కూలిన పాఠశాల ప్రహరీ గోడ: ముగ్గురు చిన్నారుల దుర్మరణం

ABN , First Publish Date - 2021-12-18T16:44:29+05:30 IST

జిల్లా కేంద్రం తిరునల్వేలిలోని ఓ ప్రైవేటు పాఠశాల మరుగుదొడ్డి ప్రహరీ కూలిపడటంతో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్ల

కూలిన పాఠశాల ప్రహరీ గోడ: ముగ్గురు చిన్నారుల దుర్మరణం

- నలుగురికి తీవ్రగాయాలు

- స్టాలిన్‌ దిగ్ర్భాంతి, రూ.10లక్షల సాయం


చెన్నై: జిల్లా కేంద్రం తిరునల్వేలిలోని ఓ ప్రైవేటు పాఠశాల మరుగుదొడ్డి ప్రహరీ కూలిపడటంతో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈ ఘటన జరిగిందంటూ ఆగ్రహించిన విద్యార్థులు తరగతి గదుల్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కాగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మృతుల కుటుంబాలకు తలా రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. తిరునల్వేలి నగరం ఎన్‌ఎన్‌ హైరోడ్డు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ ఎదురుగా చాఫ్టర్‌ అనే ప్రైవేటు పాఠశాల ఉంది. వందేళ్లనాటి ఆ పాఠశాలలో సుమారు రెండు వేలమందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గటంతో ప్రస్తుతం ఆ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్వెల్‌ ప్రకటించడంతో విద్యార్థులు మూత్రవిసర్జన కోసం మరుగుదొడ్లవైపు వెళ్ళారు. ఆ సమయంలో పాఠశాల ప్రహరీ హఠాత్తుగా కూలింది. విద్యార్థులంతా కేకలేస్తూ పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని, గోడ శిథిలాలను తొలగించే పనులను చేపట్టారు. ఆ శిథిలాల మధ్య చిక్కుకుని రామాయణ పట్టికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి డి.విశ్వరంజన్‌ (13), తొమ్మిదోతరగతి విద్యార్థి కె.అన్బళగన్‌ (14), ఆర్‌.సతీష్‌ (14) దుర్మరణం చెందారు. ఇదే విధంగా గోడ శిథిలాల కింద చిక్కుకున్న ఎస్‌.సంజయ్‌, ఎం.ఇసక్కి ప్రకాష్‌, అబూబక్కర్‌, గిద్దాని, అబ్దుల్లా అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరునల్వేలి నగర పోలీసు కమిషనర్‌ సెందామరై కన్నన్‌, డిప్యూటీ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఇతర పోలీసులు సంఘటన స్థలం వద్ద విచారణ జరిపారు. అగ్నిమాపక దళం అధికారి సత్యకుమార్‌, పాళయంకోట ఫైర్‌ ఆఫీసర్‌ విరాజ్‌ తది తరులు శిథిలాలను తొలగించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


తరగతి గదుల ధ్వంసం

తమ తోటి విద్యార్థులు గోడకూలి దుర్మరణం చెందటంతో ఆగ్రహించిన ఆ పాఠశాల విద్యార్థులు తరగతి గదుల్లోకి చొరబడి ఫర్నిచర్‌ తదితర వస్తువులను ధ్వంసం చేశారు. పాఠశాల ప్రాంగణంలోని చెట్లను, మొక్కలను తొలగించి చెల్లాచెదురుగా పారవేశారు. ఆ తర్వాత రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకోకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ విష్ణు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల మరుగుదొడ్డి ప్రహరీగోడ పునాది లేకుండా నిర్మించడం వల్లే కూలినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల భవనాల పటిష్టతపై అధికారులతో పరిశీలన చేపడతామని చెప్పారు. 

Updated Date - 2021-12-18T16:44:29+05:30 IST