కుటుంబంలో పెను విషాదం.. అసలేం జరిగింది.. ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2021-07-02T18:43:03+05:30 IST

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

కుటుంబంలో పెను విషాదం.. అసలేం జరిగింది.. ఎందుకిలా..!?

  • ఆత్మహత్యాయత్నంతో విషమ పరిస్థితిలో మరొకరు
  • చనిపోయిన ఇద్దరూ తల్లీకూతుళ్లు

హైదరాబాద్ సిటీ/బోయినపల్లి : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన న్యూబోయినపల్లి మనోవికా్‌సనగర్‌ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. బోయినపల్లి సీఐ రవికుమార్‌ కథనం ప్రకారం.. రాజస్థాన్‌ రాష్ట్రం హనుమాన్పూడ్‌ జిల్లా నోహర్‌ గ్రామానికి చెందిన విజయ్‌ భాంటియా (41), ఉత్తరప్రదేశ్‌లోని రుద్రపూర్‌కు చెందిన స్నేహా భాంటియా (40) దంపతులు. వీరికి ఇద్దరు కూతుర్లు (కవలలు) హన్సిక (15), వన్షిక (15), కుమారుడు వీర్‌ భాంటియా (10) ఉన్నారు. విజయ్‌భాంటియా రాణిగంజ్‌లోని సేఫ్టీ సామగ్రికి సంబంధించిన ఓ దుకాణంలో పనిచేస్తుండగా, స్నేహ ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకుంటోంది. వీరి పిల్లలు న్యూబోయినపల్లిలోని ఓ మోడల్‌ స్కూల్‌లో చదువుతున్నారు. 


జూన్‌ 30న రాత్రి భోజనం చేసిన అనంతరం విజయ్‌, అతడి భార్య స్నేహ, కూతురు హన్సిక ఓ గదిలో, మరో కూతురు వన్షిక, కుమారుడు వీర్‌ భాంటియా మరో గదిలో నిద్రించేందుకు వెళ్లారు. విజయ్‌, స్నేహ రోజూ ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. ఈ క్రమంలో గురువారం నిద్రలేచిన కూతురు వన్షిక అమ్మానాన్నను లేపేందుకు వెళ్లగా వారు లేవలేదు. కొద్ది సేపటి తర్వాత లేస్తారులే అని భావించిన వన్షిక టీ తయారు చేసింది. 11 గంటల సమయంలో మరోసారి వారిని నిద్రలేపేందుకు ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా  లేవలేదు. రాజస్థాన్‌లోని తాతయ్యకు వన్షిక ఫోన్‌చేసి విషయాన్ని చెప్పింది. ఆయన కవాడిగూడలో నివాసముంటున్న సమీప బంధువు రాకేష్‌కు  ఫోన్‌ చేసి విషయం తెలిపారు. రాకేష్‌ హుటాహుటిన న్యూబోయినపల్లి మనోవికా్‌సనగర్‌ కాలనీలోని వారి ఇంటికి వచ్చి చూసేసరికి స్నేహ, హన్సికలు అప్పటికే మృతిచెందారు. విజయ్‌భాంటియా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.


అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాగా, ముగ్గురు కుటుంబసభ్యులు నిద్రించిన గదిలో ఓ డబ్బా పడి ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ఏదో విషం తాగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులే కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో క్లూస్‌టీం పలు ఆధారాలు సేకరించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం, ఇంటి యజమాని ఆస్పత్రిలో చికిత్స పొందడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. రాజస్థాన్‌లో నివాసముండే మిగతా కుటుంబసభ్యులు నగరానికి చేరుకోకపోవడంతో వన్షిక, వీర్‌ భాంటియాను బంధువులు తమతో పాటు తీసుకెళ్లారు.

Updated Date - 2021-07-02T18:43:03+05:30 IST