హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు

ABN , First Publish Date - 2022-05-19T05:15:37+05:30 IST

ఏయూ విద్యావసతి గృహం వెనుక రఘుపాత్రుని రాజశేఖర్‌ను హత్య చేసిన ముగ్గురు నిందితులను బుధవారం మూడోపట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు
పోలీసులు స్వాధీనం చేసుకున్న హత్యకు ఉపయోగించిన వస్తువులు

రికవరీ ఏజెంటు హత్య కేసు ఛేదించిన పోలీసులు

అప్పు వివాదం హత్యకు దారితీసిన వైనం

విశాఖపట్నం, మే 18: ఏయూ విద్యావసతి గృహం వెనుక రఘుపాత్రుని రాజశేఖర్‌ను హత్య చేసిన ముగ్గురు నిందితులను బుధవారం మూడోపట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డు, చాకు, రాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ కోరాడ రామారావు నేతృత్వంలో హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఘటన జరిగిన 24 గంటల్లోపే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీఐ కేసు వివరాలు తెలిపారు.


రైల్వేన్యూకాలనీకి చెందిన రఘుపాత్రుని రాజశేఖర్‌ రికవరి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కాంచనదేవి వలంటీర్‌గా పనిచేస్తోంది. అతని ఇంటి ఎదురుగా నివాసముంటున్న షైక్‌ ఐజాక్‌ మదీనావల్లి అలియాస్‌ విశాఖకు రాజశేఖర్‌ కొంతమొత్తం అప్పు ఇచ్చాడు. తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో రాజశేఖర్‌ అడ్డు తప్పించుకోవాలని విశాఖ పథకం వేశాడు. శివాజీపాలానికి చెందిన బోగ ఉమామహేశ్వరరావు, కదురి సురేష్‌లతో తన పథకం చెప్పి రాజశేఖర్‌ను హత్య చేయడానికి నిర్ణయించాడు.


ఈనెల 16వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో రాజశేఖర్‌కు విశాఖ ఫోన్‌ చేశాడు. బయటకు వెళ్దామని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఏయూ విద్యావసతి గృహం వెనుకకు తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడున్న మహేశ్వరరావు, సురేష్‌లతో కలిసి రాడ్డుతో రాజశేఖర్‌ తలపై కొట్టి చాకుతో పొడిచారు. అతను మృతి చెందగానే నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు.


స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి ఫోన్‌ నుంచి అతని బార్య కాంచనకు సమాచారమివ్వగా ఆమె ఘటన స్థలానికి వచ్చి తన భర్యతో విశాఖకు ఉన్న గొడవలు గురించి చెప్పింది, వెంటనే విశాఖను ఆచూకి కోసం గాలించి అతన్ని పట్టుకుని అతనికి సహకరించిన మహేశ్వరరావు, సురేష్‌లను అరెస్ట్‌ చేశారు.   

Updated Date - 2022-05-19T05:15:37+05:30 IST