సమయం ఏదీ సారూ

ABN , First Publish Date - 2021-12-20T06:12:52+05:30 IST

యాసంగిలో వరి సాగు చేయవద్దని స్పష్టం చేసిన ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయం చూపడంలో మాత్రం శ్రద్ధపెట్టడంలేదు. ఆరుతడి పంటల విత్తే సమయం ముగిశాక ఈ పంటలే సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమయం ఏదీ సారూ
మోత్కూరులో యాసంగి నాటు కోసం పోసిన నారు

విత్తేకాలం ముగిశాక ప్రచారమా?

ఆరుతడి పంటలపై వ్యవసాయశాఖ బుక్‌లెట్‌

పంటకాలాన్ని పేర్కొంటూ అవగాహన

పొద్దుతిరుగుడు, నువ్వులు మినహా అన్నింటికీ ముగిసిన విత్తే సమయం

ఈ రెండు పంటలూ ఉమ్మడి జిల్లాలో తక్కువే

వరిసాగుకే రైతుల మొగ్గు

(మోత్కూరు)

యాసంగిలో వరి సాగు చేయవద్దని స్పష్టం చేసిన ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయం చూపడంలో మాత్రం శ్రద్ధపెట్టడంలేదు. ఆరుతడి పంటల విత్తే సమయం ముగిశాక ఈ పంటలే సాగుచేయాలని వ్యవసాయశాఖ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు సైతం పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచలేదు. వరిసాగు వద్దని విత్తన దుకాణాల వద్ద ప్లెక్సీలు కట్టినా, వాస్తవంగా వరి విత్తనాలే విక్రయిస్తున్నారు. దుకాణాల్లో ఆరుతడి పంటల విత్తనాలు విక్రయించడంలేదు. కేవలం కొన్ని సొసైటీలు, గ్రోమోర్‌ దుకాణాల్లో మాత్రమే ఆరుతడి విత్తనాలు దొరుకుతున్నాయి. 

ఆరుతడి పంటలు విత్తే కాలం ముగిశాక వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయాధికారులు గ్రామాల్లో ప్రచారం చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఏ పంటలు సాగుచేయాలో కూడా స్పష్టం చేయడం లేదని పేర్కొంటున్నారు. యాసంగిలో వరికి బదులు సాగు చేయాల్సిన ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ బుక్‌లెట్లు ముద్రించింది. ‘యాసంగిలో వరికి బదులు ఇతర పంటల సాగు, యాజమాన్య పద్ధతులు’ అంటూ ముద్రించిన బుక్‌లెట్లను వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా పంపిణీచేస్తున్నారు. వరికి బదులు వేరుశనగ, జొన్న, మినుములు, నువ్వులు, పెసర, శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, ఆవాలు సాగుచేయాలని ఈ బుక్‌లెట్‌లో ఉంది. అందులో సదరు పంటల విత్తే కాలం తదితర సమాచారం ఉంది. కాగా, పొద్దు తిరుగుడు, నువ్వులు మినహా అన్ని ఆరుతడి పంటల విత్తేకాలం ముగిసింది. ఇప్పుడు విత్తితే దిగుబడిపై ప్రభావం చూపడంతోపాటు, ఆలస్యంగా పంట చేతికి అందుతుందని రైతులు చెబుతున్నారు. పంట ఆలస్యంగా చేతికి వచ్చాక మార్కెటింగ్‌ సౌకర్యం లేకుంటే విక్రయానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అంతేగాక వానాకాలం పంట సాగుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ప్రస్తుతం కేవలం పొద్దుతిరుగుడు, నువ్వులు విత్తే కాలం మాత్రమే మిగిలి ఉంది. నువ్వులు జనవరి 15-ఫిబ్రవరి 15 వరకు విత్తే అవకాశం ఉంది. ఆలస్యంగా విత్తినా ఈ పంట మే చివరి వారంలో వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వరి కోతలు ముగియగానే పశువులను కాపలా కాయకుండా మేతకోసం వదిలేస్తారు. నువ్వుల పంట వేస్తే కోతుల బెడదకు తోడు పశువుల బెడద కూడా ఉంటుంది. దీంతో పంటను కాపాడుకోవడం రైతులకు ఇబ్బందిగా మారుతుంది. ఇక ఆరుతడి పంటలకు ఎర్ర, నల్లరేగడి నేలలే అనుకూలం. అయితే చౌడు, దుబ్బ చెల్కల్లో సాగుచేయాల్సిన ఆరుతడి పంటల ప్రస్తావన ఈ బుక్‌లెట్‌లో లేకపోవడం గమనార్హం.

ప్రోత్సాహమేదీ?

వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేయాలని చెబుతున్న ప్రభుత్వం వ్యవసాయాధికారుల ద్వారా కేవలం ప్రచారం చేయిస్తున్నదే తప్ప విత్తనాలు ఎక్కడ దొరకుతాయో చెప్పడం లేదు. ఆ పంటలు సాగు చేయడానికి ప్రోత్సహం కరువైందని రైతులు చెబుతున్నారు. వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలంటే దసరా పండుగ పూర్తికాగానే అక్టోబరు మాసంలో ప్రభుత్వం ముమ్మరంగా ప్రచారంచేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. అంతేగాక ఆరుతడి పంటల మార్కెటింగ్‌కు ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదు. విత్తనాలను సబ్సిడీపై అందించి ప్రోత్సహిస్తే కొందరు రైతులు ఈ పంటలవైపు మొగ్గేవారు. ప్రైవేటు సీడ్స్‌ దుకాణాల్లో ఆరుతడి పంటల విత్తనాలు అందుబాటులో లేవు. అక్కడక్కడ సింగిల్‌ విండోలు, మన గ్రోమోర్‌ కేంద్రాల్లో శనగలు, పెసర్లు, మినుములు ఉన్నా ధర ఎక్కువగా ఉంది. సబ్సిడీ లేకపోవడంతో ఈ విత్తనాలను రైతులు కొనుగోలు చేయడంలేదని దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయం లేక వరివైపే మొగ్గు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఏడాది అధికంగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి బావులు, బోర్లలో నీరు సమృద్ధిగా ఉంది. ప్రభుత్వం విద్యుత్‌ నిరంతరాయంగా అందిస్తోంది. ఇంత కాలం నీరు ఉంటే విద్యుత్‌ ఉండేది కాదు, విద్యుత్‌ ఉంటే నీరుండేదికాదు. ప్రస్తుతం సాగునీరు, విద్యుత్‌ సమృద్ధిగా ఉండగా, వరి సాగును ఎలా మానుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువు కింది భూములు, చౌడు నేలల్లో వరి మినహా ఇతర పంటలు సాగు కావు. ఇతర పంటలు విత్తే కాలం గడిచి పోయినందున మరో ఆలోచన లేకుండా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ భూమి ఉన్నవారు మాత్రం కొంత వరి సాగు తగ్గించుకుంటున్నారు తప్ప పూర్తిగా ఆరుతడి పంటలు వేయడం లేదు.

పెట్టుబడి ఖర్చు తగ్గించుకునేందుకు

ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయదని చెబుతుండటంతో రైతులు వరిసాగు పెట్టుబడిని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు. నారు పోసి నాటు వేసే బదులు ధాన్యాన్ని ఒక రోజు నానబెట్టి బురదలో చల్లుతున్నారు (అలుకుడు). మరి కొందరు రైతులు డ్రమ్‌ సీడర్‌ ద్వారా వరి విత్తనాలు విత్తుతున్నారు. దీంతో విత్తనం ఖర్చు, నాటు కూలి తగ్గి ఎకరాకు సుమారు రూ.5వేల వరకు ఖర్చు తగ్గుతోందని రైతులు చెబుతున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన బుక్‌లెట్‌ ప్రకారం

ఆరుతడి పంట విత్తే కాలం

వేరుశనగ సెప్టెంబరు 30-నవంబరు 30

శనగ         అక్టోబరు 1-నవంబరు 15

జొన్న         అక్టోబరు 30లోపు

ఆముదం అక్టోబరు 30లోపు

కుసుమ అక్టోబరు 15-నవంబరు 15

ఆవాలు అక్టోబరు 1-నవంబరు 15

మినుము నవంబరు 15-డిసెంబరు 10

పెసర         నవంబరు 15-డిసెంబరు 10

పొద్దుతిరుగుడు నవంబరు 1-డిసెంబరు 30

నువ్వులు   జనవరి 15-ఫిబ్రవరి 15 వరకు


వరి వద్దంటే పశుగ్రాసం ఎలా? : మర్రి మధు, మర్రిబాయి, మోత్కూరు మండలం

పశువులు యాసంగి వరి గడ్డినే ఇష్టంగా తింటాయి. వానాకాలం గడ్డి వేస్తే పాడిపశువులు పాలు ఎక్కువగా ఇవ్వవు. యాసంగిలో వరి సాగు చేయవద్దంటే పశుగ్రాసం ఎలా? ఆరుతడి పంటల విత్తే సమయం గడిచింది. ఇప్పుడు విత్తినా దిగుబడి సరిగా రాదు. ఆరు తడి పంటలు సాగుచేసినా కోతులు, అడవి పందులు పంటలను దక్కనివ్వవు.

వరి తప్ప వేరే పంటలు పండని పరిస్థితి : ధరావత్‌ వెంకన్ననాయక్‌, రాజుతండా, చివ్వెంల

మా తండాలో వరి తప్ప వేరే పంటలకు భూములు అనుకూలించవు. గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించిన ప్రజాప్రతినిధులే వరి సాగుచేస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయాలని, ధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదని చెబుతున్నారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంది.


దేవరకొండ డివిజన్‌లో వేరుశనగ.. 40వేల ఎకరాల్లో సాగు 

దేవరకొండ: యాసంగిలో వరి వద్దని ప్రభుత్వ సూచన మేరకు దేవరకొండ డివిజన్‌ రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టిసారించారు. డివిజన్‌లో పత్తితోపాటు వేరుశనగను రైతులు సాగుచేస్తున్నారు. దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, పీఏపల్లి, చింతపల్లి మండలాల్లో 40వేల ఎకరాలకుపైగా వేరుశనగ సాగైంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి బోరుబావులు, చెరువులు, కుంటల్లో నీరు చేరగా, డ్రిప్పులు, స్పింకర్లు ఏర్పాటుచేసుకొని రైతులు వేరుశనగ సాగుచేస్తున్నారు. దేవరకొండ వ్యవసాయ డివిజన్‌లో 2.60లక్షల ఎకరాలకుగాను ఈ ఏడాది 2లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు. 40వేల ఎకరాల్లో వేరుశనగ సాగుచేశారు. పత్తి సాగు పూర్తికావడంతో దుక్కులు దున్ని రైతులు వేరుశనగ వేస్తున్నారు. దీంతో ఈ పంట సాగు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. వేరుశనగ ఎకరానికి రూ.10 నుంచి రూ.15వేల వరకు పెట్టుబడి అవుతుండగా, రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. కొందరు రైతులు వేరుశనగతోపాటు కూరగాయలు కూడా సాగుచేస్తున్నారు.

మూడెకరాల్లో వేరుశనగ వేశా : కాసారం హనుమంతరావు, వెలమగూడెం, నేరేడుగొమ్ము మండలం

నాకున్న ఐదెకరాలకుగాను మూడెకరాల్లో రూ.45వేల వరకు పెట్టుబడిపెట్టి వేరుశనగ సాగు చేశా. మరో రెండు ఎకరాలు వేరుశనగ వేసేందుకు సిద్ధమవుతున్నా. వేరుశనగకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతోపాటు నీటివనరులు అందుబాటులో ఉండటంతో పంట దిగుబడి కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది.


సీఎం చెప్పారని..

కేతేపల్లి: సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు ఈ ఏడాది యాసంగిలో ఆరుతడి పంటలు, సన్నరకం వరి సాగు చేస్తున్నామని నల్లగొండ జిల్లా చెరుకుపల్లి గ్రామానికి చెందిన రైతులు బయ్య మల్లయ్య, మున్న నాగమ్మ, మున్న సౌడమ్మ పేర్కొంటున్నారు. వేరుశనగ చేనులో పనులు చేసుకుంటున్న వీరిని ఇటీవల అటుగా వచ్చిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలకరించారు. వేరుశనగ ఎందుకు సాగుచేస్తున్నారని వారిని ఎమ్మెల్యే అడగ్గా, యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయడం మేలని సీఎం కేసీఆర్‌ సార్‌ టీవీల్లో చెప్పడం విన్నామని, అందుకే వేరుశనగ వేశామని వారు సమాధానమిచ్చారు. దీంతో వారిని ఎమ్మెల్యే అభినందించగా, ఆయనకు పంటను చూపించారు.


చెప్పేదొకటి.. చేసేదొకటి

ప్రచారం చేస్తున్న ప్రజాప్రతినిధులే వరిసాగుకు మొగ్గు

చివ్వెంల: వరిసాగు వద్దని ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, అధికారపార్టీ ప్రజాప్రతినిధులే వరిసాగుచేస్తున్నారు. వానాకాలం సీజన్‌ మాదిరిగానే అధికారపార్టీ ప్రజాప్రతినిధులు యాసంగిలో సైతం వరిసాగుచేస్తున్నారే తప్ప ప్రభుత్వం చెప్పినట్టు ఆరుతడి పంటలకు మొగ్గుచూపడం లేదు. వీరిని ఆదర్శంగా తీసుకుంటున్న చిన్న, సన్నకారు రైతులు వరి సాగుచేస్తున్నారు. మమ్మల్ని వద్దన్నవారే వరి సాగుచేస్తుంటే మేం మాత్రం ఎందుకు మానుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. వానాకాలం సీజన్‌లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 4.69లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలో 4.17లక్షల ఎకరాల్లో వరి సాగుకానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటుచేయకపోతే రైతులు మిల్లర్లకే విక్రయించాల్సి ఉంటుంది. మిల్లర్లకు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందడమంటే కత్తిమీద సాములాంటిదేనని రైతులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-12-20T06:12:52+05:30 IST