చిరుత కాదు.. పెద్ద పులి

ABN , First Publish Date - 2022-05-29T07:47:33+05:30 IST

ప్రత్తిపాడు మండలంలో పులి సంచారంపై శని వారం ఎట్టకేలకు ఆధారాలు లభించాయి. అరడజను పశువులను హతమా ర్చిన పులి జాడ కోసం ఫారెస్ట్‌ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో శనివారం పులి కదలికలు బయటపడ్డాయి.

చిరుత కాదు.. పెద్ద పులి

  • పోతులూరులో సీసీ కెమెరాకు చిక్కిన పెద్దపులి 
  • ప్రత్తిపాడు మండలం పోతులూరు పరిసరాల్లో పులి సంచారం
  • సీసీ ఫుటేజ్‌లో బయటపడిన పులి కదలికలు
  • భయాందోళనలో ఐదు గ్రామాల ప్రజలు
  • పులి కోసం అటవీశాఖ బృందాల గాలింపు చర్యలు

ప్రత్తిపాడు, మే 28: ప్రత్తిపాడు మండలంలో పులి సంచారంపై శని వారం ఎట్టకేలకు ఆధారాలు లభించాయి. అరడజను పశువులను హతమా ర్చిన పులి జాడ కోసం ఫారెస్ట్‌ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో శనివారం పులి కదలికలు బయటపడ్డాయి. దీంతో ఈ పెద్దపులిని ప్రాణాల తో బంధించేందుకు ఫారెస్ట్‌, జంతు సంరక్షణ బృందాలు విస్తృత గాలింపులు చేపట్టాయి. మండలంలోని పోతులూరు, శరభవరం, ఒమ్మంగి, పొదురు పాక, ధర్మవరం పొలిమేరల్లోని పంటపొలాల్లో పులి సంచరిస్తూ పాడిగేదెల ను చంపి తింటున్న వ్యవహారాన్ని రైతులు, ప్రజలు పది రోజులుగా గమనించినా పెద్దపులి జాడ లభ్యం కాలేదు. జిల్లా ఫారెస్ట్‌ అధికారి కేజీ విశ్వరాజు, వైల్డ్‌ లైఫ్‌ డీఎఫ్‌వో సెల్వం, సబ్‌ డీఎస్‌వో సౌజన్య, ఐఎస్‌ఎఫ్‌ ట్రైనీ ధరణి, ఏలేశ్వరం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌, డీఆర్వో రామకృష్ణ తదితరులతోపాటు మరో రెండు అటవీశాఖ బృందాలు రెండురోజులుగా మండల గ్రామాల్లో పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రాత్రిపూటే సంచారం..

రాజమహేంద్రవరం సీపీఎఫ్‌ అధికారి పోతులూరి మాజీ సర్పంచ్‌ పంచాది వీరబాబు గ్రామస్తులతో కలిసి పులి గేదెను చంపిన కొడవలి పంపుహౌస్‌ ప్రదేశాన్ని శనివారం పరిశీలించారు. పులి కదలికలపై స్థానిక పశువుల పెంపకందారులు, రైతులను విచారించారు. రాత్రి స మయంలో 9-10గంటల మధ్యలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శా ఖాధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదైంది. పోతులూరు పంట పొలాల్లో ఉన్న తాగునీటి మడుగుల్లో పులి నీరు తాగినట్లు స్పష్టమైన ఆధా రాలు లభించాయి. దీంతో జిల్లా ఫారెస్ట్‌ అధికారులు, కలెక్టర్‌ కృతికాశుక్లాకు పులి సంచరి స్తున్నట్లు నివేదికలు పంపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్‌ పీవీవీ గోపాలకృష్ణ, ఎస్‌ఐ కె.సుధాకర్‌ మండల గ్రామాల్లో పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులిని పట్టుకునేందుకు జంతు సంరక్షణ బృందం వాహనంతో ప్రత్తిపాడుకు చేరుకుంది. అటవీసిబ్బంది ప లు బృందాలుగా పులి సంచరిస్తున్న గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయాల్లో పశువులు బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు పశుపెంపకందారులను హెచ్చరిస్తున్నారు.

పులి ఎక్కడినుంచి వచ్చింది..?

ప్రత్తిపాడు మండలంలోని మైదాన గ్రామాలకు పులి ఎక్కడనుంచి వచ్చిందనేది మిస్టరీగా మారింది. పులి సంచరించిన గ్రామాల్లో అడవి లేకపోవడం, పూర్తిగా మైదాన గ్రామాలవల్ల పులి రాక మండల ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మండలానికి ఆనుకుని ఉన్న సబ్‌ప్లాన్‌ ఏజెన్సీ ప్రాంతంనుంచి పులి వచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ సరిహద్దుగా ఉండే నియోజకవర్గ ఏజెన్సీ గ్రామాలనుంచే మైదాన గ్రామాలకు ఈ పులి దారి తప్పి వచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. మండలంలోని పోతులూరు, ఒమ్మంగి, ధర్మవరం, పొదురుపాక, శరభవరం ఐదు గ్రామాల్లో ఉన్న చిన్నపాటి కొండలు, గుట్టలు ఈ పులికి ఆశ్రయంగా మారినట్లు తెలుస్తోంది. గుట్టల్లో ఉండి రాత్రి సమయాల్లో గ్రామాల్లో వేటకు పులి దిగి వస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Updated Date - 2022-05-29T07:47:33+05:30 IST