. అక్టోబర్‌ నెలాఖరులో నైరుతి నిష్క్రమించింది. అల్పపీడనాలు, షీర్‌ జోన్ల ప్రభావంతో రాష్ట్ర సాధారణ వర్షపాతం కంటే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదుకావటం గమనార్హం.  

Updated Date - 2021-05-07T09:29:52+05:30 IST