కాంగ్రెస్‌తో సయోధ్య ముగిసింది: కెప్టెన్ అమరీందర్

ABN , First Publish Date - 2021-10-31T00:12:25+05:30 IST

కాంగ్రెస్‌తో సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి..

కాంగ్రెస్‌తో సయోధ్య ముగిసింది: కెప్టెన్ అమరీందర్

చండీగఢ్: కాంగ్రెస్‌తో సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారంనాడు తోసిపుచ్చారు. మెత్రీ సంబంధాల పునరుద్ధరణకు సమయం దాటిపోయిందని ఆయన అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీని స్థాపించనున్నట్టు కెప్టెన్ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో సయోధ్యకు మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కెప్టెన్ సన్నిహితుడు రవీన్ తుక్రాల్‌  పేర్కొన్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని కెప్టెన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అందుకు సమయం దాటిపోయిందని చెప్పారు. ఇంకెంతమాత్రం తాను కాంగ్రెస్‌లో ఉండబోవడం లేదని అన్నారు. అయితే, ప్రతి సందర్భంలోనూ తనకు బాసటగా నిలిచిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు.


ఇప్పుడే వారి పేర్లు చెప్పం...

''త్వరలోనే సొంత పార్టీ పెడుతున్నాను. రైతుల సమస్యలు పరిష్కరం కాగానే బీజేపీ, అకాలీ చీలక వర్గాలు, ఇతరులతో సీట్ల పంపకాలపై చర్చలు జరుపుతాం. పంజాబ్, పంజాబ్ రైతుల ప్రయోజనాలను కాపాడే బలీయమైన శక్తిగా పార్టీని నిలపాలనుకుంటున్నాను''అని కెప్టెన్ తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు చాలా మంది తనతో సంప్రదింపులు జరుపుతున్నారని, సమయం రాగానే వారంతా బయటకు వస్తారని చెప్పారు. అయితే వారి పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. ఇప్పటికే తన మద్దతుదారులు వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కెప్టెన్ కొనసాగేందుకు మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారంటూ కాంగ్రెస్ పేర్కొనడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. తనను మార్చాలనే నిశ్చితాభిప్రాయానికి పార్టీ ఒకసారి వచ్చిన తర్వాత ఇలాంటి వాదనలు తెరపైకి తేవడం మామూలేనని అన్నారు.


సిద్ధూను ఓడిస్తాం...

నవజ్యోత్ సింగ్ సిద్దూ, సుఖ్విందర్ రాంధ్వా వంటి ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయనను ఓడిస్తామని కెప్టెన్ అమరీందర్ స్పష్టం చేసారు.

Updated Date - 2021-10-31T00:12:25+05:30 IST