రుణాలను సకాలంలో మంజూరు చేయాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-05-30T10:51:07+05:30 IST

వానాకాలంలో పంటల సాగు కోసం రైతులకు ఇబ్బందులు లేకుండా పంట రుణాలను సకాలంలో

రుణాలను సకాలంలో మంజూరు చేయాలి : కలెక్టర్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 29: వానాకాలంలో పంటల సాగు కోసం రైతులకు ఇబ్బందులు లేకుండా పంట రుణాలను సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన బ్యాంకు అధికారులకు సూచించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష సమావేశంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతుల అభివృద్ధి దృష్ట్యా పంటల సాగుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని, ఎరువులు, విత్తనాల కొనుగోలుకు ఇవి సకాలంలో అందించాలన్నారు.


జిల్లాలో వానాకాలం పంటల సాగుకు ఇప్పటి వరకు వివిధ బ్యాంకుల ద్వారా 3441 మంది రైతులకు 43.46 కోట్ల రుణాలను మంజూరు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలోని రైతులకు వీలైనంత వరకు ఎక్కువ మొత్తంలో పంట రుణాలను మంజూరు చేయాలన్నారు. రైతుల బ్యాంక్‌ ఖాతాలకు సంబంధించిన ఆధార్‌సీడింగ్‌ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాలలో జమ చేసిన వివరాలను అందజేయాలన్నారు. అలాగే మిడతల దండురాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులు అప్రమత్తంగా ఉండి వారి పంట పొలాల్లో రసాయనాలు పిచికారి చేయడం, పెద్ద శబ్దాలు చేయడం ద్వారా మిడతలు రాకుండా నివారించవచ్చని తెలిపారు.


డ్రోన్‌, ఫైరింజన్‌ మోటర్‌, రైతులు వినియోగించే స్ర్పేయింగ్‌ మిషన్లను అందుబాటులో ఉంచుకునే విధంగా రైతులకు తెలియప ర్చాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-30T10:51:07+05:30 IST