అధికార పార్టీలో ఆశావహుల జోరు

ABN , First Publish Date - 2021-04-15T05:32:44+05:30 IST

వరంగల్‌ నగర పాలకసంస్థ ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం సమీపిస్తుండటంతో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం మంత్రి కేటీఆర్‌ నగరంలో సుడిగాలి పర్యటన చేయడంతో ఎన్నికల జోరు మరింత ఊపందుకుంది. గత నెల రోజులుగా ఆశావహులు డివిజన్‌లలో మందు, విందు పార్టీలు ఇస్తూ ముందస్తు ప్రచారానికి తెరలేపారు.

అధికార పార్టీలో ఆశావహుల జోరు

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్లకు యమ డిమాండ్‌
ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలు
విజయావకాశాల సర్వే రిపోర్టుపై తాజా మాజీల్లో గుబులు
సగం మందికి టికెట్లు డౌటే అని ప్రచారం


హన్మకొండ టౌన్‌, ఏప్రిల్‌ 14:
వరంగల్‌ నగర పాలకసంస్థ ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం సమీపిస్తుండటంతో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం మంత్రి కేటీఆర్‌ నగరంలో సుడిగాలి పర్యటన చేయడంతో ఎన్నికల జోరు మరింత ఊపందుకుంది. గత నెల రోజులుగా ఆశావహులు డివిజన్‌లలో మందు, విందు పార్టీలు ఇస్తూ ముందస్తు ప్రచారానికి తెరలేపారు.  

కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా అధికార పార్టీ వారే కావడంతో ఆశావహులంతా ఆ పార్టీ టికెట్‌ను ఆశిస్తుండటం విశేషం. ప్రతీ డివిజన్‌లలో పదుల సంఖ్యలో ఆశావహులుండగా వారంతా అధికార పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇతర పార్టీలో ఉన్నవారు సైతం ఇటీవల టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని పోటీపడుతుండటంతో పోటీ ఎక్కువైంది. ఆశావహులు ఉదయమే ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ప్రత్యక్షమై ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేయడంతో పాటు రోజంతా వారు ఎటువెళితే అటు వెళ్తూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆశావహుల మధ్యనే పోటీ ఎక్కవగా ఉండే అవకాశాలు  కనిపిస్తున్నాయి.  

తాజా మాజీల్లో గుబులు
అధికార పార్టీకి చెందిన తాజా మాజీ కార్పొరేటర్లలో గుబులు ప్రారంభమైనట్లు సమాచారం. పాత డివిజన్‌లు 58 కాగా కాంగ్రెస్‌ 3, బీజేపీ 1 స్థానం మినహా మిగతా స్థానాలన్నీ అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే  గెలుపొందిన విషయం తెలిసిందే. వీరిలో అధికార పార్టీకి చెందిన తాజా మాజీ కార్పొరేటర్లలో 54 మందిలో 30 మందికి రెండవ సారి అవకాశం దక్కదనే  ప్రచారం సాగుతోంది. వీరిలో కొంతమంది రిజర్వేషన్‌ అనుకూలించక అవకాశం కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ మిగతా వారి పని విధానంతో అవకాశం కోల్పోవడం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు రెండవ సారి అవకాశం ఇచ్చి భంగపడ్డ విషయం తెలిసిందే. ఆ పొరపాటును వరంగల్‌లో చేయకూడదని అధికార పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

సిట్టింగ్‌లకు రెండవ సారి అవకాశం ఇవ్వడం మూలంగా హైదరాబాద్‌ ఎన్నికల్లో  చాలా మంది ఓటమి పాలయ్యారనే ఆలోచనతో అధికార పార్టీ తాజా మాజీల్లో చాలామందిని పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీ రహస్యంగా ఆ పార్టీ సిట్టింగ్‌ల పని విధానంపై సర్వే చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  నోటిఫికేషన్‌ జారీ అయిన వెంటనే కేటీఆర్‌ సమక్షంలో నగర కార్పొరేషన్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలతో భేటీ అయిన రోజున సర్వే రిపోర్టు బహిర్గతం చేసి గెలుపు గుర్రాలకు అవకాశాలు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది.

Updated Date - 2021-04-15T05:32:44+05:30 IST