జూకల్‌ శివారులో పులి సంచారం

ABN , First Publish Date - 2021-10-19T04:59:36+05:30 IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండల పరిఽధిలోని జూకల్‌ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కాలనీలో ఆదివారం ఓ కూలీని పులి వెంబడించడం కలకలం రేపింది.

జూకల్‌ శివారులో పులి సంచారం
జూకల్‌ శివారులో పాదముద్రలు, పులి వచ్చిన అటవీప్రాంతం

బహిర్భూమికి వెళ్లిన కూలీని వెంబడించిన పులి

డబుల్‌ బెడ్‌రూం భవనంపైకి ఎక్కడంతో తప్పిన ప్రాణాపాయం

వెంబడించి తరిమివేసిన తోటి కూలీలు

పులితో పాటు పులికూన ఉన్నదని తెలిపిన ప్రత్యక్ష  సాక్షులు

నారాయణఖేడ్‌, అక్టోబరు 18: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండల పరిఽధిలోని జూకల్‌ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కాలనీలో ఆదివారం ఓ కూలీని పులి వెంబడించడం కలకలం రేపింది. నారాయణఖేడ్‌ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో డబుల్‌బెడ్‌రూం గృహాల నిర్మాణం కొనసాగుతున్నది. చత్తీ్‌సఘడ్‌ ప్రాంతానికి చెందిన 70 మంది కూలీలు నిర్మాణ పనులు చేస్తున్నారు. పని ప్రదేశానికి పక్కనే రేకుల షెడ్లలో నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో కూలీలు గజేంద్‌, ప్రమోద్‌, విష్ణు, శేఖర్‌  పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి బహిర్భూమికి వెళ్లారు. ప్రమోద్‌, విష్ణు, శేఖర్‌ ముందుగా నడుస్తున్నారు. వారి వెనుక వస్తున్న గజేంద్‌ తమకు కొద్ది దూరంలో పులి ఉన్నట్టు గుర్తించాడు. ముందు నడుస్తున్నవారిని పారిపోవాలని అరుస్తూ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లవైపు పరిగెత్తాడు. పులి అతడిని వెంబడించి దాడి చేసేందుకు యత్నించగా పక్కనే ఉన్న భవనం పైకి ఎక్కాడు. ఇంతలో అతడితో పాటు వచ్చినవారు తోటి కూలీలను తీసుకుని కాగడాలు, కర్రలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని చూసిన పులి భవనం పైనుంచి కిందకు దిగి మార్కెట్‌యార్డు, రైతువేదిక ఉన్న ప్రాంతం వైపు పారిపోయింది. ఆందోళనకు గురైన గజేంద్‌ భవనం పైనుంచి దూకడంతో కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి. పులితోపాటు ఒక కూన ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం కూలీలు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ రేంజ్‌ అధికారి దేవీలాల్‌ పులి, కూన సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించి పాదముద్రలు సేకరించారు. సంచరించింది పులినా లేక ఇతర జంతువా అన్నది గుర్తించాల్సి ఉన్నదని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.


నెల క్రితం కడ్పల్‌ అటవీ ప్రాంతంలో పులి సంచారం

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని కల్హేర్‌ మండలం కడ్పల్‌ అటవీ ప్రాంతంలో నెల రోజుల క్రితం మేకల కాపరులు పులిని చూశారు. అదేరోజు వ్యవసాయ బావి వద్ద కట్టేసిన లేగదూడను పులి చంపింది. తాజాగా ఖేడ్‌ మండల పరిఽధిలోని జూకల్‌ ప్రాంతంలో పులి కనిపించడంతో చుట్టు పక్కల గ్రామాలవారు ఆందోళన చెందుతున్నారు.  

Updated Date - 2021-10-19T04:59:36+05:30 IST