Abn logo
Dec 3 2020 @ 22:18PM

పెద్దపులిని పట్టుకోవాలని రాస్తారోకో

బెజ్జూరు, డిసెంబరు3: మనుషులపై దాడి చేసి హతమారుస్తున్న పెద్దపులిని పట్టుకో వాలని బెజ్జూరు బస్టాండు ఏరియాలో గురువారం ఆదివాసీలు ధర్నా చేపట్టారు. తమ ప్రాణాలు కాపాడుతారా లేక చావ మంటారా అని అటవీ అధికారుల తీరుపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోట శ్రీనివాస్‌, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ హర్షద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పెద్దపులి దాడిలో ఇద్దరు హతమయ్యారన్నారు. జిల్లాలోని దహె గాం మండలం దిగిడలో పులి దాడి జరిగినా అధికా రులు అప్రమత్తం కాలేదని, దీంతో పెంచిక లపేట మండలం కొండపల్లిలో మరో ఘటన జరిగిందన్నారు. అయినప్పటికీ కేవలం అటవీ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి అటవీ అధికారులు చేతులు దులుపుక్తున్నారని వారు ఆరోపించారు. 

పెద్ద పులి తిరుగుతున్న కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు పంట పొలాల్లోకి వెళ్లక పోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. వారం రోజుల్లోగా పులిని పట్టుకోవాలని లేని పక్షంలో తామే పట్టుకుంటామని అటవీ అధికారులను వారు హెచ్చరించారు. పులిదాడిలో మృతి చెందిన బాధితులకు రూ.20 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు అటవీ శాఖలో ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్సై సాగర్‌ ఆదివాసీ సంఘాలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం తహసీల్దార్‌ రవీందర్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి శీలానంద్‌కు వారు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పెద్ద పులిని పట్టుకునేందుకు ఇప్పటికే అటవీ శాఖ ఆధ్వర్యంలో బోన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇస్తారి, ఆదివాసీ నాయకులు సకారాం, సర్పంచ్‌లు సంతోష్‌, హన్మంతు, ఎంపీటీసీ శ్రీనివాస్‌, నాయకులు తిరుపతి, సత్తయ్య, రామయ్య, పురుషోత్తం, రమేష్‌  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement