గూడు..పుఠాణి

ABN , First Publish Date - 2022-07-19T05:58:09+05:30 IST

గూడు..పుఠాణి

గూడు..పుఠాణి
గో సంఘంలో అసంపూర్తిగా టిడ్కో ఇళ్లు

బందరులోని టిడ్కో ఇళ్ల కేటాయింపులో అధికార పార్టీ వివక్ష

టీడీపీ సానుభూతిపరుల పేర్లు గల్లంతు

ఇళ్లు కేటాయించి, డీడీలు కట్టిన 1,872 మందికి మొండిచెయ్యి

ఆ స్థానంలో వైసీపీ వారికి కట్టబెట్టే ప్రయత్నాలు

డబ్బు తిరిగిచ్చేస్తామంటున్న అధికారులు

లబోదిబోమంటున్న లబ్ధిదారులు


బందరులోని గో సంఘం, రుద్రవరంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల కేటాయింపు అధికార పార్టీ ఇష్టానురీతిన జరుగుతోంది. టీడీపీ హయాంలో ఇళ్లు కేటాయించి, డబ్బు కట్టించుకుని, ఫ్లాట్లు పొందిన లబ్ధిదారుల జాబితాను తారుమారు చేసి, వైసీపీ అనుయాయులకు అక్రమంగా కట్టబెడుతున్నారు. ఇళ్లు ఎప్పటికైనా ఇస్తారులే.. అని ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న 1,872 మంది లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతూ అధికార పార్టీతో పాటు అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మచిలీపట్నం టౌన్‌ : టీడీపీ ప్రభుత్వ హయాంలో బందరులోని గో సంఘం, రుద్రవరంలో 6వేల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంకల్పించారు. 300, 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లుగా 4,176 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టి 2,304 పూర్తి చేశారు. మిగిలిన 1,872 ఇళ్ల నిర్మాణాలు పునాదుల్లోనే ఉండిపోయాయి. అప్పట్లో ఇళ్లకు అడ్వాన్స్‌ చెల్లించి రిజిస్టర్‌ చేయించుకున్న 4,176 మందికి అప్పటి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో లాటరీ తీసి ఫ్లాట్లు కేటాయించారు. ఆ తరువాత ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణం ఆగిపోయింది. మౌలిక సదుపాయాలూ కల్పించలేదు. టీడీపీ ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం డిసెంబరులో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇస్తామని చెబుతోంది. పనిలో పనిగా వైసీపీ నేతలకు, తమ అనుయాయులకు, పార్టీ సానుభూతిపరులకు ఆ ఇళ్లు ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. బందరులో డీడీలు కట్టిన లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండి, టిడ్కో ఇళ్లు తక్కువగా ఉండటంతో ఇదే అదనుగా టీడీపీ సానుభూతిపరులంటూ 1,872 మందికి ఇళ్లు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిస్తోంది. ఇళ్లకు బదులు కరగ్రహారంలో స్థలాలు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో సొంతిళ్లు ఆశించిన లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. వడ్డీకి అప్పు తెచ్చి రెండు నుంచి నాలుగు ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 

లబ్ధిదారుల ఆగ్రహం

టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయికే రిజిస్ర్టేషన్‌ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగానే ఫ్లాట్లు కేటాయిస్తున్నారు. అయితే, గతంలో టీడీపీ లాటరీ తీసి ఇచ్చిన ఫ్లాట్ల జాబితా తారుమారైంది. టీడీపీ సానుభూతిపరుల పేర్లు గల్లంతయ్యాయి. నిర్మాణాలు పూర్తయిన 2,304 మందికి మాత్రమే ఫ్లాట్లు కేటాయిస్తూ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఫ్లాట్లు కేటాయించని లబ్ధిదారులు టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ చుట్టూ తిరుగుతున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారి నాగశాస్ర్తులు బదిలీ కావడంతో కిందిస్థాయి అధికారులు తలలు బాదుకుంటున్నారు. పట్టాలు పొందిన లబ్ధిదారులు రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి టిడ్కో ఇళ్లను రిజిస్టర్‌ చేయించుకుంటున్నారు. డబ్బు చెల్లించి కమిషనర్‌ పేర డీడీలు తీసిన లబ్ధిదారులు టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌కు వెళ్లి రిజిస్ర్టేషన్లు ఎప్పుడు చేయిస్తారని అడుగుతున్నారు. ‘మీ పేర్లు జాబితాల్లో లేవు, మీకు డబ్బు వెనక్కి తిరిగిచ్చేస్తాం’ అని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరగ్రహారంలో సెంటు స్థలం ఇచ్చామని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

వైసీపీ కార్పొరేటర్ల అనుయాయులకే..

నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో 44 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలవడంతో ఎవరికి వారు తమ అనుయాయులకే ఇళ్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాయిదాలు చెల్లించిన టీడీపీ సానుభూతిపరులకు ఇళ్లు ఇవ్వలేమని వలంటీర్లు తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం మారేసరికి నిబంధనలు మారతాయా అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేస్‌మెంట్‌ స్థాయిలో మిగిలిపోయిన 1,872 ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి లాటరీ తీసిన వారికి ఫ్లాట్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. చాలామంది లబ్ధిదారులు స్థలం తీసుకునేందుకు అంగీకరించడం లేదు. కొంతమంది గత్యంతరం లేక అంగీకార పత్రాలు సమర్పిస్తున్నారు. అంగీకార పత్రాలు ఇవ్వని లబ్ధిదారులకు, సచివాలయాల్లోని సిబ్బందికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. 


అప్పుచేసి రూ.50 వేలు చెల్లించా..

టిడ్కో ఇంటి కోసం టీడీపీ హయాంలో అప్పుచేసి రెండుసార్లు రూ.25 వేల చొప్పున మునిసిపల్‌ కమిషనర్‌ పేర డీడీలు తీసి చెల్లించా. రశీదులు కూడా ఇచ్చారు. వృద్ధురాలినని కింద ఫ్లాటు కేటాయించారు. టిడ్కో ఇళ్లు రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారని తెలిసి సచివాలయం వద్దకు వెళ్లాను. గతంలో నాకు మంజూరైన ఫ్లాటుకు రిజిస్ర్టేషన్‌ చేయాలని కోరాను. కుదరదని, కరగ్రహారంలో సెంటు స్థలం ఇస్తామని సచివాలయ కార్యదర్శులు చెప్పారు. చేసిన అప్పుకు వడ్డీలు కడుతున్నా. మానవతా దృక్పథంతో అధికారులు నా ఫ్ల్లాట్‌ను రిజిస్టర్‌ చేయించాలి.  - కోడూరి కళావతి, టిడ్కో లబ్ధిదారు


కొందరికి ఇవ్వలేకపోతున్నాం.. 

టిడ్కో ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి కాలేదు. కొన్ని పునాదుల్లో, మరికొన్ని సగం నిర్మాణంలో ఆగిపోయాయి. ఆగిపోయినవి 1,872 ఫ్లాట్లు. వాటిని ఇవ్వలేని వారికి డబ్బు తిరిగి ఇస్తాం.

- జి.చంద్రయ్య, నగరపాలక సంస్థ కమిషనర్‌

Updated Date - 2022-07-19T05:58:09+05:30 IST