టిక్‌టాక్‌కి ఏమైందంటూ ట్విటర్లో గోలగోల..!

ABN , First Publish Date - 2020-07-10T17:16:05+05:30 IST

ఉన్నంట్టుండి తమ టిక్‌టాక్ ఖాతాల్లో సున్నా లైక్‌లు, సున్నా వ్యూలు కనిపించడంతో ప్రపంచ దేశాల్లో సదరు యాప్..

టిక్‌టాక్‌కి ఏమైందంటూ ట్విటర్లో గోలగోల..!

న్యూఢిల్లీ: ఉన్నంట్టుండి తమ టిక్‌టాక్ ఖాతాల్లో సున్నా లైక్‌లు, సున్నా వ్యూలు కనిపించడంతో ప్రపంచ దేశాల్లో సదరు యాప్ వినియోగిస్తున్న అనేకమంది షాక్ అయ్యారు. సాంకేతిక సమస్య కారణంగా వారి ఖాతాలతో పాటు ఇతరుల ఖాతాల్లో కూడా అదే పరిస్థితి కనిపించడంతో తీవ్ర గందరగోళం రేగింది. ఇంకొందరికి ‘‘ఫర్ యూ’’ ఫీడ్స్ కనిపించకపోవడమో లేక ‘‘రీసెట్’’ అంటూ కనిపిస్తోందనో చెబుతున్నారు. దీనివల్ల టిక్‌టాక్ అల్గారిథం రికమండ్ చేసే వీడియోలు వినియోగదారులకు కనిపించవన్న ఆందోళన వ్యక్తమైంది.


టిక్‌టాక్ సాంకేతిక సమస్యపై దాదాపు 20 వేల ఫిర్యాదులు వచ్చినట్టు ఇంటర్నెట్ వైఫల్యాల వెబ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘డౌన్ డిటెక్టర్’ పేర్కొంది. మరోవైపు ట్విటర్ వేదికగా వినియోగ దారులు టిక్‌టాక్ సమస్యపై పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ యాప్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ స్పందించింది. ‘‘కొందరు వినియోగదారులు యాప్ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీన్ని పరిష్కరించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే మీకు సమచారం తెలియజేస్తాం..’’ అని ట్వీట్ చేసింది. కాగా ఈ విషయం బయటికి పొక్కిన మరుక్షణం నుంచే అమెరికా ట్విటర్ ట్రెండింగ్‌లో ‘టిక్‌టాక్’ నెంబర్ 1 స్థానానికి చేరడం గమనార్హం.



Updated Date - 2020-07-10T17:16:05+05:30 IST