కాలం వృథా.. మూర్ఖ పద్ధతి

ABN , First Publish Date - 2020-10-30T07:30:20+05:30 IST

ఈ లోకంలో అన్నింటికంటే ముఖ్యమైనది, అన్నింటికంటే విలువైనది, వదిలితే తిరిగి పొందలేనిది, జీవితాలను శాసించేది, ఆశయాలను సాధించే అవకాశాలను అందించేది,

కాలం వృథా.. మూర్ఖ పద్ధతి

కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్‌

వ్యసనేన చ మూర్ఖాణాం నిద్రయా కలహేన వా

ఈ లోకంలో అన్నింటికంటే ముఖ్యమైనది, అన్నింటికంటే విలువైనది, వదిలితే తిరిగి పొందలేనిది, జీవితాలను శాసించేది, ఆశయాలను సాధించే అవకాశాలను అందించేది, కోరికలను సాకారం చేసుకోవడానికి సహకరించేది, దైవస్వరూపమైనది.. కాలం. మన ఆలోచనలకు, ప్రణాళికలకు, ప్రయత్నాలకు రూపాన్నిచ్చేది కాలమే.   కాలగమనమే మన జీవనయానం. అటువంటి విశిష్టమైన కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే అనుకున్న లక్ష్యాలను సాధించగలడు. జీవనసార్థక్యాన్ని పొందగలడు. కాలాన్ని వినియోగించుకోవడంలో బుద్ధిమంతులు, మూర్ఖులు ఎలా వ్యవహరిస్తారో తెలియజేసే శ్లోకమిది. ధీమంతులు.. అంటే బుద్ధిమంతుల తమ కాలాన్ని సత్కావ్య పఠనం, శాస్త్రపఠనం, శాస్త్రచర్చల వంటివాటితో గడిపి జ్ఞానాన్ని పొందుతారట. సద్విషయాల పట్ల అవగాహన పెంచుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారట.


మంచి విషయాలను తెలుసుకోవడమే కాక.. వాటిని ఆచరించి ఉత్తమ ఫలితాలను పొందుతూ, దినదినాభివృద్ధి సాధిస్తారట. ఇలాంటి దినచర్య కలిగినవారు సమాజానికి ప్రకృతికి సహాయకారులుగా, ఆదర్శంగా ఉంటారు. ఇక, మూర్ఛులు.. అనగా సద్విషయాసక్తి లేనివారు, తెలిసినా మంచిని ఆచరించనివారు , మనసుకు, ఇంద్రియాలకు వశులై కోరికల వెంట పరుగులు పెట్టేవారు, అహంకారులు, విచక్షణ లేనివారు కాలం విలువ తెలుసుకోలేక వ్యర్థంగా జీవనాన్ని గడుపుతారు. ‘వ్యసనేచ మూర్ఖాణామ్‌ నిద్రయా కలహేనవా’.. అనగా, వారు దుర్వ్యసనాలతో, అతి నిద్ర, పోట్లాటల వంటివాటితో కాలాన్ని వృథా చేస్తారని దీని అర్థం.




వీటిలో మొదటిది వ్యసనం. అంటే.. దుర్వ్యసనాలే. ప్రయోజనం లేని, సత్ఫలితాలను ఇవ్వని పనులను నిత్యం చేయడం, వాటి గురించి సమయాన్ని, ధనాన్ని, శక్తిని వెచ్చించడం మూర్ఖుల స్వభావం. వాటితో ఎలాంటి ప్రయోజాలూ ఉండకపోయినా.. తాత్కాలిక ఆనందం కోసం అవే పనులు చేస్తారు. ఇక, రెండోది నిద్ర. నిజానికది విశ్రాంతిని, ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే మహత్తర సాధనం. కానీ, శాస్త్రం సూచించిన సమయాన్ని అనుసరించి మాత్రమే నిద్రపోవాలి. అప్పుడే నిద్ర ద్వారా సత్ఫలితాలు లభిస్తాయి. అతి నిద్ర అనారోగ్యకరం. సమయం, సందర్భం మరచి ఇష్టానుసారం నిద్రపోతూ విలువైన సమయాన్ని వృథాగా గడిపి నష్టపోయేవాడు మూర్ఖుడు కాక ఇంకేమవుతాడు? ఇక మూడో దురలవాటు.. ‘కలహేన వా’.. అనగా కొట్లాటలతో, శత్రుత్వాలతో కాలాన్ని గడపడం. దీనివల్ల వారి (మూర్ఖుల) సమయమే కాక.. ఇతరుల సమయం కూడా వృథా అవుతుంది.


‘నా మాటే నెగ్గాలి. నేనన్నట్లే జరగాలి’ అనే అహంకార ధోరణి నుంచి కలహాలు వస్తాయి. ఇది మూర్ఖ జీవన పద్ధతి. కాబట్టి, ఈ శ్లోకం లోని అద్భుతమైన జీవన సంబంధ విషయాలను ఆకళింపు చేసుకుని... మూర్ఖ జీవన పద్ధతిని వదలాలి. ధీమంతుల జీవనపద్ధతిని తప్పక అనుసరిస్తూ, ఆచరిస్తూ జీవనసార్థక్యాన్ని అందరూ పొందాలి. శుభం భూయాత్‌.

- తిరునగరి లక్ష్మణస్వామి, 7337460250

Updated Date - 2020-10-30T07:30:20+05:30 IST