నకిలీ విత్తనాలను కట్టడి చేయండి

ABN , First Publish Date - 2022-05-21T05:39:44+05:30 IST

నకిలీ విత్తనాల కట్టడిపై వ్యవసాయా ధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశిం చారు.

నకిలీ విత్తనాలను కట్టడి చేయండి

 జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో కలెక్టర్‌


నంద్యాల టౌన్‌, మే  20 : నకిలీ విత్తనాల కట్టడిపై వ్యవసాయా ధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి,  కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ డాక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని సెంటినరీ భవన్‌లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లైసెన్స్‌ లేకుండా విత్తనాలు విక్రయించే దుకాణాలను సీజ్‌ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని అన్నారు. నకిలీ విత్తనాల కట్టడికి మండల స్థాయి బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు నిర్వహించాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో  ప్రతి పంటను ఈ - క్రాప్‌ బుకింగ్‌ చేయడంతో పాటు ఖరీఫ్‌ సీజన్‌లో అధిక దిగుబడులు సాధించే పంటలపై రైతులకు  అవగాహన కల్పించాలని సూచించారు. సాగుకు ముందే నాణ్యమైన విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు రైతులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. 


లాభసాటి పంటలపై దృష్టి


వ్యవసాయానికి సంబంఽధించి లాభసాటి పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు.   ప్రతి గ్రామంలోని రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ హబ్‌లుగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని అన్ని సాగునీటి కాల్వలకు జూలై మొదటి వారంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు అమలు చేయబోతున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో శాండిస్‌ ఆయిల్‌ ఉత్పాదకతకు అవకాశం ఉంటుందని, ఈ మేరకు రైతులను ప్రోత్సహించాలని అధికారులను కోరారు. జిల్లాలోని రిజర్వాయర్లలో మత్స్య ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్‌ భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నకిలీ విత్తనాలకు నంద్యాల కేంద్రమనే పేరు వస్తున్నదనే విషయం గుర్తించి అధికారులు అప్రమత్తం కావాలని అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేయాలని కోరారు.  జడ్‌పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ పీపీ నాగిరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య ప్రసంగించారు. అనంతరం వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవా మొబైల్‌ వాహనాన్ని కలెక్టర్‌, ఎంపీ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌ రావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాసులు రెడ్డి, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య, ఏపీఎంఐపీ, మార్కెటింగ్‌ తదితర శాఖల అధికారులు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:39:44+05:30 IST