ఫిరంగులకు తల వంచలేదు: లఖీంపూర్ ఘటనపై తికాయత్

ABN , First Publish Date - 2021-10-04T03:07:59+05:30 IST

లఖింపూర్‌లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఈ సంఘటన ప్రభుత్వ క్రూరమైన, అప్రజాస్వామిక విధానాన్ని మరోసారి బహిర్గతం చేసింది. రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఏ మేరకు దిగజారిందో, ప్రభుత్వంలో కూర్చున్నవాళ్లు ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలకు మరోసారి అవగతం చేసింది..

ఫిరంగులకు తల వంచలేదు: లఖీంపూర్ ఘటనపై తికాయత్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో కేంద్ర మంత్రి కాన్వాయ్ కిందపడి రైతులు చనిపోయిన ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పందించారు. తమ హక్కుల కోసం రైతులు ఫిరంగుల ముందు తల వంచలేదని, రైతులు చనిపోవచ్చు కానీ భయపడరని ఆయన అన్నారు. ఈ దుర్ఘటన తనను చాలా బాధించిందని, ప్రభుత్వ క్రూరమైన మనస్తత్వం, రైతులును అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న విఫల యత్నాలు ఈరోజుతో మరోసారి బయట పడ్డాయని తికాయత్ అన్నారు.


ఆదివారం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘లఖింపూర్‌లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఈ సంఘటన ప్రభుత్వ క్రూరమైన, అప్రజాస్వామిక విధానాన్ని మరోసారి బహిర్గతం చేసింది. రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఏ మేరకు దిగజారిందో, ప్రభుత్వంలో కూర్చున్నవాళ్లు ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలకు మరోసారి అవగతం చేసింది. అయినప్పటికీ తమ హక్కుల కోసం రైతులు ఫిరంగిల ముందు తలవంచలేదు. ప్రభుత్వం రైతు హృదయాన్ని పరీక్షించకూడదు. రైతులు చనిపోవచ్చు కానీ భయపడరు. 


ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని, రైతుల హంతకులపై హత్యా కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలి’’ అని అన్నారు. దీంతో పాటు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు ఒక సందేశాన్ని పంపారు. ‘‘రైతులు శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతిమ విజయం రైతులదే’’ అని తికాయత్ రాసుకొచ్చారు.

Updated Date - 2021-10-04T03:07:59+05:30 IST