మూడేళ్ల ‘గృహ’ణం

ABN , First Publish Date - 2022-08-04T06:04:50+05:30 IST

మూడేళ్ల ‘గృహ’ణం

మూడేళ్ల ‘గృహ’ణం
నిరుపయోగంగా జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లు

మూడేళ్లుగా ముందుకు కదలని టిడ్కో ఇళ్లు

రూ.కోట్లు పెట్టి నిర్మించినవి నిరుపయోగంగా..

శిథిలావస్థకు చేరి సర్వం నాశనం

టీడీపీ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి

10 శాతాన్ని కూడా పట్టించుకోని వైసీపీ

టెండర్లు పిలిచిన వాటికీ అతీగతీ లేదు

తాజాగా రుణాల పేరిట నాటకాలు

ఇళ్లు ఇవ్వకుండానే రికవరీలు


‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ టిడ్కో ఇళ్ల నిర్మాణ విషయంలో ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు పూర్తయిన ఇళ్లకు పదిశాతం తుది మెరుగులు కూడా వైసీపీ ప్రభుత్వం దిద్దకపోవడంతో మూడేళ్ల కిందటి పరిస్థితే ఇప్పుడూ ఉంది. 90 శాతం పనులు పూర్తయిన ఇళ్లు చేతికందక, మౌలిక సదుపాయాలు కల్పించక, తాజాగా రుణాలు, వాటి రికవరీల పేరిట వేధింపులు భరించలేక లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నగర, పట్టణ ప్రాంతాలకు కలిపి 96,138 టిడ్కో ఇళ్లను మంజూరు చేశారు. తొలిదశలో 42,962 ఇళ్ల పనులకు టెండర్లు పిలిచారు. వీటిలో 31,424 ఇళ్లకు సంబంధించి పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి. 70 నుంచి 75 శాతం మేర నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నాయి. కొన్నింటికి ఫినిషింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఇళ్లను రద్దు చేయాలనుకుంది. లబ్ధిదారులు జగనన్న ఇళ్లవైపు ఆకర్షితులయ్యేలా చేసింది. అయితే, నిర్మాణ పనులు జరిగిన టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు అంగీకరించలేదు. దీంతో పూర్తిగా కాకుండా పాక్షికంగా రద్దు చేశారు. రెండు జిల్లాల్లో గ్రౌండ్‌ అయిన 31,424 ఇళ్లు మినహా మొదటి దశ బ్యాలెన్స్‌, రెండో దశలో టెండర్‌ పిలవాల్సిన మొత్తం 64,714 టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. గ్రౌండింగ్‌ కు సంబంధించి చూస్తే 31,424 ఇళ్ల నిర్మాణాలు కిందటి నెల వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నాయి. 

ఎక్కడెక్కడ ఎలా?

విజయవాడ నగరానికి సంబంధించి జక్కంపూడిలో 6,576 ఇళ్లు, గుడివాడలో మల్లాయపాలెం-1లో 3,296, మల్లాయపాలెం-2లో 5,616, మచిలీపట్నం పరిధిలోని గోసాలలో 960, రుద్రవరంలో 3,216, జగ్గయ్యపేట ఫేజ్‌-2లో 1,488, ఫేజ్‌-3లో 1,920, ఉయ్యూరులోని జెమిని ప్లే స్కూల్‌లో 1,824, గండిగుంటలో 480, రాఘవ ఎస్టేట్స్‌లో 192, తిరువూరు ఫేజ్‌-1లో పీటీ కొత్తూరులో 1,776, నందిగామ ఫేజ్‌-2 హనుమంతునిపాలెంలో 1,392 ఇళ్లు గత ప్రభుత్వ హయాంలోనే గ్రౌండ్‌ అయి వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్లు పిలిచిన వాటికి సంబంధించి ఇంకా 11,538 ఇళ్ల పనులు ప్రారంభించాల్సి ఉంది. జక్కంపూడి తప్ప కొత్తగా టెండర్‌ బ్యాలెన్స్‌ ప్రకారం నిర్మించాల్సిన ఇళ్ల పనులు చేపట్టలేదు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల పనులపై దృష్టి సారించలేదు. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో దాదాపు పూర్తయిన టిడ్కో ఇళ్లలో తుది పనులు చేపడుతున్నారు. అవి కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు రెండేళ్లలో పూర్తయ్యే పరిస్థితి లేదు. 

వివిధ పట్టణాల్లో ఇలా..

టెండర్లు పిలిచిన వాటికి సంబంధించి బ్యాలెన్స్‌ పనుల విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం చొరవ చూపించలేదు. జక్కంపూడిలో ఇంకా 4,048 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, ఆ ఊసే లేదు. గుడివాడ పరిధిలో మొత్తం 11,912 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, గత ప్రభుత్వ హయాంలో 8,912 తలపెట్టారు. ఇంకా 3వేల ఇళ్ల నిర్మాణ పనులు ఈ ప్రభుత్వం చేపట్టలేదు. మచిలీపట్నం పట్టణ పరిధిలో 6,400కు గానూ 4,176 ఇళ్ల పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. మిగిలిన 2,224 ఇళ్ల పనులను చేపట్టలేదు. పెడనలో 768 ఇళ్లకు ఎన్నికల ముందు టెండర్లు పిలిచారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ టెండర్‌ పిలిచినా ఇప్పటికీ ఇళ్ల పనులను చేపట్టలేదు. జగ్గయ్యపేటలో టెండర్‌ ప్రకారం 3,424 ఇళ్ల పనులు చేపట్టాల్సి ఉండగా, 3,408 ఇళ్ల పనులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. కేవలం 16 ఇళ్లను కూడా నిర్మించలేక పోయారు ఉయ్యూరు, తిరువూరు, నందిగామలో వందల సంఖ్యలో ఇళ్ల పనులు చేపట్టలేదు. 

అయ్యో.. జెట్‌సిటీ 

విజయవాడ నగరవాసుల కోసం జక్కంపూడి ఎకనమిక్‌ టౌన్‌షిప్‌ (జెట్‌ సిటీ)లో టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. పని, నివాసం అనే విధానంలో ఇంటికి సమీపంలోనే పనులు చేసుకునేలా ఇండస్ర్టియల్‌ కాంప్లెక్సులను నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం జెట్‌ సిటీలో 55,800 ఇళ్లను వివిధ దశల్లో నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 10,624 ఇళ్లకు టెండర్లు పిలవగా, 6,576 ఇళ్ల పనులు 70 శాతం పూర్తయ్యాయి. అలాగే, ఫుట్‌వేర్‌ యూనిట్ల కోసం తొలి దశలో ఇండస్ర్టియల్‌ కాంప్లెక్సును నిర్మించారు. ఇక టిడ్కో ఇళ్లకు సంబంధించి మరో ఐదు బ్లాకుల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. జెట్‌ సిటీ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పక్కన పెట్టేయటంతో అమరావతి తరహాలోనే ఆర్థిక రాజధాని ఊసు కూడా లేకుండాపోయింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఇళ్ల ప్రాంగణమంతా అడవిని తలపిస్తోంది. 

రుణాల పేరిట హడావుడి

టిడ్కో ఇళ్లకు లబ్ధిదారుల వాటాగా బ్యాంకుల నుంచి రుణం తీసుకునే సౌకర్యం గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అసలు లబ్ధిదారులకు ఇళ్లు అందే స్థితే లేదు. కానీ, రుణానికి సంబంధించి బ్యాంకు వాయిదాలు చెల్లించాల్సి వస్తోంది. తాజాగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రుణ సమీకర ణ జరపాలని నిర్ణయించింది. ఇంటి పత్రాలే గ్యారెంటీగా రుణాలను తీసుకుని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలోనూ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. రుణాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు గరిష్టంగా 20 శాతం కూడా సాధించలేదు. 

దుస్థితిలో టిడ్కో ఇళ్లు

గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు చాలావరకు శిథిలావస్థలో ఉన్నాయి. మూడేళ్లుగా పట్టించుకోకపోవటం వల్ల ఘోరంగా మారాయి. పిచ్చిచెట్లు పెరిగి, విషసర్పాలకు ఆవాసాలుగా మారాయి. పూర్తిగా పాడుబడ్డాయి. నిర్మానుష్యంగా మారిపోవటంతో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్రసులయ్యాయి. 

మౌలిక సదుపాయాలు మృగ్యం

రెండు జిల్లాల్లోనూ టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పన మిథ్యగా మారింది. రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, సూయేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయినేజీ, వాటర్‌ పైపులైన్లు, వాటర్‌ ట్యాంక్‌ వంటి నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, ఎక్కడా ఆచూకీ కూడా లేదు. ఎప్పుడు కల్పిస్తారో తెలియదు.












Updated Date - 2022-08-04T06:04:50+05:30 IST