గాలి వాన బీభత్సానికి అపార నష్టం

ABN , First Publish Date - 2021-04-22T05:37:14+05:30 IST

ఈదురు గాలులు, భారీ వర్షం, వడగండ్ల వాన రైతులకు తీరని నష్టం మిగిల్చింది.

గాలి వాన బీభత్సానికి అపార నష్టం
నేలపాలైన మామిడికాయలు చూపుతున్న కౌలు రైతు వెంకటరమణ

  1. నేలపాలైన మామిడి, అరటి, బొప్పాయి
  2. ఆందోళనలో కౌలు రైతులు


 ఓర్వకల్లు, ఏప్రిల్‌ 21: ఈదురు గాలులు, భారీ వర్షం, వడగండ్ల వాన రైతులకు తీరని నష్టం మిగిల్చింది. మంగళవారం సాయంత్రం గాలి వానకు మామిడి, అరటి, బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. కాపుకొచ్చిన పంట నేలపాలైంది. దీంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మామిడి పూత కళకళలాడుతుండటంతో రూ. లక్షలు వెచ్చించి రైతులు తోటలను కౌలుకు తీసుకున్నారు. అయితే అకాల వర్షం తీవ్ర నష్టం మిగిల్చింది. మండలంలోని పాలకొలను, కాల్వ, కాల్వబుగ్గ, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, చెన్నంచెట్టు పల్లె, కొమరోలు, బేతంచెర్ల మండలంలోని ఎంబాయి, మండ్లవానిపల్లె, రుద్రవరం గ్రామాల్లో దాదాపు 1000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ తోటల్లో మామిడికాయలు నేలపాలయ్యాయి. కొన్ని చోట్ల మామిడి చెట్లు విరిగిపడ్డాయి. మండలంలోని సోమయాజులపల్లె గ్రామానికి చెందిన మదన వెంకటరెడ్డి రైతుకు చెందిన బొప్పాయి తోట నేలపాలైంది. దీంతో రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. మండలంలోని కాల్వ, హుశేనాపురం, కాల్వబుగ్గ, సోమయాజులపల్లె గ్రామాల్లో 300 ఎకరాలకు అరటిచెట్లు నేలపాలయ్యాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత పది సంవత్సరాలుగా మామిడి, అరటి, బొప్పాయి పండ్లు చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి నేలపాలు కావడంతో రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల వలయంలో కూరుకుపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు, కౌలు రైతులు కోరుతున్నారు. 


 ఆదుకుంటాం: ఎమ్మెల్యే కాటసాని

గాలివానకు నేలపాలైన మామిడి, అరటి, బొప్పాయి తోటల రైతులు, కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే కాటసాని అన్నారు. బుధవారం మండలంలోని సోమయాజులపల్లె గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న బొప్పాయి తోటలను ఆయన పరిశీలించారు. ప్రతి రైతుకు నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మామిడి, బొప్పాయి కాయలు అమ్ముకునేలా కలెక్టర్‌తో చర్చించి రైతులకు తగు న్యాయం చేస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ శివరాముడు, ఏవో సుధాకర్‌, హార్టికల్చర్‌ అధికారులు ఉన్నారు. 


ఉరుము, మెరుపు దాడికి మహిళ అస్వస్థత 

ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామానికి చెందిన రమీజాబీ (32) మంగళవారం గాలివాన, ఉరుములు, మెరుపుల వల్ల కుప్పకూలిపోయి అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యలు కర్నూలు ఆసుపత్రిలో చేర్పించారు. మెదడులోని రక్తకణాలు బ్లాక్‌ కావడంతో పరిస్థితి విషమంగా ఉందని భర్త ఖాసీం సాహెబ్‌ తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


కొలిమిగుండ్ల: మండలంలో మంగళవారం రాత్రి వీచిన పెనుగాలులకు, వర్షానికి 70 ఎకరాల్లో అరటి తోటలు నేలకూలాయి. నాలుగున్నర ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. కొలిమిగుండ్ల, బందార్లపల్లె, మదనంతపురం, కల్వటాల, చింతలాయిపల్లె, బెలుం, నాయునిపల్లె, తిమ్మనాయునిపేట, ఉమ్మాయిపల్లె, నాగిశెట్టిపల్లె తదితర గ్రామాల పరిధిలో పెనుగాలులతో 52.3 ఎంఎంగా వర్షపాతం నమోదైనట్లు ఆర్‌ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. కొలిమిగుండ్లలో అందె బలరాముడుకు చెందిన 3 ఎకరాల్లో మామిడి చెట్ల కాయలు, బోయ మౌలాలమ్మకు చెందిన ఒకటిన్నర ఎకరాల మామిడి కాయలు నేలరాలాయి. మదనంతపురం గ్రామంలో శివారెడ్డికి చెందిన రెండు ఎకరాలు, నంద్యాల ప్రసాద్‌కు చెందిన ఎకరా, గంగరాజుకు చెందిన అర ఎకర, శివకు చెందిన ఒకటిన్నర ఎకర, మల్లారెడ్డికి చెందిన ఎకర, వెంకటరామిరెడ్డికి చెందిన రెండు ఎకరాల్లో అరటి చెట్లు కూలిపోయాయి. 


అవుకు: అవుకు మండలంలో కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలో 76.2 మి.మీ వర్షపాతం నమోదైంది. శింగనపల్లె గ్రామ సమీపంలో పిడుగు పడి నాయునిపల్లె గ్రామానికి చెందిన చంద్రగిరి గంగన్న, గొర్రిమానుపల్లె గ్రామానికి చెందిన కానాల రమణ అనే వ్యక్తులకు చెందిన 34 మేకపిల్లలు, 13 మేకలు మృతి చెందాయి. దాదాపు రూ. 2.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు పశువైద్యాధికారులు తెలిపారు. రబీలో సాగు చేసిన వరి పంట 500 ఎకరాల్లో నేల వాలింది. కొండమనాయునిపల్లె, జూనుంతల, గుండ్లశింగవరం, వేములపాడు, సుంకేసుల గ్రామాల్లో 25 విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగాయి. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంట కళ్లముందే నేల వాలటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ్దప్రాతిపదికన ట్రాన్స్‌కో ఏఈ పక్కీరయ్య సిబ్బందితో పనులు చేపట్టి విద్యుత్‌ను పునరుద్ధరించారు. విద్యుత్‌శాఖకు రూ. 4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్‌కో ఏఈ తెలిపారు. పశువైద్యాధికారులు ఐశ్వర్య, పద్మావతి చనిపోయిన మేకలకు పోస్టుమాస్టరం నిర్వహించారు. మేకల పెంపకం దారులకు నష్ట పరిహారం అందే విధంగా ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని తెలిపారు. 


సంజామల: ఉరుములు, మెరుపులు భారీ గాలులతో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మిరప, వరి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందారు. ఆరబెట్టిన మిరప, వరి దిగుబడులు తడిసిపోయి భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. కోత కోయని వరి పైరు నేలవాలిపోయిందని తెలిపారు. 


బనగానపల్లె: మండలంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి రబీలో వేసిన  వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన ధాన్యం తడిసిపోయింది. మంగళవారం సాయంత్రం వర్షానికి మండలంలోని రామతీర్థం, యర్రగుడి, కైప, చెర్వుపల్లె, పాతపాడు, యాగంటిపల్లె, మిట్టపల్లె, తమ్మడపల్లె, ఇల్లూరుకొత్తపేట, కాపులపల్లె, వెంకటాపురం, పసుపుల తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వేసిన వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి పొలాల్లో, కల్లాల్లో అరబెట్టిన వరి ధాన్యం తడిసి పోయింది. యాగంటిపల్లె గ్రామంలో బండి పార్వతమ్మ 5 ఎకరాల్లో వేసిన మునగపంట నేలకొరిగింది. సుమారు 2లక్షల వరకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ విస్తరణాధికారి ఓబులేసు మాట్లాడుతూ పంటనష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. మండలంలో మామిడి పంట కూడా పాక్షికంగా దెబ్బతిని రైతులు నష్టపోయారు. 


 పాములపాడు: ఈదురు గాలులు, అకాల వర్షాలకు అరటి పంట నేలకొరిగింది. మంగళవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలకు, మండలంలోని క్రిష్ణారావు పేట గ్రామానికి చెందిన విజయ రెండున్నర ఎకరాల్లో, సత్యనారాయణ మూడు ఎకరాల్లో అరటి పంట నష్టపోయారు. ఎకరానికి దాదాపు 80వేల నుంచి లక్ష రూపాయల మేర పెట్టుబ డులు వెచ్చించమని బాధితులు తెలిపారు. 

Updated Date - 2021-04-22T05:37:14+05:30 IST