అనకాపల్లి జిల్లాలో పులి కలకలం

ABN , First Publish Date - 2022-07-11T02:34:18+05:30 IST

అనకాపల్లి జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి మరోసారి కలకలం రేపింది. అనకాపల్లి మండలం బవులవాడ శివారులోని ఒక పశువుల

అనకాపల్లి జిల్లాలో పులి కలకలం

అనకాపల్లి: అనకాపల్లి జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి మరోసారి కలకలం రేపింది. అనకాపల్లి మండలం బవులవాడ శివారులోని ఒక పశువుల పాకలో శనివారం రాత్రి ఒక ఆవు దూడను చంపేసి, సమీపంలోని పోతుకొండపైకి ఈడ్చుకెళ్లింది. కొంత భాగాన్ని తినేసి అడవుల్లోకి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న అటవీ, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెద్ద పులిని బంధించేందుకు రెండుచోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. అనకాపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు వారాల నుంచి పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని అటవీ ప్రాంతంలో సుమారు నెల రోజులపాటు సంచరించి, అటవీ శాఖ  ఏర్పాటు చేసిన బోన్లుకు చిక్కకుండా తప్పించుకుంది. తరువాత గత నెల 27వ తేదీన అనకాపల్లి కోటవురట్ల, నక్కపల్లి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. 


మరుసటి రోజు కోటవురట్ల మండలం టి.జగ్గంపేట పంచాయతీ శ్రీరామపురంలో ఒక గేదెను చంపేసి కొంత భాగాన్ని తినేసింది. రెండు రోజుల తరువాత ఎలమంచిలి మండలం పెద్దపల్లి రిజర్వు ఫారెస్టులోకి ప్రవేశించినట్టు గుర్తించిన అటవీ శాఖ అధికారులు పలుచోట్ల ట్రాక్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రదేశాల్లో పులి సంచరించలేదు. మళ్లీ రెండు రోజుల తరువాత కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద పులి పాదముద్రలను గుర్తించారు. అడుగుజాడలను బట్టి సమీపంలోని పండూరు, గొబ్బూరు రిజర్వు ఫారెస్టులోకి వెళ్లినట్టు నిర్ధారించారు. ఆరో తేదీని కశింకోట మండలం విస్సన్నపేట సమీపంలోని కొండప్రాంతంలోకి మేతకు వెళ్లిన పశువుల్లో ఒక గేదె పెయ్యిని చంపేసింది. మరుసటి రోజు రైతులు దీనిని గుర్తించి అటవీ అధికారులకు తెలిపారు. పంట పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో ఆ ప్రాంతంతోపాటు మరో మూడు చోట్ల ట్రాక్‌ కెమెరాలను అమర్చారు. విస్సన్నపేట వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలో పులి కదలికలు రికార్డయ్యాయి. అంతకుముందు రోజు చంపేసిన గేదె పెయ్యి కళేబరం వద్దకు వచ్చి వెళ్లిపోయింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

Updated Date - 2022-07-11T02:34:18+05:30 IST