టిడ్కో గృహాలపై నీలినీడలు

ABN , First Publish Date - 2020-10-23T10:48:57+05:30 IST

గత టీడీపీ ప్రభుత్వం పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది.

టిడ్కో గృహాలపై నీలినీడలు

నిర్మాణాల పూర్తికి వైసీపీ వెనకడుగు

ఇప్పటికే 6,528 గృహాల రద్దు

11,107మంది లబ్ధిదారుల ఎదురుచూపులు

రద్దయినవారికి ఇంటి స్థలం కేటాయింపు


   చిత్తూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వం పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను  వైసీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. పునాది దశలో ఉన్న గృహాలను పూర్తి చేయకపోగా.. డిపాజిట్‌ చెల్లించిన లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లుతూ గత జూన్‌లో జిల్లావ్యాప్తంగా 6,288 గృహాలను రద్దు చేసింది. వారికి ప్రభుత్వం పంపిణీ చేయదలిచిన ఇంటి పట్టాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన 11,107 గృహాలను కూడా డబ్బులు కట్టిన లబ్ధిదారులకు అప్పగించలేదు. శ్రీకాళహస్తి, చిత్తూరు వంటి ప్రాంతాల్లో కొందరికి నామమాత్రంగా గృహానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను అందించారు. పునాది దశలో ఉన్న నిర్మాణాలను రద్దు చేయడంతో అలాంటి అసంపూర్తి నిర్మాణాల మీదున్న ఇనుప కమ్మీలన్నీ తుప్పు పట్టిపోతున్నాయి.


జిల్లాలోని రెండు నగర, ఆరు పురపాలికల్లో టిడ్కో ద్వారా 18,069గృహాలు మంజూరయ్యాయి. వీటిలో వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి 6288 గృహాలు పునాది దశలో ఉండటంతో ఈ ఏడాది జూన్‌లో వాటిని రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ.. డిపాజిట్‌ చేసిన లబ్ధిదారులు ఇంటి పట్టాల కంటే టిడ్కో గృహాలకే మొగ్గు చూపుతున్నారు. ఇంటి స్థలం జనావాసాలకు దూరంగా ఇస్తున్నారని.. ఆ స్థలం తీసుకున్నా.. భవిష్యత్తులో ప్రభుత్వం పక్కా గృహాన్ని నిర్మించి ఇస్తుందనే నమ్మకం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. డిపాజిట్‌ వెనక్కి ఇవ్వకుండా గృహాన్ని ఇవ్వాలంటూ కోరుతున్నారు.


టిడ్కో ఆధ్వర్యంలో మూడు రకాల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. 300 చదరపు అడుగుల గృహానికి లబ్ధిదారుడి వాటా రూ.500 కాగా.. 365 చ.అడుగులకు రూ.50 వేలు, అలాగే 430 చ.అడుగులకు రూ.లక్ష వేసుకోవాలి. అంటే లబ్ధిదారుల నుంచి ఈ మొత్తాన్ని అధికారులు నిర్మాణానికి ముందే వసూలు చేశారు. ప్రతి యూనిట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.1.5 లక్షల చొప్పున, మొత్తం రూ.3 లక్షలు ఉంటుంది. యూనిట్‌ను బట్టి బ్యాంకు రుణాలూ ఉంటాయి.


పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో 674 మంది వద్ద డిపాజిట్‌ సేకరించారు. టీడీపీ హయాంలోనే గడ్డూరు కాలనీ సమీపంలో గృహ నిర్మాణ సముదాయానికి 13 ఎకరాలను ఎంపిక చేసి చదును చేశారు. టిక్కో అధికారులు నిర్మాణాలు ప్రారంభించడం ఆలస్యం చేయడంతో.. ప్రస్తుతం అక్కడ ఇంటి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు కట్టినవారు మాత్రం ఇల్లు వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.


తిరుపతిలో 1200, నగరిలో 528 గృహాలను మంజూరు చేసినా.. వాటిన్నంటినీ  వైసీపీ ప్రభుత్వం జూన్‌లోనే రద్దు చేసింది. రద్దయిన ప్రాంతాల్లో లబ్ధిదారులకు డిపాజిట్‌ వెనక్కిచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. ఇలా రద్దయిన గృహాలకు సంబంధించిన డిపాజిట్ల సొమ్ము దాదాపుగా రూ.38 కోట్లు ఉన్నాయి. 


మున్సిపాలిటీ             కేటాయింపులు రద్దయినవి       ఇవ్వాల్సినవి

తిరుపతి 1200 1200         0

చిత్తూరు 3504 672         2832

మదనపల్లె 2928 1056         1872

శ్రీకాళహస్తి     6015 1632         4383

పుంగనూరు        2160 624         1536

పుత్తూరు      1060 576         484

నగరి       528 528            0

పలమనేరు        0 0         0

మొత్తం 17,395 6,288         11,107


Updated Date - 2020-10-23T10:48:57+05:30 IST