టిడ్కో... డబ్బులిచ్చుకో..

ABN , First Publish Date - 2022-07-05T06:17:20+05:30 IST

పట్టణ పేద, మధ్య తరగతి వారి కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి.

టిడ్కో... డబ్బులిచ్చుకో..

 వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి దందా  

 ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూళ్లు

 లబ్ధిదారుల జాబితాలోనూ అక్రమాలు


డోన్‌, జూలై 4: 


పట్టణ పేద, మధ్య తరగతి వారి కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. వీటిని ఓ ప్రజాప్రతినిధి అమ్మకానికి పెట్టారు. ఒక్కో ఇంటికి ఒక్కో రేటు నిర్ణయించి... వసూలు  సాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల జాబితాలలో అనర్హులను చేర్పించి...  అందినంత  దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన ఆ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఈ దందా నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డోన్‌ అర్బన్‌లో టిడ్కో ఇళ్ల వ్యవహారంలో సాగుతున్న ఈ తంతు హాట్‌ టాపిక్‌గా మారింది. గత టీడీపీ ప్రభుత్వం  పట్టణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వర్గాల  సొంతింటి కలను నెరవేర్చాలనే  ఉద్దేశంతో టిడ్కో ఇళ్ల పథకాన్ని చేపట్టింది. డోన్‌ అర్బన్‌లో 306 మంది లబ్ధిదారులకు ఈ ఇళ్లు మంజూరయ్యాయి. పట్టణ సమీపంలోని హైవే పక్కన టైలర్స్‌ కాలనీలో 2018లో ఈ ఇళ్ల నిర్మా ణం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం మారడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. వైసీపీ ప్రభుత్వంలో రివర్స్‌ టెండరింగ్‌ ఇచ్చి మిగిలిన నిర్మాణాలను చేపట్టింది. 


వసూళ్ల దందా


టైలర్స్‌ కాలనీలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లలో భారీగా వసూళ్ల దందా నడుస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీకి చెందిన ఒక వైసీపీ ప్రజాప్రతినిధికి టిడ్కో ఇళ్లను అప్పగించారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యుల అండ ఉండటంతో ఆ వైసీపీ నాయకుడి అక్రమాలకు అడ్డే లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాత లబ్ధిదారుల జాబితాలో 130 మంది టైలర్లకు టిడ్కో ఇళ్లను ఇచ్చారు. మిగతా లబ్ధిదారుల స్థానంలో అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. పాత లబ్ధిదారుల పేర్లు గల్లంతు చేసినట్లు తెలుస్తోంది. ఆ వైసీపీ నాయకుడు ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రూ.లక్ష దాకా రేటు కట్టి వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఇలా సొంతింటి ఆశ చూపి అనేక మంది నుంచి రూ.లక్షలు గుంజుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో టిడ్కో ఇళ్లలో అనర్హులే పాగా వేస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల జాబితా విషయం లో మున్సిపల్‌ అధికారులు   గోప్యత పాటిస్తుండడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది.


దళారులను నమ్మి మోసపోవద్దు

 

డోన్‌ అర్బన్‌లో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు.  నేను కొత్తగా బాధ్యతలు చేపట్టినందున టిడ్కో ఇళ్ల వసూళ్ల విషయం తెలియడం లేదు. ఎవరికైనా అన్యాయం జరిగితే నేరుగా మున్సిపల్‌ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.                       


-వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌, డోన్‌ 


240 ఇళ్లు పూర్తి


పట్టణ సమీపంలోని టైలర్స్‌ కాలనీలో 240 టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయి. మరో 48 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 288 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. వీటిని కేటాయించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటి వెనుక పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


హైకోర్టును ఆశ్రయించిన టీడీపీ నాయకులు

 పట్టణ సమీపంలోని టైలర్స్‌ కాలనీలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లలో జరుగుతున్న అవకతవకలపై కొందరు టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. లబ్ధిదారుల పేర్లు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్‌ దాఖలు చేశారు. పాత జాబితా ప్రకారమే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఇవ్వాలని అందులో కోరారు. ఈ పిటీషన్లను విచారించిన హైకోర్టు... టిడ్కో ఇళ్లకు  స్టే విధించింది. దీంతో హైకోర్టులో వేసిన పిటీషన్‌ను ఉప సంహరించుకోవాలని టైలర్స్‌ అసోసియేషన్‌ నాయకులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.  దీనికి టైలర్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఒప్పుకోవడం లేదని సమాచారం.

Updated Date - 2022-07-05T06:17:20+05:30 IST