తాళ్లపాలెం సంత వెనుక కొండవాలు ప్రాంతంలో పులి పాదముద్రల కొలతలు, ఫొటోలు తీస్తున్న అటవీ శాఖ అధికారులు
సంతవెనుక కొండవాలు ప్రదేశంలో పాద ముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు
చీకటి పడిన తరువాత ఉగ్గిపాలెం సరుగుడు తోటల్లోకి ప్రవేశం
అప్రమత్తంగా ఉండాలని చట్టుపక్కల గ్రామాల్లో దండోరా
కశింకోట, జూలై 3: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద పులి అడుగుజాడలను ఆదివారం అటవీ శాఖ అధికారులు గుర్తించారు. తాళ్లపాలెం సంత వెనుక కొండవాలు ప్రాంతంలో పోలవరం కాలువ గట్టు వద్ద పులి పాదముద్రలను సేకరించారు. రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్య పెద్దపులి తాళ్లపాలెం-నర్సీపట్నం ప్రధాన రహదారిని దాటి ఉగ్గినపాలెం పంచాయతీ పరిధిలోని సరుగుడు తోటల్లోకి ప్రవేశించిందని రిస్క్యూ టీం లీడర్ అమర్నాథ్ తెలిపారు. అందువల్ల ఉగ్గినపాలెం, పరవాడపాలెం, బుచ్చెయ్యపేట, జామాదులపాలెం, విస్సన్నపేట, జి.భీమవరం పంచాయతీల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించామన్నారు. సోమవారం ఉదయం వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కొండలు, అడవుల్లోకి కట్టెల కోసం ఎవరూ వెళ్లవదని, గ్రామ పొలిమేర్లలో కట్టెలతో మంటలు వేసుకుంటే నివాస ప్రాంతాల్లోకి పులి రాదని తెలిపారు.