అభివృద్ధి కోసం టీడీపీకి పట్టం కట్టండి

ABN , First Publish Date - 2021-03-05T06:43:42+05:30 IST

విశాఖలో ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ కొనసాగాలంటే విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.

అభివృద్ధి కోసం టీడీపీకి పట్టం కట్టండి

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

ఒక్క అవకాశం ఇస్తే జగన్‌ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేశారు

మరో చాన్సిస్తే ఏకంగా విశాఖను అమ్మేస్తారు

నూనె ప్యాకెట్‌ రూ.160 వుందంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు


డాబాగార్డెన్స్‌, మార్చి 4: విశాఖలో ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ కొనసాగాలంటే విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన జీవీఎంసీ పరిధిలోని గాజువాక, పెదగంట్యాడ, కూర్మన్నపాలెం, అక్కిరెడ్డిపాలెం, నగరంలోని వన్‌టౌన్‌, భీమిలి, తగరపువలస, అనకాపల్లి ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల లోకేశ్‌ మాట్లాడుతూ జగన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తేనే విశాఖ ఉక్కును అమ్మేశారని, రెండో ఛాన్స్‌ ఇస్తే విశాఖ నగరాన్నే అమ్మేస్తారని ఎద్దేవా చేశారు. కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే నిలదీయలేని దుస్థితిలో జగన్‌ వున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విశాఖలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఒక్క పని చేపట్టలేకపోయారన్నారు. అదే సమయంలో భూకబ్జాలు, దోపిడీ, విధ్వంసాలతో విశాఖలో ప్రశాంతత లేకుండా పోయిందన్నారు. 


ప్రజల ఇబ్బందులు గమనించే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం, యాభై శాతం ఇంటి పన్ను తగ్గింపు వంటి పది వాగ్దానాలతో తెలుగుదేశం మేనిఫెస్టో రూపొందించిందన్నారు. విశాఖను సుందర నగరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన జగన్‌ 28 మంది ఎంపీలున్నా ఏమీ సాధించలేకపోయారన్నారు. నిత్యావసరాల ధరలు పెంచడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం సెంచరీ కొట్టిందని విమర్శించారు. నూనె ప్యాకెట్‌ రూ.160లు వుందంటే ఈ ప్రభుత్వ పనితీరు అర్థం చేసుకోవచ్చునన్నారు. రూ.200లు పింఛన్‌ పెంచి, ధరలు, చార్జీల రూపంలో మనవద్ద నుంచి రూ.2 వేలు గుంజుతోందని ఎద్దేవా చేశారు. ఇంటికే రేషన్‌ అని చెప్పి బండి వద్ద రేషన్‌కు పడిగాపులు పడేలా చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ గెడ్డం మనిషి భూ దందాలు, దౌర్జన్యాలతో ప్రశాంతంగా వున్న విశాఖలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయని లోకేశ్‌ అన్నారు. టీడీపీ అభ్యర్థులను విత్‌డ్రా అయిపోవాలని, తమ పార్టీలోనికి వచ్చేయాలని బెదిరించారని ఆరోపించారు. సభల్లో ఎక్కడికక్కడ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, ఎం.వి.శ్రీభరత్‌, ఎం.డి.నజీర్‌, పుచ్చా విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-05T06:43:42+05:30 IST