శనగపై చినుకు పిడుగు

ABN , First Publish Date - 2021-12-01T05:36:23+05:30 IST

రబీ శనగ పంట ఈపాటికి పచ్చగా కళకళలాడేది. రోజులు తరబడి భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీటముని గింది.

శనగపై చినుకు పిడుగు
చాగలమర్రి: గొట్లూరులో కుళ్లిన శనగ పంట

  1. 50వేల హెక్టార్లలో కుళ్లిన పంట
  2. రూ.కోట్లలో పెట్టుబడి నష్టం
  3. పొలాల్లో 15 రోజులుగా నీరు
  4. ప్రత్యామ్నాయ సాగూ కష్టమే


చాగలమర్రి/రుద్రవరం/బనగానపల్లె, నవంబరు 30: రబీ శనగ పంట ఈపాటికి పచ్చగా కళకళలాడేది. రోజులు తరబడి భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీటముని గింది. పూత, పిందె దశలో అనుకోని కష్టం ఎదురైంది. సుమారు 15 రోజులపాటు నీరు నిల్వ ఉండటంతో పంట మొత్తం కుళ్లిపోయింది. ప్రత్యామ్నాయ పంట వేసేందుకూ వీలుకానంతగా పొలాలు దెబ్బతిన్నాయి. ఇంకో రెండు నెలలపాటు సాగుకు పనికిరావని రైతులు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు రూ.కోట్లలో పెట్టుబడి నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకుంటేగానీ ఈ విపత్తు నుంచి కోలుకోవడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో శనగ రబీ సాధారణ విస్తీర్ణం 1,63,526 హెక్టార్లు కాగా.. ఇప్పటికి 1,09,950 హెక్టార్లలో సాగైంది. ఇందులో దాదాపు 50 వేల హెక్టార్లలో వేరుకుళ్లు వ్యాపించి రైతులకు తీరని నష్టం జరిగిందని వ్యవసాయశాఖ జేడీఏ వరలక్ష్మి ప్రభుత్వానికి నివేదిక పంపారు. 

 

చాగలమర్రి మండలంలోని గొట్లూరు, కలుగొట్లపల్లె, నేలంపాడు, రాజోలి, మల్లేవేముల, పెద్దబోదనం, చిన్నబోదనం, రాంపల్లె తదితర గ్రామాల్లో 3 వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు. పూత, పిందె సమయంలో ఎడతెరిపి లేని వానలకు పంట కుళ్లిపోయింది. పొలాల్లో వర్షపు నీరు ఇంకా తగ్గలేదని, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. 


సంజామల, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, అవుకు, దొర్నిపాడు, కొలిమిగుండ్ల మండలాల పరిధిలో 35 వేల హెక్టార్లలో శనగ సాగు చేశారు. ప్రారంభంలో పంట కళకళలాడింది. తుపానుల కారణంగా పొలాల్లో నీరు చేరింది. చాలా చోట్ల శనగ పంట కుళ్లిపోతోంది. సొంత పొలం ఉన్నవారు ఎకరానికి రూ.15 వేలకు పైగా, కౌలు రైతులు రూ.25 వేలకు పైగా నష్టపోయారు. 


రుద్రవరం మండలం మందలూరు, చిలుకలూరు, ముత్తలూరు గ్రామాల రైతులు నక్కలదిన్నె గ్రామాల్లో 400 ఎకరాల్లో శనగ పంట వర్షానికి దెబ్బతింది. ఎకరాకు రూ.20 వేల వరకూ పెట్టుబడిని కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


రూ.5 లక్షల పెట్టుబడి నష్టం..


24 ఎకరాల్లో శనగ పంట సాగు చేశాను. విత్తనాలు, మందులు, సేద్యం కోసం ఎకరానికి రూ.20 వేల దాకా ఖర్చు చేశాను. పంట పచ్చగా ఉన్న సమయంలో తుపాను దెబ్బతీసింది. రూ.5 లక్షల దాకా నష్టం వాటిల్లింది. వేరే పంట వేద్దామంటే భూములు ఆరలేదు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూలీలకు కూడా సరిపోదు. దెబ్బతిన్న పంటను చూసేందుకు కూడా వ్యవసాయశాఖ అధికారులు పొలాల వైపు రాలేదు. ఇప్పుడు మాకు శనగ విత్తనాలు ఇచ్చిన ప్రయోజనం లేదు. 


- శివారెడ్డి, గొట్లూరు


భారీగా నష్టపోయాం..


ఎనిమిది ఎకరాల్లో శనగ పంట సాగు చేశాను. రూ.1.60 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. పంట పూర్తిగా దెబ్బతినింది. ప్రభుత్వం సబ్సిడీ శనగ విత్తనాలు ఇచ్చినా ప్రయోజనం లేదు. మరో రెండు నెలల వరకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి భూములు పనికిరావు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎందుకూ సరిపోదు. రెండేళ్ల నుంచి పంటల సాగు వల్ల నష్టపోతున్నాం. పెట్టబడుల కోసం చేసిన అప్పులు పెరిగిపోతున్నాయి. దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాం.                       


- రోషిరెడ్డి, గొట్లూరు


రూ.60 వేలు కౌలు..


ఏడు ఎకరాల్లో శనగ పంట సాగు చేసి నష్టపోయాను. ఇందులో 5 ఎకరాల కౌలు పొలం ఉంది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. భూ యజమానికి రూ.60 వేలు కౌలు చెల్లించాను. మళ్లీ శనగ పంట సాగు చేసి అప్పు చెల్లిస్తాను.


- నంద్యాల చంద్రశేఖర్‌ రెడ్డి, మందలూరు 


అప్పు ఎలా తీర్చాలి..?


18 ఎకరాల్లో శనగపంట సాగు చేశాను. అకాల వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాను. ఎలా తీర్చాలో తెలియడంలేదు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. 


- ముక్కమళ్ల రామసుబ్బారెడ్డి, గుంజలపాడు


నిండా మునిగాం..

20 ఎకరాల్లో శనగపంట సాగు చేశాను. వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. రూ.లక్షల్లో పెట్టుబడి ఖర్చు అయింది. పైసా కూడా తిరిగిరాదు.


- మొగదల మధుకుమార్‌, జొలదరాసి


జిల్లాలో 20.3 మి.మీ. వర్షపాతం


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 30: జిల్లాలో మంగళవారం దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. మొత్తం మీద 20.3 మి.మీ. వర్షం కురిసింది. అత్యధికంగా పాణ్యంలో 65.2 మి.మీ. నమోదైంది. మహానందిలో 63.2, ఓర్వకల్లులో 62.1, బండి ఆత్మకూరులో 61.2, గడివేములలో 58.4, నంద్యాలలో 47.6, కల్లూరులో 44.5, శిరివెళ్లలో 38.8, బేతంచెర్లలో 26.4, కర్నూలులో 35.4, మిడుతూరులో 34.2, గోస్పాడులో 33, రుద్రవరంలో 32, క్రిష్ణగిరిలో 31.4, నందికొట్కూరులో 30.4, దేవనకొండలో 27.8, దొర్నిపాడులో 23.2, కోడుమూరులో 23.2, ఆదోనిలో 21.2, గూడూరులో 20.4, మిగిలిన మండలాల్లో 5 నుంచి 18.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జేడీఏ వరలక్ష్మి తెలిపారు. నవంబరులో సాధారణ వర్షపాతం 27.6 మి.మీ. కాగా మంగళవారం నాటికి 116.9 మి.మీ. వర్షం కురిసింది. 

Updated Date - 2021-12-01T05:36:23+05:30 IST