పక్కకు ఒరిగిన వాటర్‌ సంపు..

ABN , First Publish Date - 2020-10-23T10:07:31+05:30 IST

అందరూ ఆశ్చర్య పడేలా హయత్‌నగర్‌లోని 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ సంపు ఒక పక్కకు 8 ఫీట్ల ఎత్తు లేచి మరో పక్కకు ఒరిగింది

పక్కకు ఒరిగిన వాటర్‌ సంపు..

మరో పక్క 8 ఫీట్లు పైకి 

భూగర్భంలో అధిక నీరు చేరడం వల్లనే అంటున్న అధికారులు


హయత్‌నగర్‌, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి) : అందరూ ఆశ్చర్య పడేలా హయత్‌నగర్‌లోని 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ సంపు ఒక పక్కకు 8 ఫీట్ల ఎత్తు లేచి మరో పక్కకు ఒరిగింది. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హయత్‌నగర్‌లో భూగర్భ జలాలు పైపైకి వచ్చాయి. హయత్‌నగర్‌లో దాదాపు 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైన సంగతి తెలిసిందే. ఆర్‌టీసీ బస్‌ డిపోను ఆనుకుని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 1997లో గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షణలో 10 లక్షల సామర్థ్యం గల మూడు సంపులను నిర్మించారు. ఆటోనగర్‌ రిజర్వాయర్‌ నుంచి వచ్చే నీటితో వీటిని నింపి మండల గ్రామాలకు రెండు దశాబ్దాలుగా తాగునీరు అందిస్తున్నారు. 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు మొత్తం హయత్‌నగర్‌ బస్‌ డిపో, వాటర్‌ సంపుల మీద నుంచే పారుతోంది. నీటి సంపులు తడిసి ముద్దయ్యాయి. సంపుల చుట్టూ భూమి కుంగిపోయింది. గురువారం వాటర్‌ వర్క్స్‌ అధికారులు నీటి సంపును కడగడానికి వెళ్లారు. పంపుపైన నిలబడి చూడగా ఓ పక్కకు వంగినట్లు గమనించారు.


కిందకు వెళ్లి చూడగా సంపు ఉత్తరం వైపు భూమి నుంచి 8 ఫీట్ల ఎత్తుకు లేచింది. దక్షిణం వైపు భూమి కుంగి సంపు లోతుకు దిగబడింది. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. సంపు లోపల ఉన్న మెట్లు సైతం విరిగిపోయాయి. లూజ్‌ సాయల్‌ వల్ల ఇలా జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. భూమి సాధారణ స్థితికి వస్తే మాములుగా అవుతుందని అంటున్నారు. వాటర్‌ సంపుల వద్ద పని చేసే సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండబ్యూఎస్‌ ఉన్నతాధికారులతో పాటు పెద్దఅంబర్‌పేట్‌ సబ్‌ డివిజన్‌ డీఈఈ రవీంద్రనాథ్‌వర్మలు సంపును సందర్శించారు.   

Updated Date - 2020-10-23T10:07:31+05:30 IST