చక్కదిద్దండి, చరిత్రలో నిలిచిపోతారు!

ABN , First Publish Date - 2022-02-24T06:33:43+05:30 IST

మార్చి పదోతారీకు తరువాత ఏమవుతుంది? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏ రకంగా వస్తే ఏ పరిణామాలుంటాయి? ఒక పక్కన ఇంకా దశలవారీ పోలింగ్ జరుగుతూనే ఉండగా...

చక్కదిద్దండి, చరిత్రలో నిలిచిపోతారు!

మార్చి పదోతారీకు తరువాత ఏమవుతుంది? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏ రకంగా వస్తే ఏ పరిణామాలుంటాయి? ఒక పక్కన ఇంకా దశలవారీ పోలింగ్ జరుగుతూనే ఉండగా, జాతీయస్థాయిలో రాజకీయ వాతావరణం ఎందుకు వేడెక్కింది? భారతీయ జనతాపార్టీ ప్రాభవం పతనోన్ముఖంగా ఉన్నదని ఇతర సంకేతాలేమైనా అందుతున్నాయా? ఉత్తరప్రదేశ్ ఫలితాలతో నిమిత్తం లేకుండా, 2024 ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవలసిందేనని బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయా? ఈ జూలైలో జరగవలసిన రాష్ట్రపతి ఎన్నికల నుంచి మొదలుకుని, వచ్చే ఏడాది మొదట, నడుమ, మధ్యన జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల వరకు సంఘటిత పడడానికి ఉన్న అనేక అవకాశాలను ప్రతిపక్షాలు ఉపయోగించ గలుగుతాయా?


అపనమ్మకాలు, అనుమానాలు ఉన్నప్పటికీ, వారసుడి పట్టాభిషేకానికి మార్గం సుగమం చేస్తున్నారన్న ఊహాగానాలు ఉన్నప్పటికీ, జాతీయ రాజకీయాలలో క్రియాశీలంగా ఉంటానని కెసిఆర్ చెబుతున్న మాటలు పూర్తిగా తీసేయదగ్గవి కావు. ముంబై వెళ్లి మాట్లాడిన మాటలే కాకుండా, ఆ తరువాత ఈ మూడు రోజులలో రెండు కార్యక్రమాల్లో చేసిన ఉద్ఘాటనలు కూడా ఆయన రంగంలోకి దిగినట్టేనన్నట్టుగా ఉన్నాయి. ఆయనను ప్రేరేపించిన అంశాలు కేంద్రం పెత్తనం మాత్రమేనా మరేదైనానా అన్నది శేష ప్రశ్నే. దేశాన్ని మరమ్మత్తు చేస్తా, బంగారం చేస్తా అంటూ పెద్ద కర్తవ్యాలు చేపట్టడానికి తెలంగాణ ప్రజల దీవెనలను ఆయన కోరుతున్నారు. యథావిధిగా బడాయిగా మాట్లాడుతున్నారు కానీ, కెసిఆర్ ఉద్ధవ్ ఠాక్రేను, శరద్ పవార్‌ను కలవడాన్ని జాతీయ మీడియా కూడా ఆసక్తిగా ప్రస్తావించడమే కాకుండా, అనేక విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నది. ఏ పవనాలూ ప్రభంజనాలూ లేనట్టుగా అనిపిస్తున్న ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో, కెసిఆర్ హడావుడి కొంత వేడిపుట్టించిందనే చెప్పాలి.


ఒక తాటి మీదకు రావడానికి లేదా తేవడానికి కొన్ని ప్రయత్నాలు మునుపు జరగకపోలేదు. మమతా బెనర్జీ ఏడాది కిందటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఒక జాతీయ సామాజిక న్యాయవేదికను ప్రతిపాదించారు. తాము కేంద్రంతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ, బిజెపితో పొత్తు లేని ప్రతిపక్ష రాష్ట్రాలు ఫెడరలిజం సూత్రాల ప్రాతిపదికన కొన్ని విమర్శలు చేస్తూ వస్తున్నాయి. జాతీయ స్థాయిలో పెగాసెస్ వంటి అంశాల మీద కొన్ని పార్టీలు వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఈ విమర్శలను, వ్యతిరేకతలను ఒక తాటి మీదకు తేవాలనే ఉద్దేశ్యంతో కాబోలు, గత ఆగస్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక అంతర్జాల సమావేశం ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్షాలు ఐక్యం కావాలని సోనియా ఆ సమావేశంలో సూచించారు. పందొమ్మిది పార్టీల ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొనగా, బిఎస్‌పి, ఆప్, సమాజ్‌వాదీ పార్టీలు గైర్హాజరయ్యాయి. తమను ఆహ్వానించలేదని ఆ పార్టీలు అన్నాయి. పిలిచినా పిలవకపోయినా రాకపోవడానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఈ సమావేశం తరువాత, కాంగ్రెస్ ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకుపోయింది లేదు. కాంగ్రెస్‌తో అనేక బిజెపియేతర పార్టీలకు సమస్యలున్నాయి. బిఎస్‌పి, ఎస్‌పి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యర్థులు. నిజానికి ఈ మూడు పార్టీలు కలిస్తే, బిజెపికి గట్టి పోటీ ఇవ్వగలుగుతాయి కానీ, ఆ కూటమికి అనేక ప్రతిబంధకాలున్నాయి. డిఎంకె, ఎన్‌సిపి, శివసేన, ఆర్‌జెడి మినహా తక్కిన పార్టీలకు కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే కూటమి ఇష్టం లేదు. అందుకని కాంగ్రెస్ వేచిచూసే ధోరణిలో మౌనంగా ఉన్నది. ఈ ఖాళీలో తన పార్టీని విస్తరించి జాతీయస్థాయి ఉనికిని సాధించాలని తృణమూల్‌ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌లో చేరబోయి భంగపడిన ప్రశాంత్ కిశోర్, మమతకు అనుకూలంగా బలసమీకరణ చేస్తున్నారని భావిస్తున్నారు. నేషనలిస్‌్ట కాంగ్రెస్ పార్టీ, శివసేన రెండూ కూడా కాంగ్రెస్ లేని కూటమి సాధ్యం కాదని తేల్చి చెప్పాయి. కెసిఆర్ ముంబై పర్యటన తరువాత కూడా ఆ రెండు పార్టీలూ అదే మాట పునరుద్ఘాటించడం గమనార్హం. మార్చి పది తరువాత సోనియాగాంధీ మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు.


కెసిఆర్ ముంబై వెళ్లడానికి రెండు రోజుల ముందు పోయిన శుక్రవారం నాడు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలో కలుసుకున్నారు. దానితో ఒక చిన్న కలకలం. ప్రశాంత్ కిశోర్ రెండేళ్ల కిందటివరకు, నితీశ్ పార్టీలోనే ఉన్నారు. నితీశ్ బిజెపితో కొనసాగడం ఆయనకు ఇష్టం లేదు. మిత్రపక్షాన్ని సంతోషపెట్టడానికి నితీశ్ ప్రశాంత్ కిశోర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి కలయిక కుతూహలాన్ని కలిగించడంలో ఆశ్చర్యం లేదు. పైగా, నితీశే కోరి మరీ వ్యూహకర్తను కలిశాడట. బిజెపి తీరుతో అసంతృప్తుడుగా ఉన్న నితీశ్ ఈ భేటీ ద్వారా ఏదైనా సందేశం ఇవ్వదలచుకున్నారా? లేదా, ఈ భేటీలో ప్రతిపక్ష కూటమిలో చేరమన్న ఆహ్వానాన్ని ఆయన అందుకోవడమో, చేరాలన్న ఆసక్తిని తాను వ్యక్తపరచడమో జరిగిందా? ఢిల్లీ సమావేశం అట్లా ఉండగా, మంగళవారం నాడు ఎన్‌సిపి నాయకుడు నవాబ్ మాలిక్ ఒక బాంబు పేల్చారు. నితీశ్ కనుక బిజెపి పొత్తు నుంచి బయటకు వస్తే, ఆయనను ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తామన్నది మాలిక్ ప్రకటన. దానితో మరో సంచలనం. అటువంటి ఆలోచనేమీ లేదని నితీశ్ మీడియాకు చెప్పారనుకోండి. కానీ, రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థి కోసం కూడా మంత్రాంగం సాగుతున్నదన్నది అర్థమవుతోంది. లోక్‌సభలో ఎంత ఘనమైన మెజారిటీ ఉన్నా, రాష్ట్రపతి ఎన్నికలో భారతీయ జనతాపార్టీకి బయటివారి సహాయం అవసరం అవుతుంది. కేంద్రప్రభుత్వం మీద తమ అసమ్మతిని తెలియజేయడానికి రాష్ట్రపతి ఎన్నిక కూడా ప్రతిపక్షాలకు ఒక అవకాశం. దాని కోసం జరిగే ఐక్యతా యత్నాలు, సాధారణ ఎన్నికలనాటికి మరింత బలపడే అవకాశం ఉంటుంది.


కెసిఆర్‌ను ఒకందుకు మెచ్చుకోవాలి. మతహింస, మతోన్మాదం అభివృద్ధికి ఆటంకాలు అనే వైఖరి తీసుకున్నారు. కర్ణాటకలో జరుగుతున్నదానిపై తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్య ధోరణిని ఖండించడం సమీకరణాస్త్రంగా ఎంచుకున్నారు. అనేక విషయాలకు కెసిఆర్‌ను విమర్శించవచ్చును కానీ, తెలంగాణలో మతసామరస్యం కోసం ఆయన నిబద్ధతను ఒప్పుకోవలసిందే. దేశమంతా ఇప్పుడు లోపిస్తున్నది ఈ శాంతి సామరస్యాలు కాబట్టి, ముంచుకొస్తున్న ప్రమాదం కూడా ఆ దుర్మార్గం నుంచే కాబట్టి-.. ఆ అర్థంలో దేశమంతటా తెలంగాణగా మారుస్తామని అనడం బాగుంటుంది. అంతే తప్ప, తెలంగాణ ఇప్పటికే బంగారు తెలంగాణ అయిపోయింది, ఇక దేశాన్ని కూడా చేస్తానని అనడం స్వాతిశయం తప్ప మరొకటి కాదు. అభివృద్ధి, సంక్షేమం అనే మాటలకు కెసిఆర్ చెప్పుకునే నిర్వచనాలు వేరు. బడ్జెట్‌లో గణనీయమైన భాగం కాంట్రాక్టు పనులకు, తక్కినది సంక్షేమ కార్యక్రమాల కింద పంపకానికి కేటాయించేస్తే దాన్ని ఆరోగ్యకరమైన ఆర్థిక విధానం అనలేము. ఇవాళ తెలంగాణలో సాధారణ వాతావరణం సంతృప్తికరంగా కనిపించవచ్చు. ఎందుకంటే, గత ప్రభుత్వాలు ఈ మాత్రం కూడా ప్రజలకు దక్కవలసిన భాగం ఇవ్వలేదు. తెలంగాణతో పోలిస్తే, దేశంలోని అనేక రాష్ట్రాలలో పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న మాట కూడా నిజమే. కానీ, దేశానికి మెరుగైన భవితవ్యం ఇవ్వగలమనే విశ్వాసం ఉన్నవారు, కాస్త నికార్సయిన ఎకనామిక్స్‌ను ఆశ్రయించాలి.


ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానం అన్నది పెద్ద విషయం. ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని ప్రతిపక్ష సమీకరణకు ఒక అంశంగా చేసుకోవడం ఏమంత తెలివైన పని కాదు. ఇప్పుడు దేశానికి ఎదురవుతున్న తక్షణ ప్రమాదం, తీవ్ర కేంద్రీకరణ నుంచి, మతోన్మాదం నుంచి, అభిప్రాయ భిన్నత్వంపై నిర్బంధం నుంచి ఉన్నది. ఇందులో కనీసం రెంటి మీద కెసిఆర్‌కు కూడా అభ్యంతరాలున్నాయి. అభిప్రాయ భిన్నత్వాన్ని సహించడం, అప్రజాస్వామికతను వీడడం ఆయన అలవరచుకోవాలి. ఏ రకమైన అసమ్మతి ప్రకటనకూ ఆస్కారం ఇవ్వకుండా గృహనిర్బంధాలూ, తలుపులు బద్దలు కొట్టడాలూ, అక్రమ అరెస్టులు, విమర్శకుల దూషణలు ఆయన మానుకుంటే, జాతీయస్థాయిలో మరింత గౌరవం పెరుగుతుంది. గతంలో బిజెపి ప్రభుత్వానికి అనేక నిర్ణయాలలో ఎందుకు మద్దతు ఇవ్వవలసి వచ్చిందో కూడా ఆయన వివరణ ఇచ్చుకుంటే విశ్వసనీయత పెరుగుతుంది.


ప్రత్యామ్నాయ రాజకీయ సంఘటన కోసం ఇప్పుడు ఎవరు ఫలవంతమైన ప్రయత్నాలు చేయగలరో వారికి చరిత్రలో గొప్పస్థానం లభిస్తుంది. ఏ కారణం కోసమైనా, అవసరం కోసమైనా సరే, తనంతట తానుగా ఆ ప్రయత్నాలలోకి వస్తున్న కెసిఆర్, మరొక చారిత్రక పాత్రను నిర్వహించగలుగుతారా? సంధానకర్త కాగలుగుతారా? అవసరమైతే కాంగ్రెస్‌తో కూడా తాను స్నేహం చేయడానికి, ఇతరులను ఒప్పించడానికి సిద్ధపడతారా? మార్చి పది తరువాత పరిస్థితిని బట్టి మాత్రమే మరొక అడుగు వేస్తారా? 


చాలా మంది నాయకులకు లేని లక్షణం ఒకటి కెసిఆర్‌లో ఉన్నది. తాను అనుకున్న విజయాలను సాధించడంలో ఆయనకు వ్యసనం అనదగ్గ ఆనందం ఉన్నది. ఎట్లాగో అట్లా ఢిల్లీ చేరితే అది ఆయన వ్యక్తిగత విజయం, ఆనందం. అట్లా కాక, పెను ప్రమాదాన్ని నివారించే ప్రత్యామ్నాయానికి వ్యూహకర్తగా దేశరాజధాని చేరితే, ఆ సంతోషంలో అనేకులు భాగస్వాములవుతారు.


కె. శ్రీనివాస్

Updated Date - 2022-02-24T06:33:43+05:30 IST