ఎన్నాళ్లిలా?

ABN , First Publish Date - 2022-05-26T05:29:50+05:30 IST

పట్టణ పేదల సొంతింటి కల ఎప్పటికి నెరవేరుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎప్పుడో నిర్మాణం పూర్తయిన ఇళ్లు గడిచిన మూడేళ్లుగా లబ్దిదారులను ఊరిస్తూ ఉన్నాయే తప్ప వారికి దక్కడం లేదు.

ఎన్నాళ్లిలా?
నరసరావుపేటలో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు

ఏళ్లు గడుస్తున్నా నెరవేరని పట్టణ పేదలు సొంతింటి కల

టిడ్కో ఇళ్లపై కొనసాగుతున్న వాయిదాల పర్వం

చేతికి రాకుండానే శిథిలమవుతున్న ఇళ్లు

జూన్‌లో 9 వేల ఇళ్లు పంపిణీ చేస్తామంటున్న అధికారులు

ఇప్పటికీ పూర్తికాని మౌలిక సదుపాయాల కల్పన

 

మూడేళ్లుగా టిడ్కో ఇళ్లు లబ్ధిదారులను ఊరిస్తున్నాయి. పంపిణీ చేయకుండా అదిగో ఇదిగో అంటూ వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. తాజాగా వచ్చేనెల 15వ తేదీ తరువాత లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే పూర్తికావాల్సిన వీటి తాలూకు మౌలిక వసతుల కల్పన నత్తనడకన సాగుతుండడంతో వచ్చే నెల ఇళ్ల పంపిణీపై లబ్ధిదారుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈసారి కూడా ఇళ్ల పంపిణీ కష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు గడిచిన మూడేళ్లుగా ఆలనాపాలన లేకపోవడంతో చాలాచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి.

 


 గుంటూరు, మే 25(ఆంధ్రజ్యోతి): పట్టణ పేదల సొంతింటి కల ఎప్పటికి నెరవేరుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎప్పుడో నిర్మాణం పూర్తయిన ఇళ్లు గడిచిన మూడేళ్లుగా లబ్దిదారులను ఊరిస్తూ ఉన్నాయే తప్ప వారికి దక్కడం లేదు. ఇళ్ల పంపిణీపై ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రకటన చేస్తూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం పంపిణీ విషయంలో వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా మరోమారు టిడ్కో ఇళ్ల పంపిణీ అంశాన్ని తెరమీదకి తెచ్చిన ప్రభుత్వం వచ్చేనెల 15వ తేదీ తరువాత లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నెలకొన్న పరిస్థితులను చూస్తే ఈసారి కూడా ఇళ్ల పంపిణీ కష్టంగానే కనిపిస్తోంది. 


పీఎంఏవై ద్వారా 49,492 ఇళ్లు మంజూరు 

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద మూడు దశల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు 49,492 ఇళ్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి మంజూరు చేయించింది. వీటిలో ఫేజ్‌- 1 కింద ఉమ్మడి జిల్లాలో 12,768 ఇళ్ల నిర్మాణ పనులు 2015లోనే ప్రారంభమయ్యాయి. తెనాలిలో 1,152, నరసరావుపేటలో 1,504, చిలకలూరిపేటలో 4,512, పొన్నూరులో 2,368, మంగళగిరిలో 2,592, సత్తెనపల్లిలో  640 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 2017-18లో ఫేజ్‌- 1 కింద గుంటూరు కార్పొరేషన్‌లో 10వేల ఇళ్లు సహా వినుకొండ, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, రేపల్లె, తెనాలి, పట్టణాల్లో  23,387 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటితోపాటు ఫేజ్‌- 2 కింద 3,017 ఇళ్లు, ఫేజ్‌- 3 కింద సీఆర్డీఏ పరిధిలోని అనంతవరం, నవులూరు, పెనుమాక, మందడం, తుళ్లూరు, దొండపాడు,  ఐనవోలు, నిడమర్రు గ్రామాల్లో 7,876 7,876 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2018- 19లో  2,444 ఇళ్లకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్‌డీఏ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 12 పట్టణాల్లో 33,264 టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి రెండు దఫాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణం 2018 నాటికి దాదాపుగా పూర్తయింది. మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉండగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. దీంతో ఈ ప్రక్రియ మొత్తంగా ఆగిపోయింది. 


మూడేళ్ల నుంచి ఊరిస్తున్న ఇళ్లు

2019లో ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం ఇళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తిగా వాయిదా వేసింది. నిర్మాణం చేపట్టిన 33,264 ఇళ్లలో 25,228 ఇళ్ల నిర్మాణం పూర్తయి మూడేళ్లు నిండినా ఇప్పటి వరకూ అవి లబ్ధిదారులకు దక్కలేదు.  2018లో ఆగిపోయిన మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల కరెంటు, సెప్టిక్‌ ట్యాంకు, మంచినీరు, అంతర్గత రోడ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. మే నెలాఖరులోగా ఈ సదుపాయాలన్నింటినీ కల్పించి జూన్‌ 15 నుంచి ఇళ్ల పంపిణీ చేపడతామన్నది ప్రభుత్వం మాట! అయితే మే నెలాఖరుల దగ్గరవుతున్నా ఇప్పటి వరకూ చాలా చోట్ల ఈ పనులు ప్రారంభం కూడా కాలేదు. గడిచిన మూడేళ్లుగా ఆలనాపాలన లేకపోవడంతో చాలాచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు దెబ్బతినిపోయాయి. ప్రాంగణమంతా పిచ్చిమొక్కలతో అడవిలా మారిపోయింది. ఇళ్లపై తీగలు అల్లుకుపోయాయి. విద్యుత్‌ మీటర్లు దెబ్బతినిపోయాయి. అంతర్గత రోడ్లు పూర్తిగా శిథిలమైపోయాయి. వీటన్నింటినీ సరిచేసి ఇళ్లు అందించాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 


9 వేల ఇళ్ల పంపిణీకి కసరత్తు

ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లు ఉమ్మడి జిల్లాలో 25,228 ఉండగా వాటిలో 9వేల ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తొలి దశ ఇళ్ల పంపిణీలో భాగంగా ఈ ఇళ్లను సిద్ధం చేస్తున్నామని వారు చెబుతున్నారు. అయితే ఇప్పటికే పూర్తికావాల్సిన వీటి తాలూకు మౌలిక వసతుల కల్పన నత్తనడకన సాగుతుండడంతో వచ్చే నెల ఇళ్ల పంపిణీపై లబ్ధిదారుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. 


 

Updated Date - 2022-05-26T05:29:50+05:30 IST