5 వేల డాలర్లు కట్టుకో.. అమెరికా గ్రీన్‌కార్డు పట్టుకో

ABN , First Publish Date - 2021-09-14T09:35:09+05:30 IST

అమెరికాలో శాశ్వత నివాసానికి అర్హత కలిగించే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వృత్తి నిపుణులకు శుభవార్త..

5 వేల డాలర్లు కట్టుకో.. అమెరికా గ్రీన్‌కార్డు పట్టుకో

  • వెసులుబాటు కల్పించనున్న కొత్త బిల్లు.. 
  • సెనేట్‌, బైడెన్‌ ఆమోదమే తరువాయి


వాషింగ్టన్‌, సెప్టెంబరు 13: అమెరికాలో శాశ్వత నివాసానికి అర్హత కలిగించే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వృత్తి నిపుణులకు శుభవార్త..! అర్హతలు ఉండీ.. గ్రీన్‌కార్డు కోసం చూస్తున్న వారు 5 వేల డాలర్ల మేర సప్లిమెంటల్‌ ఫీజును చెల్లిస్తే చాలు..! వారికి గ్రీన్‌కార్డు వచ్చేస్తుంది. ఈ మేరకు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ జ్యుడీషియరీ కమిటీ ఓ బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లు ప్రతినిధుల సభ, సెనేట్‌లో ఆమోదం పొంది.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేస్తే.. చట్టరూపం దాలుస్తుంది. ముసాయిదా బిల్లు ప్రకారం దీని చెల్లుబాటు 2031 వరకు ఉంటుంది. 2020 ఏప్రిల్‌ నాటి లెక్కల ప్రకారం.. 7.40 లక్షల మంది భారతీయులు గ్రీన్‌కార్డుకు అర్హత ఉండి కూడా తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికా ఏటా 1.40 లక్షల మందికి గ్రీన్‌కార్డులను జారీ చేస్తుంది. ప్రతి దేశానికి 7ు పరిమితిని విధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న 7.40 లక్షల మంది భారతీయులకు గ్రీన్‌కార్డు రావడానికి 84 సంవత్సరాలు పడుతుందని అంచనా. భారత్‌కు చెందిన గ్రీన్‌కార్డు ఆశావహుల్లో ఈబీ2, ఈబీ3 కేటగిరీకి చెందిన వృత్తి నిపుణులు ఉన్నారు. అమెరికా తాజా బిల్లు చట్టరూపం దాలిస్తే వీరిలో చాలామందికి(మిగతావారికి వచ్చే రెండేళ్లలో) లబ్ధి కలగనుంది. ప్రయారిటీ డేట్‌ (గ్రీన్‌కార్డు దరఖాస్తు ఆమోదం పొందిన తేదీ) నుంచి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారంతా.. 5 వేల డాలర్ల సప్లిమెంటల్‌ రుసుము చెల్లిస్తే.. గ్రీన్‌కార్డు చేతికి వస్తుంది. ఇక ఈబీ5 కేటగిరీ గ్రీన్‌కార్డును ఆశిస్తున్న వ్యాపారుల విషయంలోనూ ఈ బిల్లు వెసులుబాటు కలిగిస్తోంది. వారు 50 వేల అమెరికా డాలర్ల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభిస్తే చాలు.. గ్రీన్‌కార్డుకు అర్హత పొందుతారు. ఇక.. అమెరికాలో హెచ్‌1-బీపై ఉంటున్న వృత్తి నిపుణులు సైతం 50 వేల డాలర్లు పెట్టుబడి పెట్టగలిగితే చాలు..! శాశ్వత నివాసానికి అర్హత పొందుతారు.


కుటుంబ సభ్యులకూ వెసులుబాటు

తాజా బిల్లులో గ్రీన్‌కార్డుదారుల కుటుంబ సభ్యులకూ కొంత సప్లిమెంటల్‌ ఫీజుతో శాశ్వత నివాసానికి వెసులుబాటు కల్పించారు. ఈ కేటగిరీలో ఉండే జీవిత భాగస్వాములు, సంతానానికి 2,500 డాలర్ల ఫీజుతో గ్రీన్‌కార్డు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. వీరి విషయంలోనూ ప్రయారిటీ డేట్‌ దాటి రెండేళ్లు పూర్తయితే.. 1,500 డాలర్ల మేర సప్లిమెంటల్‌ ఫీజు చెల్లిస్తే గ్రీన్‌కార్డు వచ్చేస్తుంది. ఇక.. ఇంతకాలం ఈబీ2, ఈబీ3 కేటగిరీల్లో వృత్తి నిపుణులకు మాత్రమే గ్రీన్‌కార్డు దరఖాస్తుకు అర్హత ఉండేది. తాజా బిల్లు చట్టరూపు దాలిస్తే.. ఈ కేటగిరీ పాలిట వరంలాంటిదేనని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు చెబుతున్నారు.


చట్టరూపు దాల్చడమే కీలకం

ఇప్పుడు ప్రవేశపెట్టనున్న బిల్లు నిజంగా ఎన్నారైలకు వరంలాంటిదే. అయితే.. అది చట్టరూపు దాల్చడమే కీలకం. సాధారణంగా ఇతర దేశాల పౌరులకు లబ్ధి కలిగించే బిల్లుల విషయంలో సాగదీత ధోరణి ఉంటుంది. భారత సంతతి చట్టసభ్యులు ఈ బిల్లు విషయంలో చొరవ చూపాలి.

- కలవల విషు, అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ వ్యవహారాల విశ్లేషకుడు


బిల్లు మంచిదే.. ప్రవేశపెట్టే సమయం సరైంది కాదు

ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లు ఎంతో మంది భారతీయులకు లబ్ధి కలిగిస్తుంది. కానీ, ప్రవేశపెట్టే సమయమే సరైంది కాదనిపిస్తోంది. జ్యుడీషియరీ బిల్లులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బిల్లుతోపాటు దీన్ని ప్రవేశపెడుతున్నారు. మిగతా రెండు బిల్లులకు చాలా మంది చట్టసభ్యులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో గ్రీన్‌కార్డు బిల్లుపైనా ప్రతికూల పవనాలు వీచే ప్రమాదాలున్నాయి. ఓటింగ్‌ జరిగితే.. ఇమ్మిగ్రెంట్లకు అనుకూలంగా చట్టసభ్యులంతా ఓటు వేస్తారా? అన్నది అనుమానమే. 

- జెనితా రెడ్డి, ఇమ్మిగ్రేషన్‌ చట్టాల అటార్నీ(అమెరికా)

Updated Date - 2021-09-14T09:35:09+05:30 IST