ఇంటి కల..ఎండమావే!

ABN , First Publish Date - 2022-08-01T04:54:08+05:30 IST

సొంత ఇంటి కోసం నెలల తరబడి పేదలు కళ్లు కాయలు కాచేలా ఎదుచూస్తున్నారు. ఇంటి మంజూరుపత్రం అందుకున్నా నివాసానికి అద్దె చెల్లించక తప్పడంలేదు.

ఇంటి కల..ఎండమావే!
తెనాలి పూలే కాలనీలో నిర్మాణం నిలిచిపోయి పిచ్చి మొక్కలు పెరుగుతున్న టీడ్కో గృహాలు

నిరుపయోగంగా వేలాది టిడ్కో గృహాలు

మూడేళ్లుగా తీరని పేదల కల

నిర్మాణం పూర్తయిన ఇళ్లూ శిథిలావస్థకు..

లబ్ధిదారులపై ఇటు అద్దెలు, అటు వడ్డీల భారం 


 పేదల సొంతింటి కల కల్లగానే మిగిలిపోతోంది. కట్టిన ఇళ్లు కళ్లెదుటే ఉన్నా ప్రభుత్వ నిర్వాకంతో అవి లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. పేదలకు పక్కా గృహాలు అందించాలన్న లక్ష్యంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వేల కోట్ల నిధులతో టిడ్కో గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అవన్నీ దాదాపు పూర్తయ్యాయి కూడా. కానీ ఆ ప్రభుత్వం కట్టిన ఇళ్లు తామెందుకు ఇవ్వాలనుకున్నారో ఏమో..? వాటిని పాడు పెట్టేశారు. తీవ్రమైన జాగు చేస్తూ శిథిలావస్థకు చేర్చారు. మూడేళ్ల నుంచి పట్టించుకోకపోవడంతో భవన సముదాయాలు పాడుబడ్డాయి. పర్యవేక్షణ లేక ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ నిర్లక్ష్యానికి గురయ్యాయి. లబ్ధిదారులకు వాటిని సకాలంలో అందించి ఉంటే వాటి రూపురేఖలు వేరే విధంగా ఉండేవి. ప్రభుత్వ నిర్వాకం వల్ల అటు లబ్ధిదారులకు ప్రయోజనం దక్కకపోగా అవి శిథిలమై పోతున్నాయి.


 నరసరావుపేట జూలై 31 : సొంత ఇంటి కోసం నెలల తరబడి పేదలు కళ్లు కాయలు కాచేలా ఎదుచూస్తున్నారు. ఇంటి మంజూరుపత్రం అందుకున్నా నివాసానికి అద్దె చెల్లించక తప్పడంలేదు. ఒక వైపు అద్దె, మరోవైపు ఇంటి వాటా ధనం కోసం చేసిన రూ.50వేలు అప్పుపై పెరుగుతున్న వడ్డీ లబ్ధిదారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇల్లు అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామంటూ  సర్కారు  ప్రకటనలకే పరిమితమవుతోంది. నిర్మించిన టిడ్కో గృహాలకు మౌలిక వసతులు కల్సించాల్సి ఉంది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నివాసం ఉండాల్సిన ఇళ్లు పాడుబడి పోతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇంటి మంజూరు పత్రాలను పంపిణీ చేయడంలో చేసిన హడావుడి ఇంటిని లబ్ధిదారులకు అప్పగించడంలో కానరావడంలేదు.


పల్నాడు జిల్లాలో ఇలా..

  జిల్లాలో 12,518 గత ప్రభుత్వం టిడ్కో గృహాల నిర్మాణాన్ని చేపట్టి 9,568 ఇళ్ళను పూర్తి చేసింది. మూడేళ్లుగా ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఈ గృహాలకు వసతులు కల్సించాల్సి ఉంది. తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజ్‌, రహదారులు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నరసరావుపేట మునిసిపాల్టీ పరిఽధిలో 1504 గృహాల నిర్మాణం పూర్తయి మూడేళ్లయింది. ఒక్క ఇంటిని కూడా లబ్ధిదారునికి అందజేయలేదు. దీంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ గృహాలకు చేపట్టిన మౌలిక వసతులు పనులు  సాగుతున్నాయి. ఇప్పట్లో గృహాలను లబ్ధిదారులకు అందజేసే పరిస్థితులు కానరావడంలేదు. సత్తెనపల్లి పట్టణంలోని భీమవరం డొంకరోడ్డులో ఉన్న చెరువులో 160 టిడ్కో గృహాలను టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ మాత్రం నేటి వరకు జరగలేదు. నిర్మాణాలు కూడా పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంది. పిడుగురాళ్ల సమీపంలో మొత్తం 4వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో గత ప్రభుత్వ హయాంలోనే 75శాతం పైగా 2,832 గృహాల పనులు జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇళ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. టెండరు దక్కించుకున్న నిర్వాహకులు కూడా యంత్ర సామాగ్రితో సహా ఇక్కడి నుంచి తరలిపోయారు. ఈలోగా 217 మంది పొదుపు సంఘ మహిళలకు రూ.5.90 కోట్లు బ్యాంకులో రుణాన్ని మంజూరు చేశాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణపనులు పూర్తయి గృహప్రవేశాలు జరిగాకే వాయిదాలు చెల్లించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ బ్యాంకర్లు మాత్రం అవేమీ కుదరదంటూ వాయిదాలు చెల్లించాలని రుణాలు తీసుకున్న మహిళలపై వత్తిడి తెస్తూనే ఉన్నారు. నిర్మాణ పనులు అంగుళం కూడా కదలకపోవటం వల్ల ఖాళీ స్థలాల్లో చెట్లు పిచ్చిమొక్కలు మొలిచి చిట్టడవిని తలపించేలా ఉంది. పాత ఇనుము, మరికొంత సామగ్రి చోరీకి గురవుతూనే ఉన్నాయి. వినుకొండ పట్టణంలో రెండో విడత టిడ్కో ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించింది. పట్టణంలో మొత్తం 4,028 మంది లబ్ధిదారులను గుర్తించి అప్పటి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సహకారంతో వెల్లటూరు రోడ్డులోని కొండ వద్ద టిడ్కో ఇళ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. మొదటిగా 480 ఇళ్లకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారుల నుంచి వినుకొండ మున్సిపాలిటీ అధికారులు డీడీలు సేకరించారు. 2019 నాటికి 90 శాతం ఇంటి నిర్మాణాలు పూర్తి కాగా ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులు నిలిపివేశారు. ప్రభుత్వం ఎప్పుడు కనికరిస్తోందనని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.  

 

బాపట్ల జిల్లాలో..

 బాపట్ల జిల్లాలో టిడ్కో ఆధ్వర్యంలో రేపల్లె, అద్దంకి పరిధిలో ఇళ్ల నిర్మాణాన్ని గతంలో చేపట్టారు. 2019లో ప్రభుత్వం మారడంతో వీటికి గ్రహణం పట్టింది. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలు నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి. రేపల్లె పరిధిలో 1,500 ఇళ్లకు ఆమోదం తెలపగా సుమారు 1,360 గృహాలకు లబ్ధిదారులకు కేటాయించారు. అద్దంకి పరిధిలో 960 ఇళ్లకు గాను 93 మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. వీటిని ఎప్పుడు కేటాయిస్తారోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల ముందు పిచ్చిమొక్కలు పెరిగి బీళ్లనుతలపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల చిన్నపాటి వర్షాలకే నీళ్లు నిలబడి తటాకాలను తలపిస్తున్నాయి. లబ్ధిదారులకు వాటిని సకాలంలో అందించి ఉంటే వాటి రూపురేఖలు వేరే విధంగా ఉండేవి. ప్రభుత్వ నిర్వాకం వల్ల అటు లబ్ధిదారులకు ప్రయోజనం దక్కకపోగా అవి శిథిలమై పోతున్నాయి. అద్దంకి పరిధిలోని శింగరకొండ రోడ్డులోని టిడ్కోఇళ్ల సముదాయంలో మోకాళ్ల ఎత్తు పెరిగిన పిచ్చి మొక్కలతో దాదాపు ఆ ఇళ్ల పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. రేపల్లె పరిధిలోని టిడ్కోఇళ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. మొండిగోడలతో దర్శనమిస్తూ నిర్మాణం శిథిలావస్థకు చేరినట్లు కనబడుతోంది. 


 గుంటూరు జిల్లాలో..

గుంటూరు నగర శివారులోని అడవి తక్కెళ్లపాడులోనూ పెండింగ్‌ వర్కులు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎస్‌టీపీ పనిని ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 352 యూనిట్లలో ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ రిపేర్లు మొదలు పెట్టారు. ఇక్కడ మొత్తం 4,192 ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇంటర్నల్‌ పెయింటింగ్‌ పూర్తి అయినా బయట పెయింటింగ్‌, ప్లంబింగ్‌, ఛాంబర్‌ రిపేర్లు కొనసాగుతోన్నాయి. ఈఎల్‌ఎస్‌ఆర్‌ని సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి చేస్తామంటోన్నారు. 352 యూనిట్లకు సెప్టింగ్‌  ట్యాంకు అందుబాటులో ఉన్నది. ఎస్‌టీపీ పనులు ఆగస్టు నెలాఖరుకు డెడ్‌ లైన్‌ పెట్టారు. వెంగళాయపాలెంలో నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. పనులు పునఃప్రారంభించాలని ఏజెన్సీకి నోటీసులు జారీ చేశారు. తెనాలి చినరావూరులో 848 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. డిసెంబరు నాటికి పనులన్నింటిని పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తెనాలి పూలే కాలనీలో నిర్మిస్తోన్న సముదాయాల్లో ఏజెన్సీ పనులను అర్ధంతరంగా నిలిపేసింది. ఇప్పటివరకు కేవలం 45 శాతం పనులు మాత్రమే అక్కడ పూర్తి అయ్యాయి. పొన్నూరు నిడుబ్రోలులో 240 ఫ్లాట్లకు పెయింటింగ్‌ పనులు జరుగుతోన్నాయి. ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ పనులు ఇంకా చేపట్టనే లేదు. ఎస్‌టీపీ పనిని ఆగస్టు 15వ తేదీకి పూర్తి చేస్తామని ఏజెన్సీ చెబుతోంది.  మంగళగిరి ఆర్‌జీకే కాలనీలో 1,728 ఫ్లాట్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఏపీసీఆర్‌డీఏ పరిధిలో 5,024 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కాగా వీటిని ఈ ఏడాది డిసెంబరు నాటికి స్వాధీనపరుస్తామని ఏజెన్సీ పేర్కొంది. ఈ విధంగా అన్ని చోట్ల పెండింగ్‌ పనులు ఉండటంతో లబ్ధిదారుల చేతికి ఫ్లాట్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. 


 


Updated Date - 2022-08-01T04:54:08+05:30 IST