Abn logo
Jul 1 2020 @ 02:10AM

టిక్‌టాక్‌ కట్‌...

  • ప్రధాని ప్రసంగం పూర్తి కాగానే యాప్‌లపై నిషేధం అమలులోకి


దేశంలో ఉన్న 7 కోట్ల ఏసీల్లో మూడో వంతు దిగుమతి చేసుకున్నవే. మిగిలినవి కూడా ఇక్కడ అసెంబుల్‌ మాత్రమే చేస్తున్నారు. 90 శాతం కంప్రెసర్లను చైనా, థాయ్‌లాండ్‌ల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. టీవీలకు భారతదేశంలో ఫ్యాబ్రికేషన్‌ యూనిటే లేదు. భారత్‌ టీవీలపై దిగుమతి సుంకాలు పెంచడంతో శాంసంగ్‌ లాంటి కంపెనీలు భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉన్న వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 

- మంత్రి పీయూష్‌ గోయల్‌తో పారిశ్రామికవేత్తలు


  • ఏసీలు, టీవీలపైనా  నియంత్రణ యోచన
  • చైనా నుంచి వాటి దిగుమతులపై ఆంక్షలు?
  • ప్రపంచ వాణిజ్య ఒప్పందాల ఉల్లంఘనే 
  • 59 యాప్‌ల నిషేధంపై చైనా ఆందోళన
  • నిషేధంతో భారత్‌కే నష్టమని వ్యాఖ్య
  • చైనా 5జీ పరిజ్ఞానానికీ భారత్‌ చెల్లుచీటీ


న్యూఢిల్లీ, జూన్‌ 30: చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన భారత్‌ ఇరవై నాలుగు గంటల్లోనే నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన కాసేపట్లోనే టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 యాప్‌లు మూగబోయాయి. దీనికితోడు చైనా నుంచి దిగుమతి చేసుకొనే ఏసీలు, టీవీలు సహా 12 రకాల వస్తువులను నియంత్రించాలని భారత్‌ యోచిస్తోంది. వీటిని దిగుమతి చేసుకోవడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. నిజానికి ఈ లైసెన్స్‌ పద్ధతికి కొద్ది నెలల క్రితమే తెర లేచింది. వివిధ దేశాల నుంచి అగరువత్తులు, టైర్లు, పామాయిల్‌ దిగుమతి చేసుకోవడానికి లైసెన్స్‌ తప్పనిసరి చేశారు. లద్దాఖ్‌ ఘర్షణల తర్వాత ఈ జాబితాలోకి చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకొనే ఏసీలు, టీవీలు, వాటి విడిభాగాలు వచ్చి చేరబోతున్నాయి.


దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దిగుమతి సుంకాన్ని భారీగా విధించడం, విడి భాగాల తయారీలో కనీస సాంకేతిక ప్రమాణాలను నిర్దేశించడం, కొన్ని రకాల వస్తువులను కొన్ని రేవుల ద్వారా మాత్రమే దిగుమతి చేసుకోవాలని షరతులు విధించడం ద్వారా దిగుమతులను నిరుత్సాహపరుస్తారు. ఇప్పటికే ఎలాంటి వస్తువుల మీద లైసెన్స్‌ నిబంధన పెట్టొచ్చని విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టరేట్‌ జనరల్‌ను ప్రభుత్వం జాబితా అడిగింది. మహీంద్ర సంస్థ ఎండీ పవన్‌ గోయంకా నేతృత్వంలో పలువురు పారిశ్రామికవేత్తలు ఇటీవల పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసినపుడు చైనా దిగుమతుల మీద ఏదో ఒకరకమైన నియంత్రణ పెట్టాలని కోరారు. 90 శాతం కంప్రెసర్లను చైనా, థాయ్‌లాండ్‌ల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. వావే వంటి చైనా కంపెనీలకు చెందిన 5జీ పరిజ్ఞానాన్ని, 5జీ ఉత్పత్తులను భారత్‌లో నిషేధించే అంశంపైనా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. సోమవారం 59 చైనా యాప్‌ల నిషేధంపై జరిగిన భేటీలోనే ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. 


భారత్‌కే నష్టం: చైనా

తమ దేశానికి చెందిన 59 యాప్‌లను నిషేధించడం వల్ల భారత్‌ ప్రయోజనాలకే నష్టం కలుగుతుందని చైనా వ్యాఖ్యానించింది. తాము మాత్రం ఇరు దేశాల మధ్య సహకారాన్నే కోరుకుంటున్నట్లు చెప్పింది. భారత్‌ నిర్ణయం పట్ల తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాలను, స్థానిక చట్టాలను పాటించాలని విదేశాల్లో పని చేస్తున్న చైనీస్‌ కంపెనీలను ఎప్పుడూ చెబుతుంటామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. కేవలం చైనా యాప్‌లను లక్ష్యంగా చేసుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జి రోంగ్‌ అన్నారు.


భారత్‌ చట్టాలను పాటిస్తాం: టిక్‌టాక్‌

టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని టిక్‌టాక్‌ భారత వ్యవహారాల అధిపతి నిఖిల్‌ గాంధీ ప్రకటించారు. ‘‘ప్రభుత్వ అధికారులు మా వివరణ ఇచ్చేందుకు మమ్మల్ని ఆహ్వానించారు. మేం భారత చట్టాలకు అనుగుణంగా  డేటా భద్రత ప్రమాణాలను పాటిస్తాం. భారతీయ టిక్‌టాక్‌ యూజర్ల సమాచారమేదీ చైనా సహా ఇతర దేశాలకు వేటికీ ఇవ్వలేదు. భవిష్యత్తులో ఎవరైనా అడిగినా ఇచ్చే ప్రసక్తే లేదు. టిక్‌టాక్‌ యూజనర్‌ వ్యక్తిగత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’’ అన్నారు.


మూడో దఫా చర్చలు 

భారత్‌-చైనా సైన్యాలు మంగళవారం మూడో దఫా చర్చలు జరిపాయి. లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో బలగాలు వెనక్కి తగ్గే విధివిధానాలను చర్చించారు. లద్దాఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమవుతున్న సరిహద్దు పోస్టులను గుర్తించారు. కాగా, చైనాలో మంగళవారం నుంచి భారతీయ వార్తా పత్రికలు, చానెళ్ల వెబ్‌సైట్లు చైనాలో పని చేయడం లేదు. చైనా ప్రభుత్వం వాటిని బ్లాక్‌ చేసి ఉంటుందని భావిస్తున్నారు. చైనాలో ఉన్న భారతీయులు భారతదేశంలో పరిణామాలు తెలుసుకోవాలంటే వర్చువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్‌(వీపీఎన్‌) ద్వారా వార్తా వెబ్‌సైట్లను చూడాల్సి వస్తోంది. 


భారత్‌కు ఫ్రాన్స్‌ మద్దతు

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్రాన్స్‌ భారత్‌కు మద్దతు ప్రకటించింది. ఫ్రాన్స్‌ సైనిక బలగాల మద్దతూ ఉంటుందని ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లే చెప్పారు. గల్వాన్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అమెరికా సెనేట్‌ సభ్యుడు, రిపబ్లిక్‌ పార్టీ నేత మార్కో రుబిరో భారత్‌కు సంఘీభావం ప్రకటించారు. చైనా పెత్తందారీ తనాన్ని ఇక సహించేది లేదనే విధంగా భారత్‌ గట్టి సమాధానం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement
Advertisement