Abn logo
Jul 1 2020 @ 02:28AM

టాలెంటే ప్రధానం..!

  • ఆ యాప్‌ కొందరికి ఆదాయ వనరు
  • మరికొందరికి సినిమా అవకాశాలు


టిక్‌టాక్‌.. నిన్నటి వరకు 12 కోట్ల మంది భారతీయుల దినచర్యలో ఒక భాగం.. ఎంతలా అంటే? వారంతా సగటున రోజుకు 38 నిమిషాలపాటు టిక్‌టాక్‌ వీడియోలతో గడిపారు.. చైనా తర్వాత అంతలా టిక్‌టాక్‌లో గడిపింది మనవాళ్లే..! కొందరు టైంపాస్‌ కోసం.. మరికొందరు పనిఒత్తిడి నుంచి దూరమవ్వడానికి టిక్‌టాక్‌ను వేదికగా మలచుకుంటే.. ఎందరెందరో సామాన్యులను రాత్రికిరాత్రే సెలబ్రిటీలను చేసిన ఘనత టిక్‌టాక్‌కే దక్కుతుంది. ఒక దశలో టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్లను పరిచయం చేసేందుకు దర్శకులు కూడా టిక్‌టాక్‌లో వేట సాగించారట..! సినిమాలు, సెలబ్రిటీ షోలలో అవకాశాలకు టిక్‌టాక్‌ను షార్ట్‌కట్‌గా భావించేవారు.. ఆ యాప్‌ను ఆదాయవనరుగా మలచుకున్నవారు ఇప్పుడు ప్రత్యామ్నాయాలను వెతుక్కొంటున్నారు.


ఉప్పల్‌ బాలూ నుంచి..

టిక్‌టాక్‌ ద్వారా పాపులరైన వ్యక్తులు ఎవరంటే..? తెలుగు వారికి ఠక్కున స్ఫురించే పేరు ‘ఉప్పల్‌ బాలు’. అనతికాలంలోనే ఓ సామాన్యుడు ఎలా సెలబ్రిటీ అయ్యాడో చెప్పడానికి అతడి ఎదుగుదలే నిదర్శనం. తన వీడియోలతో వేల మంది ఫాలోయర్లను పెంచుకుని, టీవీ షోల్లో పాల్గొనేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. అదేకోవలో.. దీప్తి సునయన ఏకంగా బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ పొందారు. ఇప్పుడిప్పుడే చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ దుర్గారావు అనే వ్యక్తి 10 లక్షలకు పైగా ఫాలోయర్లను కూడగట్టుకున్నాడు. రాంనగర్‌కు చెందిన దీనా అనే అమ్మాయి కూడా లాక్‌డౌన్‌ సమయంలో టిక్‌టాక్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాపులర్‌ అయ్యారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఒకప్పుడు ఆల్బమ్స్‌ చేతిలో పట్టుకుని.. డైరెక్టర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ఆ తర్వాతి కాలంలో యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్‌లు వారి మార్గాన్ని సుగమం చేశాయి. క్రమంగా ఆ స్థానాన్ని టిక్‌టాక్‌ ఆక్రమించింది. దర్శకులు కూడా టిక్‌టాక్‌లో ఉన్న బోలెడంత చెత్తను వడగట్టి.. ప్రతిభావంతులను ఎంచుకున్న సందర్భాలున్నాయి. ఆ కోవలోనే అదృష్టం వర్షిణి తలుపుతట్టింది. ‘ఒక అనాథ లవ్‌స్టోరీ’లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘రాక్షసుడు’ చిత్రంలో నటించిన చిన్నారికి కూడా టిక్‌టాక్‌లో చూపిన ప్రతిభ వల్లే ఆ అవకాశం లభించింది.


సెలబ్రిటీలు సైతం..

సామాన్యులే కాకుండా.. సెలబ్రిటీలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు.. సినిమాల ప్రమోషన్లకు టిక్‌టాక్‌ను వేదికగా ఎంచుకున్నారు. దీపికా పదుకొనే, శిల్పాశెట్టి, కాజల్‌ వంటి టాప్‌ బాలివుడ్‌ హీరోయిన్లు లక్షల మంది ఫాలోయర్లతో టిక్‌టాక్‌లో ఓ ఊపుఊపారు. తెలుగులో కూడా సందీప్‌ కిషన్‌, మంచువిష్ణు లాంటి వారు టిక్‌టాక్‌తో తమ అభిమానులకు మరింత దగ్గరయ్యారు.


వేలల్లో ఆదాయం.. ఇప్పుడెలా?

ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న టిక్‌టాక్‌ క్రియేటర్ల కొందరు తమ వీడియోలతో వేలల్లో ఆదాయాన్ని అర్జించేవారు. ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల నిహారికాజైన్‌ యాడ్‌ ఆధారిత వీడియోలు చేసేవారు. ఆమెకు 28 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఒక్క వీడియోకు రూ. 15 వేల నుంచి రూ. 30 వేల వరకు సంపాదించేవారు. భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించడాన్ని స్వాగతిస్తూనే.. తాను వేరే ప్లాట్‌ఫాంను వెతుక్కోవాల్సి ఉందని ఆమె చెబుతున్నారు. ఫరీదాబాద్‌కు చెందిన 23 ఏళ్ల సుకృతి జైన్‌ కూడా టిక్‌టాక్‌నే ఆదాయ వనరుగా మలచుకున్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు మహేంద్ర దోంగ్యే కూడా 14.9 లక్షల మంది యూట్యూబ్‌ సబ్‌స్ర్కైబర్లు, 90 లక్షల మంది టిక్‌టాక్‌ ఫాలోయర్లతో ఇంట్లో కూర్చొనే సంపాదించేవారు. ఇప్పుడు అలాంటి వారంతా.. ఆ గొప్పదనం తమదే కానీ, టిక్‌టాక్‌ యాప్‌ది కాదంటున్నారు. దాని స్థానంలో మరో యాప్‌ను వినియోగిస్తామని చెబుతున్నారు.

-(సెంట్రల్‌ డెస్క్‌)

Advertisement
Advertisement
Advertisement