వృద్ధురాలిని కట్టేసి నగలు అపహరణ

ABN , First Publish Date - 2022-07-01T06:00:31+05:30 IST

వృద్ధురాలిని కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను దొంగలు అపహరించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని జోగిగూడెంలో బుధవారం జరిగింది.

వృద్ధురాలిని కట్టేసి నగలు అపహరణ
బాధితురాలు పెద్ద లక్ష్మమ్మ

చండూరు రూరల్‌, జూన్‌30: వృద్ధురాలిని కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను దొంగలు అపహరించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని జోగిగూడెంలో బుధవారం జరిగింది. సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వట్టి రామస్వామి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే భార్యతో కలిసి బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లారు. ఆయన తల్లి పెద్ద లక్ష్మమ్మ ఇంటి వద్దే ఉంది. మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న లక్ష్మమ్మను చంపుతానని బెదిరించి చేతులు, కాళ్లు కట్టేసి, అరవకుండా నోట్లో వస్త్రం కుక్కి ఆమె ఒంటిపై ఉన్న నాను, గుండ్లు, చెవుల గంటీలు మొత్తం కలిపి సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయాడు. కొద్ది సేపటికి గమనించిన చుట్టు పక్కల వారు వృద్ధురాలిని విడిపించి, కుమారుడు రామస్వామికి సమాచారం అందించారు. ఆయన స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. రామస్వామి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-07-01T06:00:31+05:30 IST