ట్రంప్‌ను కోర్టుకు లాగేందుకు సిద్ధమైన టిక్‌టాక్ ఉద్యోగులు!

ABN , First Publish Date - 2020-08-14T15:18:46+05:30 IST

చైనాకి చెందిన ప్రముఖ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌‌తో పాటు అమెరికాలోని సదరు కంపెనీ ఉద్యోగులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వాన్ని...

ట్రంప్‌ను కోర్టుకు లాగేందుకు సిద్ధమైన టిక్‌టాక్ ఉద్యోగులు!

వాషింగ్టన్: చైనాకి చెందిన ప్రముఖ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌‌తో పాటు అమెరికాలోని సదరు కంపెనీ ఉద్యోగులు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోర్టుకు లాగేందుకు సిద్ధమయ్యారు. టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై ఉద్యోగుల తరపున మరో పిటిషన్ వేయనున్నట్టు ప్రముఖ న్యాయవాది ఒకరు పేర్కొన్నారు. చైనా యాప్‌లు వియ్‌చాట్, టిక్‌టాక్‌లతో అమెరికా భద్రతకు, విదేశాంగ, ఆర్ధిక విధానాలకు ముప్పు ఉందనీ.. అన్ని సంస్థలూ 45 రోజుల్లోగా వాటి యాజమాన్యాలతో లావాదేవీలు రద్దు చేసుకోవాలని ట్రంప్ గత వారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న టిక్‌టాక్ పిటిషన్‌కు వేరుగా తాజా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ఇంటర్నెట్ విధాన న్యాయవాది మైక్ గాడ్విన్ వెల్లడించారు. అధ్యక్షుడు వెలువరించిన ఆదేశాలు చట్టవిరుద్ధం అంటూ ఇరు పిటిషన్లపై వాదనలు వినిపించనున్నట్టు ఆయన తెలిపారు.


టిక్‌టాక్‌పై అమెరికా విధించిన నిషేధం వచ్చే నెలలో అమల్లోకి రానున్నప్పటికీ... సదరు యాప్‌కి అమెరికాలో ఇప్పటికే ఉన్న 100 మిలియన్ల మంది యూజర్ల పరిస్థితి మాత్రం సందిగ్ధంలో ఉంది. వీళ్లలో చాలామంది టీనేజర్లు, యువకులే ఉన్నారు. తాజా ఉత్తర్వుల కారణంగా టిక్‌టాక్‌కు అమెరికాలో ఉన్న దాదాపు 1500 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం చట్టవిరుద్ధం కానుందా అనేదానిపైనా ఇంకా స్పష్టతలేదు. ఈ నేపథ్యంలోనే వారిలో చాలామంది తమను సంప్రదించినట్టు గాడ్విన్ వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయం కారణంగా తమ ఉద్యోగాలు, జీతాలు ప్రమాదంలో పడ్డాయంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-14T15:18:46+05:30 IST