మూడు ఆలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-21T16:40:30+05:30 IST

రాష్ట్ర హిందూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలోని రామేశ్వరం, మదురై, తిరువణ్నామలై ఆలయాల్లో రోజంతా అన్నదానం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రకటించారు.

మూడు ఆలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభం

చెన్నై: రాష్ట్ర హిందూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలోని రామేశ్వరం, మదురై, తిరువణ్నామలై ఆలయాల్లో రోజంతా అన్నదానం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ పథకాల అమలుపై శేఖర్‌బాబు అధ్యక్షతన అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఆలయ ఏనుగులకు ప్రత్యేకంగా బాత్‌ టబ్‌లను ఏర్పాటు చేయాలని, ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా 12 సుప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో అష్టోత్తర శత జ్యోతి పూజలను నిర్వహించాలని, రామేశ్వరం ఆలయం నుంచి కాశీ క్షేత్రానికి భక్తులకు ఆధ్యాత్మిక పర్యటనకు చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి శేఖర్‌బాబు తీవ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత యేడాది శాసనసభలో తమ శాఖకు సంబంధించి 112 ప్రకటనలను చేశామని, వాటిలో 90 శాతం కార్యరూపం దాల్చాయని చెప్పారు. ఈ యేడాది శాసనసభలో 165 ప్రకటనలు చేశామని, వాటిని వరుసగా అమలుపరిచేందుకు చర్యలు చేపడతున్నామని తెలిపారు.  ఇక రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, మదురై మీనాక్షి సుందరేశ్వరాలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో రోజంతా అన్నదానం నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ ఆస్తుల స్వాధీనంపై ప్రచురించిన పుస్తకంపై భక్తులు హర్షం ప్రకటిస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు 12 యేళ్ళకు పైగా కుంభాభిషేకం జరుగని ఆలయాల్లో వీలైనంత త్వరగా జీర్ణోద్ధరణ పనులు నిర్వహించనున్నామని మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చంద్రమోహన్‌, ఆ శాఖ కమిషనర్‌ జే కుమారగురుబరన్‌, అదనపు కమిషనర్లు ఆర్‌ కన్నన్‌, ఎన్‌.తిరుమగళ్‌, సి. హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T16:40:30+05:30 IST