అమ్మో పులి

ABN , First Publish Date - 2020-12-03T04:47:01+05:30 IST

మంచిర్యాల జిల్లాలోని మారుమూల మండలాల ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు

అమ్మో పులి
వేమనపల్లి మండలం సుంపుటం గ్రామంలో అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్‌)

-భయం గుప్పిట్లో మారుమూల గ్రామాల ప్రజలు

-అడవులకు వెళ్లాలంటేనే భయాందోళన

--నేటి నుంచి అధికారుల అవగాహన కార్యక్రమాలు

మంచిర్యాల, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలోని మారుమూల మండలాల ప్రజలు పులి భయంతో వణికిపోతున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇటీవల 15 రోజుల వ్యవధిలో పెద్దపులి ఇద్దరు వ్యక్తులను  హతమార్చింది. దీంతో ఎప్పుడు ఏ ఉపద్రవం చోటుచేసుకుం టుందో తెలియక మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మనుషులపై దాడులకు పాల్పడ్డ పులులను పట్టుకునేందుకు అటవీశాఖ అఽధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో  ప్రజల్లో భయాందోళన నెలకొంది. పులులు ఆహారం కోసం సాధారణంగా 12 నుంచి 25 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంటాయి. దీంతో అవి ఎక్కడ సంచరిస్తున్నాయో అధికారులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇంతకాలం పశువులను హతమార్చిన పులులు ప్రస్తుతం మనుషులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతుండడంతో ప్రభుత్వం ఈ విషయ మై తీవ్రంగా స్పందిస్తోంది. ఇందులో భాగంగా అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు మారుమూల అటవీ ప్రాంతాల ప్రజలను అడవుల్లోకి వెళ్లకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. 

కాటేపల్లి అటవీ ప్రాంతంలో..

వేమనపల్లి మండలం కాటెపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న కే-4 పులికి గతంలో ఉచ్చుబారికి గురైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని తడోబా, అందేరి అభయార్యణం నుంచి జిల్లాలో ప్రవేశించిన పులి మార్గం మధ్యలో ఉచ్చు బారిన పడింది. దీంతో దాన్ని ప్రాణాలతో పట్టుకొని ఉచ్చు తొలగించి, తిరిగి అడవిలో వదిలిపెట్టాలని నిర్ణయించారు. ఇందుకుగాను అటవీశాఖ లక్షల రూపాయలు ఖర్చుచేసినా ఫలితం లేకపోయింది. గతకొద్ది రోజుల వరకు జిల్లాలోని వేమనపల్లి పరిసర ప్రాంతాల్లో పులి అలజడిని గమనించిన అటవీ అధికారులకు ఇటీవలి కాలంగా దాని ఆచూకీ లభ్యం కావడం లేదు. ప్రస్తుతం కే-4 పులి ఆసిఫాబాద్‌ జిల్లాలో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. అలాగే మరో పులి కే-8 కూడా అదే ప్రాంతంలో తచ్చాడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మూకుమ్మడిగా పశువుల మందపై దాడి చేయడంలో దానికి దిట్టగా పేరుంది. ఒకేసారి మూడు నాలుగు పశువులపై దాడులకు పాల్పడ్డట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. పశువుల రక్తం రుచిమరిగిన పులి మ్యాన్‌ ఈటర్‌గా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలో మనుషులపై దాడిచేసింది ఇదేనా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో పులి ఏ-2 సమాచారం కూడా చిక్కక అటవీశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  


జంకుతున్న పశువుల కాపర్లు..

కాగా మారుమూల గ్రామాలకు చెందిన పశువుల కాపర్లు అడవుల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. పశువులను అడవుల్లోకి మేతకు తరలిస్తున్న కాపర్లు పగటి పూటనే ఇంటి ముఖం పడుతున్నారు. అలాగే అడవుల సమీపంలో వ్యవసాయం చేసే రైతులు ఒంటరిగా గాకుండా గుంపులుగా వెళ్తున్నారు. ఈ నెల 1న కాగజ్‌నగర్‌ మండలం కడంబ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన నాలుగు బర్రెలపై పెద్దపులి దాడి చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. పొలాల్లో పనిచేసే కూలీలు సైతం చీకటి పడకముందే ఇంటిదారి పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మారుమూల గ్రామాల ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. అడవుల్లోకి వెళ్లవద్దంటూ అటవీశాఖ అధికారులు మారుమూల మండలాల్లో డప్పు చాటింపులు వేయిస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 


ప్రజలకు అవగాహన కల్పించేందుకు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పులల సంచారం, దాడులు ఎక్కువైన తరుణంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అటవీశాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని వేమనపల్లి మండలం సుంపుటం, జాజులపేట, ముక్కిడి గూడెం, కల్లెంపల్లి, రాజారం, తదితర గ్రామాలో ఇప్పటికే డప్పు చాటింపులతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల్లో  గురువారం నుంచి ప్రజలకు మరింతగా అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. సమావేశాల ద్వారా ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. ఈ మేరకు వివిధ అటవీ రేంజ్‌ల పరిధిలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. 


చేనుకు వెళ్లాలంటే భయంగా ఉంది..

- రామగిరి సాయన్న, రైతు, వేమనపల్లి

ఒడ్డుగూడెం శివారులో వేసిన పత్తి చేనుకు వెళ్లేందుకు పులుల సంచారంతో భయంగా ఉంది.  పగటిపూట భయం భయంతో వెళ్లి పంటను చూసుకుంటున్నా. రాత్రి వేళల్లో అసలు చేనుకే  వెళ్లడం లేదు.  పగలు సైతం గుంపులుగా వెళ్తున్నాం. 


అవగాహన కల్పిస్తున్నాం..

గోవింద్‌సింగ్‌ సర్దార్‌, ఎఫ్‌ఆర్వో కుశ్నపల్లి (నెన్నెల మండలం)

పులుల విషయంపై గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వేమనపల్లి మండల శివారు అటవీ ప్రాంతంలో రెండు మూడు పులులు తిరుగుతున్నాయి. పులులు ఆహారం కోసం 12 కిలో మీటర్ల మేర ప్రయా ణిస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దాడులు జరుగుతుండటంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే అటవీ సమీపంలోని గ్రామాల్లో డప్పు చాటింపు వేయించాం.

Updated Date - 2020-12-03T04:47:01+05:30 IST